Internal Conflicts Between YSRCP Leaders: దుకాణాన్ని తరలిస్తున్నారని.. తానే పెట్రోల్ పోసి నిప్పంటించిన వైసీపీ నేత.. మున్సిపల్ ఛైర్మన్‌పై ఫైర్
Internal Conflicts Between YSRCP Leaders: విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. కో-ఆప్షన్ సభ్యుడు రియాజ్‌ఖాన్ దుకాణాన్ని పురపాలక శాఖ అధికారులు తొలగించేందుకు యత్నించడం తీవ్ర వివాదానికి కారణమైంది. తితిదే కల్యాణ మండపం వద్ద ఉన్న.. రియాజ్‌ఖాన్ దుకాణాన్ని పురపాలక అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య వేరే ప్రాంతానికి తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహించిన రియాజ్‌ఖాన్ తన దుకాణానికి తానే పెట్రోల్ పోసి నిప్పు పెట్టుకున్నారు. ఆ సమయంలో దుకాణానికి ఉన్న అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీ కాలిపోయింది.
ఈ ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే వెంకట చిన్న ఆప్పలనాయుడు చిత్రాలు ఉన్నాయి. పార్టీ జెండా మోసిన నాయకులకు ఇదేనా పరిస్థితి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ మురళీకృష్ణపై ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ మురళీకృష్ణ, కొంతమంది నాయకులు కక్షగట్టి తన దుకాణాన్ని తొలగించారని ఆరోపించారు. మున్సిపల్ ఛైర్మన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, నాయకుల ఫ్లెక్సీలు దగ్ధం చేయడంతో.. ప్రస్తుతం ఈ అంశం పట్టణంలో చర్చనీయాంశమైంది.