Farmers Special Abhishekam for Chandrababu: చంద్రబాబును విడుదల కోసం రైతుల ప్రత్యేక పూజలు.. ఆలయాల్లో పంచామృతాభిషేక కార్యక్రమాలు
Farmers Special Abhishekam for Chandrababu: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేయడంపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుని అరెస్టు చేయడం అక్రమమంటూ రోడ్లుపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమ అరెస్టుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. 'బాబుతో నేను' అనే పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్న కుట్ర కోణాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కార్యకర్తలు చంద్రబాబు అరెస్టు వార్తను వినడంతో ప్రాణాలను విడిచారు. ఈ క్రమంలో చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ.. రాజధాని ప్రాంత రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో కొవ్వొత్తులతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం శివాలయంలో రైతులు పంచామృతాభిషేకాలతో మెుక్కులు చెల్లించారు.