Dalit Agitation for Cremation Ground: శ్మశానం కబ్జా.. వ్యక్తి మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితుల ఆందోళన
Dalit Agitation for Cremation Ground: శ్మశానవాటిక స్థలం ఆక్రమణపై దళితులు ఆందోళనకు దిగారు. ఓ వ్యక్తి మృతదేహంతో వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం తోడేళ్ల పల్లె గ్రామానికి చెందిన దళితులు గురువారం ఓ వ్యక్తి మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. గ్రామానికి చెందిన మార్క్ (60) బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పూడ్చేందుకు దళితులకు చెందిన శ్మశాన వాటికకు వెళ్లగా సదరు స్థలంలో మృతదేహాన్ని పూడ్చేందుకు వీలు లేదంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు చెందిన శ్మశాన స్థలాన్ని (Cemetery) గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని.. ఈ విషయంపై గత కొన్నేళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పూడ్చేందుకు అంగీకరించక పోవడంతో గ్రామానికి చెందిన దళితులు మృతదేహాన్ని తీసుకుని నేరుగా చాగలమరిలోని తహసీల్దారు కార్యాలయం చేరుకుని నిరసన చేపట్టారు. సమస్యకు పరిష్కారం చూపేవరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లేది లేదంటూ భీష్మించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని దళితులు తెలిపారు.