SKU 21st Convocation: సామాజిక రుగ్మతలపై విద్యార్ధులు పరిశోధనలు చేయాలి: గవర్నర్ నజీర్

By

Published : Jul 17, 2023, 4:29 PM IST

thumbnail

Srikrishna Devaraya University 21st Convocation: పరిశోధన విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్, అంటరానితనం, సమాజ అసమానతలపై పని చేయాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ చెప్పారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ఛాన్సిలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్.. విద్యార్థులు సమాజ రుగ్మతలను దూరం చేయటానికి కృషి చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ఎస్కేయూ పేద విద్యార్థులకు విద్యనందిస్తోందన్నారు. విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతగా విలువలతో కూడిన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. వర్సిటీలో చదువుకునే అవకాశం రావటం అదృష్టమని, దీన్ని సద్వినియోగం చేసుకొని సముపార్జించిన జ్ఞానంతో సమాజానికి ఉపయోగపడాలని చెప్పారు. బెంగుళూరుకు చెందిన సమర్తనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు జి.కె మహంతేష్ విశిష్ట అతిథిగా హాజరుకాగా, ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అంధులైన మహంతేష్ దేశవ్యాప్తంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేసి దివ్యాంగులకు విద్య, వైద్య సేవలందిస్తున్నట్లు ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి చెప్పారు. అంధుల క్రికెట్​ను అంతర్జాతీయ క్రీడగా గుర్తించటానికి మహంతేష్ కృషి మరవలేనిదని తెలిపారు. 21వ స్నాతకోత్సవంలో చదువులో అత్యంత ప్రతిభ చూపిన 57 మందికి బంగారు పతకాలు, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు, స్మారక అవార్డులు ప్రదానం చేశారు. మొత్తం తొమ్మిది వేల 150 మందికి డిగ్రీలు ప్రదానం చేయగా, వీరిలో 356 మంది పీజీ విద్యార్థులకు వేదికపై పట్టా అందజేశారు. మిగిలిన విద్యార్థులందరికీ పోస్టు ద్వారా వారి ఇంటికే పంపుతున్నట్లు ఎస్కేయూ అధికారులు చెప్పారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.