నెలసరి టైమ్​లో కడుపు నొప్పా? వికారంగా ఉంటోందా?.. ఈ టిప్స్ మీ కోసమే!

author img

By

Published : Jun 2, 2023, 10:04 AM IST

period time pain relief tips

Period Time Pain Relief Tips : నెల‌స‌రి స‌మ‌యంలో కొంద‌రు మ‌హిళ‌ల బాధ వ‌ర్ణనాతీతం. ఆ నొప్పి భ‌రించ‌లేక నెలసరి సమయంలో మహిళలు విల‌విల‌లాడిపోతారు. ఇటు కూర్చోలేక అటు ప‌డుకోలేక తంటాలు ప‌డ‌తారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ బాధ‌ల‌ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.

Period Time Pain Relief Tips : పీరియ‌డ్స్ వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు మ‌హిళ‌లు విప‌రీత‌మైన కడుపునొప్పితో బాధపడతారు. కొంద‌రికి ఒక‌టి, రెండు రోజుల్లో నెలసరి బాధలు తగ్గితే.. మ‌రి కొందరికి వారం రోజుల వరకు తగ్గవు. నెలసరి స‌మ‌యంలో మహిళల బాధలు వ‌ర్ణ‌నాతీతం. తిమ్మ‌ిర్లు రావ‌టం, వికారం, క‌డుపు ఉబ్బ‌రం, మూడ్ స్వింగ్స్ ఛేంజ్ అవ్వ‌టం లాంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. వీటన్నింటి నుంచి విముక్తి కావాలంటే.. జీవ‌న విధానంలో కొన్ని మార్పులు- చేర్పులు చేసుకోవాలి. అవేంటంటే..

1. ఆరోగ్య‌కర‌మైన ఆహారం :
Best Food In Period Time : ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం రుతుక్ర‌మ సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌టంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తాజా తృణ ధాన్యాలు, స‌లాడ్లు, పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవాలి. అర‌టి పండ్లు, నారింజ‌, పుచ్చ‌కాయ‌, బ్ర‌కోలి, చ‌మోమైల్ టీ వంటి వాటిని మీ రెగ్యుల‌ర్ డైట్​లో త‌ప్పనిస‌రిగా చేర్చుకోవాలి.

2. ఉప్పు, కాఫీల‌ను త‌గ్గించాలి :
మీరు తినే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పును వాడ‌టం ఆపేయాలి. పీరియ‌డ్స్ స‌మ‌యంలో కెఫిన్ అధికంగా ఉండే టీ, కాఫీల‌ను తాగ‌టం తగ్గించాలి. నెలసరి సమయంలో టీ, కాఫీ తాగడం వల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ నెమ్మ‌దించడం సహా క‌డుపు ఉబ్బ‌రం, మంట‌ను క‌లుగజేస్తాయి.

3. స‌రిప‌డా నిద్ర :
నెల‌స‌రి స‌మ‌యంలో శ‌రీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వ‌డం మంచిది. శ‌రీరం కూడా అదే కోరుకుంటుంది. కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో సాధ్య‌మైనంత ఎక్కువ‌గా నిద్ర‌పోండి. దీని వ‌ల్ల కడుపునొప్పిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం వ‌స్తుంది.

4. వ్యాయామం :
వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం. సాధార‌ణ రోజులతో పాటు నెలసరి సమయంలోనూ వ్యాయామం చేయడం మంచిది. రెగ్యుల‌ర్​గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మూడ్ స్వింగ్స్, కడుపు నొప్పి, తిమ్మ‌ిర్లు వంటి ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ తీవ్ర‌త‌ల‌ను త‌గ్గిస్తుంది. యోగా చేయ‌డం వ‌ల్ల కూడా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. చామంతి టీ :
నెలసరి సమయంలో చామంతి, పిప్ప‌ర‌మెంటు టీలు తాగ‌డం వ‌ల్ల బాధ‌ల నుంచి విముక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం, బెర‌డు, ఫెన్నెల్​(సోపు)తో త‌యారు చేసే టీలు మంచి ఫ‌లితాలిస్తాయని అంటున్నారు.

6. హీటింగ్ ప్యాడ్ ఉప‌యోగించ‌డం :
పీరియ‌డ్స్ స‌మ‌యంలో హీటింగ్ ప్యాడ్స్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిని వాడ‌టం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు కావ‌డం సహా ఉద‌ర కండ‌రాల‌కు ఆక్సిజ‌న్ ప్ర‌వాహాన్ని పెంచుతుంది.

7. ఆక్యుపంక్చ‌ర్ :
నాడీ వ్య‌వ‌స్థ‌ను రిలాక్స్​గా ఉంచ‌టంలో, తిమ్మ‌ిరి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డంలో ఆక్యుపంక్చ‌ర్ అనే సంప్ర‌దాయ ఆసియా ఔష‌ధ సాంకేతిక‌త తోడ్ప‌డుతుంది. ఇది ర‌క్త ప్ర‌వాహాన్ని పెంచుతుంది.

"స‌మ‌తుల్య ఆహారం, టీ, కాఫీలు తక్కువగా తాగడం, ఉప్పు వాడకం త‌గ్గించ‌డం, స‌రైన నిద్ర, వ్యాయామం లాంటివి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో పాటు నెల‌స‌రి స‌మ‌యంలో మానసిక స్థితి, తీవ్రమైన నొప్పి లాంటి పీఎంఎస్ ల‌క్ష‌ణాల తీవ్ర‌త‌ను త‌గ్గిస్తాయి" అని పుణెలోని మ‌ద‌ర్ హుడ్ ఆసుప‌త్రిలో క‌న్స‌ల్టెంట్ ప్ర‌సూతి వైద్యురాలిగా పనిచేస్తున్న డా.సుశ్రుత తెలిపారు. హీటింగ్ ప్యాడ్ ఉప‌యోగించ‌డం, పోషకాహారం తినడం వల్ల కూడా నెల‌స‌రి స‌మ‌యంలో కడుపు నొప్పి, ఇతర బాధల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని ఆమె తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.