ETV Bharat / sukhibhava

తల్లి పాలు.. బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్!

author img

By

Published : Aug 1, 2022, 7:47 AM IST

Breastfeeding benefits for baby: బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్‌.. అమ్మ పాలే! చిన్నారిని చిరంజీవిని చేసే ఈ అమృతం అందకే ఏటా లక్షలమంది పిల్లలు మరణిస్తున్నారు. అయితే.. బిడ్డకు పాలివ్వాలనే సంకల్పం తల్లికి మాత్రమే ఉంటే సరిపోతుందా? కాదు.. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, సమాజం కూడా ఈ విషయంలో తల్లికి అండగా నిలవాలి. ఎందుకంటే..

breastfeeding week 2022
తల్లి పాలు.. బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్!

దుగురు పిల్లలు పుడుతుంటే అందులో ముగ్గురికి అమ్మపాలు అందడం లేదు. ఏటా లక్షలమంది పిల్లలు ఈ కారణంగానే మరణిస్తున్నారు. ఎందుకలా? అది తెలుసుకొనేందుకే 'ది వరల్డ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ట్రెండ్స్‌ ఇనీషియేటివ్‌' సంస్థ ఏటా..'తల్లిపాల'పై ప్రపంచవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తోంది. తల్లిపాలు సంపూర్ణంగా అందుకుంటున్న బిడ్డలున్న దేశాలని 'గ్రీన్‌ నేషన్స్‌'గా ప్రకటిస్తుంది. చాలా తక్కువగా అందుకున్న వాటిని 'రెడ్‌' జాబితాలోకి చేర్చుతుంది. గత ఏడాది బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు మాత్రమే పచ్చ జాబితాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎర్ర జాబితాలోకి వెళ్లాయి. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. బంగ్లాదేశ్‌లో నూటికి 91 మంది తల్లులు తమ బిడ్డలకు ఆరునెలలు వచ్చినా తల్లిపాలను పంచుతుంటే.. బ్రిటన్‌లో ఒక్క శాతం తల్లులు మాత్రమే ఆరునెల్లపాటు పాలు ఇస్తున్నారు. కారణాలు.. ప్రసవం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలన్న ఒత్తిడితో బిడ్డకు సరైన సమయం కేటాయించలేకపోవడం. బయటకు వస్తే అందరి ముందు పాలివ్వడానికి బిడియ పడటం. కుటుంబ సభ్యుల నుంచి సాయం అందకపోవడం. ఈ జాబితాలో వంద దేశాలుండగా భారత్‌ 79వ స్థానంలో ఉంది.

breastfeeding week 2022
తల్లి పాలు.. బిడ్డకు అందే తొలి వ్యాక్సిన్!

ఆమె చేసిన ప్రయోగం..
న్యూయార్క్‌కి చెందిన ఫొటోగ్రాఫర్‌.. టినా పబ్లిక్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ని ప్రోత్సహించేందుకు ఓ వినూత్నమైన ప్రయోగం చేసింది. రెండు నెలల పాటు.. ప్రపంచం మొత్తం తిరిగింది. 65 మంది పాలిచ్చే తల్లుల్ని ఒప్పించి వారి చిత్రాలని తీసింది. ఈ ఫొటోలని గమనిస్తే.. ఆ దేశ మహిళల సంస్కృతి, ఆర్థిక నేపథ్యం వంటివి తెలియడంతోపాటు.. తల్లిపాలు అందుకోవడం బిడ్డ ప్రాథమిక హక్కు అనే విషయాన్ని తెలియచెబుతుంటాయి.

తల్లిపాలని ప్రోత్సహించేందుకు..
దేశ ప్రజల ఆరోగ్యం.. వ్యాధినిరోధక శక్తి అనేవి ఎంత కీలకమైన అంశాలో కొవిడ్‌ తర్వాత దాదాపు అన్ని దేశాలకూ అర్థమైన విషయం. మరి వ్యాధులు వచ్చిన తర్వాత కోట్లు కుమ్మరించే బదులు రాకుండా చేసే అమృతతుల్యమైన తల్లిపాలను ప్రోత్సహించాలనుకుంటున్నాయి వివిధ దేశాలు.

స్వీడన్‌లో: తల్లులు పాలివ్వడాన్ని ప్రోత్సహించాలంటే వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలి. ముఖ్యంగా ఉద్యోగినులకు. ఈ ఉద్దేశంతోనే స్వీడన్‌ 15నెలలపాటు ప్రసూతి సెలవులని ప్రకటించి.. అందులో ఆరునెలలపాటు బిడ్డకు తప్పనిసరిగా పాలిచ్చేలా అవగాహన కల్పిస్తోంది.
కెన్యాలో: పనిచేసే ప్రాంతాన్ని పాలివ్వడానికి అనుకూలమైన ప్రాంతంగా మార్చేశారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ మదర్స్‌ బిల్‌ని ప్రవేశపెట్టి.. పని ప్రాంతంలో పాలిచ్చేందుకు కావాల్సిన విరామ సమయాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందుకోసం కొన్ని గదులు కేటాయిస్తారు. అధికంగా ఉన్న పాలను దాచిపెట్టడానికి అవసరం అయిన ఫ్రిడ్జ్‌లు.. అందుబాటులో ఉంచుతారు. ఈ సదుపాయాలు కల్పించకపోతే ఆయా సంస్థలపై ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.

బ్రెజిల్‌: కొందరు తల్లులు అనారోగ్యం కారణంగా బిడ్డకు పాలివ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ కారణంగానూ శిశుమరణాలు చోటుచేసుకోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా తల్లిపాల బ్యాంకులని ప్రారంభించింది. ఇందుకోసం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది.
మాల్దీవుల్లో: డబ్బా పాలను ప్రోత్సహించే ప్రకటనలను, పాలకు బదులుగా పెట్టే వివిధ రకాల ఆహారాలను ప్రోత్సహించడం ఇక్కడ నేరం.

  • Breastfeeding week 2022: ‘స్టెపప్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌: ఎడ్యుకేట్‌ అండ్‌ సపోర్ట్‌’ నినాదంతో డబ్ల్యూహెచ్‌వో.. ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్ని(ఆగస్టు 1-7) జరుపుతోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.