ETV Bharat / state

వర్షాలతో కుళ్లిన ఉల్లి... దిక్కుతోచని స్థితిలో రైతులు

author img

By

Published : Oct 28, 2022, 2:56 PM IST

Updated : Oct 28, 2022, 3:01 PM IST

Onion Farmers
ఉల్లి రైతుల ఆవేదన

Onion Farmers Problems: సీఎం సొంత జిల్లా రైతులకు 'ఉల్లి' కంటతడి తెప్పిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి సర్వనాశనమైంది. దాదాపు 17 వేల ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన ఉల్లి కుళ్లిపోవడంతో పొలాల్లోనే పశువుల మేతకు వదిలేసే దుస్థితి నెలకొంది.

ఉల్లి రైతుల ఆవేదన

Onion Farmers Problems: వైఎస్సార్​ జిల్లా కమలాపురం, వి.ఎన్​.పల్లి, యర్రగుంట్ల, ఖాజీపేట, మైదుకూరు మండలాల్లో అత్యధికంగా ఉల్లిపంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో ఉల్లి పంట వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క వి.ఎన్​.పల్లి మండలంలోనే 3 వేల ఎకరాల్లో ఉల్లి పండించారు. పంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వర్షాలు... రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పంటంతా పొలంలోనే కుళ్లిపోయింది. గడ్డలు ఊరకుండా నల్లగా, సన్నగా మారి వాడుకోవడానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయని రైతులు నిట్టూరుస్తున్నారు.

"మూడెకరాల్లో ఉల్లిపంట వేశాను. వర్షాల వల్ల నాకు రెండున్నర లక్షల నష్టం వచ్చింది. అంతా నష్టమే. అన్ని పారబోశాం. వర్షాలొచ్చి, రోగాలొచ్చి అన్నింటి వల్ల ఇబ్బందే. ప్రభుత్వం అసలూ పట్టించుకోవడం లేదు. రైతులు విషం తాగి సావాల్సిందే." -ఉల్లి రైతు

"ఈ అకాల వర్షాల వల్ల మొత్తం కుల్లిపోయింది. రూపాయి వచ్చేదంటూ లేదు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదు. రైతు భరోసా అని కుటుంబానికి ఆరేడు వేలు ఇస్తున్నారు. అవి బిచ్చగానికి ఇచ్చినట్లు ఇస్తున్నారు. అది ఏమూలకు సరిపోదు. రానురాను క్రాప్​ హాలిడే ప్రకటించాల్సివస్తుంది. కాబట్టి రైతులకు ఆత్మహత్యలే తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా విజ్ఞప్తిని ఆలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. -ఉల్లి రైతు

ఇక్కడ పండించిన ఉల్లి పంటను రైతులు.. కోల్‌కత్తా, చెన్నై, కొత్తగూడెం, తాడేపల్లిగూడెం, కర్నూలు ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించేవారు. చాలా ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయడంతో రైతులకు బాగా గిట్టుబాటయ్యేది. కానీ ఇప్పుడు కుళ్లిపోయిన పంటను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చేసేదేమీ లేక ఉల్లి పంటను పొలాల్లోనే పశువుల మేత కోసం వదిలేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా.. రూపాయి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.

"ఉల్లి పెట్టాను. పూర్తిగా కుళ్లిపోయాయి. పంట చేతికి రాలేదు. లక్షాయాభై వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయాను. అప్పు తీర్చుకోలేక ఏమన్నా మందుగిందు తాగి సావాల్సిందే. బిచ్చగాళ్లలా ఊరురూ తిరిగి అడుక్కుని తినాల్సిన పరిస్థితి." -మహిళా రైతు

ఉల్లిపంట దెబ్బతిన్న విషయాన్ని ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నష్టపోయిన ఉల్లిపంటను వైకాపా, తెలుగుదేశం నేతలు పరిశీలించి... రైతులకు ధైర్యం చెబుతున్నారు. కమలాపురం వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా అన్నదాతలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 28, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.