ETV Bharat / international

'మోదీ గొప్ప దేశభక్తుడు.. వారి విదేశాంగ విధానం భేష్'.. పుతిన్​ ప్రశంసలు

author img

By

Published : Oct 28, 2022, 11:00 AM IST

Updated : Oct 28, 2022, 7:04 PM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయనను దేశభక్తునిగా అభివర్ణించారు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తున్నారని కొనియాడారు.

putin lauds pm modi governance
పుతిన్ నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్​.. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబిస్తోందని కొనియాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన నాయకత్వంలో ఆర్థికంగానూ దేశం కీలక పురోగతి సాధించిందని కితాబిచ్చారు. మోదీని దేశభక్తుడిగా అభివర్ణించారు. మాస్కోలో గురువారం వాల్డాయ్​ డిస్కషన్​ క్లబ్ అనే ఓ సంస్థను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్.

"ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో పనులు జరిగాయి. ఆయన దేశభక్తుడు. మోదీ చేపట్టిన 'మేక్​ ఇన్​ ఇండియా' ఆర్థికంగా, నైతిక విలువల పరంగా ఎంతో గొప్పది. భవిష్యత్.. భారత్​దే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడొచ్చు. బ్రిటిష్ వలస దేశం నుంచి ఆధునిక దేశంగా భారత్ అపారమైన అభివృద్ధి సాధించింది. దాదాపు 150కోట్ల జనాభా, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు.. భారత్​ను అందరూ గౌరవించేందుకు, అభిమానించేందుకు కారణాలు" అని అన్నారు పుతిన్.

భారత్​, రష్యా బంధం ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు పుతిన్. "అనేక దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య సన్నిహిత బంధం ఉంది. మన మధ్య ఎప్పుడూ సంక్లిష్టతలు రాలేదు. ఎల్లప్పుడూ పరస్పరం అండగా నిలిచాం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. భవిష్యత్​లోనూ అలానే ఉంటుందని విశ్వసిస్తున్నా. భారత్​లో వ్యవసాయానికి ఎంతో కీలకమైన ఎరువుల సరఫరా పెంచాలని మోదీ నన్ను అడిగారు. మేము ఎరువుల సరఫరాను 7.6రెట్లు పెంచాం. వ్యవసాయ సంబంధిత వాణిజ్యం దాదాపు రెట్టింపు అయింది" అని తెలిపారు పుతిన్.

ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినా.. భారత్​ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించడం, ముడి చమురు దిగుమతి చేసుకోవడం వంటి పరిణామాల మధ్య ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్. అంతర్జాతీయంగా పైచేయి సాధించేందుకు పశ్చిమ దేశాలు వికృత క్రీడలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇలా చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉండనున్నాయో అమెరికా సహా అగ్రరాజ్యం మిత్రదేశాలకు అర్థం కావడం లేదని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు.

ఇవీ చదవండి: ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగిన రష్యా సైనికులు.. విద్యుత్‌ సిబ్బందికి జెలెన్‌స్కీ థ్యాంక్స్​

రష్యాను వీడిన పుతిన్ గురువు కూతురు.. అదే కారణమా?

Last Updated : Oct 28, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.