ETV Bharat / state

ప్రాణాలతో 'జల'గాటం వద్దు!

author img

By

Published : Sep 7, 2020, 5:37 PM IST

measures at heavy fflooded areas
ప్రాణాలతో జలగాటం

ఈ ఏడాది భారీస్థాయిలో వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం నిండుకుండలా మారింది. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వివిధ కాలువలకు అందే నీటితో పాటు కుందూ నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లాలోని కుందూ, పెన్నానదీ పరివాహక ప్రాంతాలతో పాటు సాగు నీటి కాలువలన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, కాలువలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో జిల్లాలో పలువురు నీటిలో గల్లంతై కన్న వారికి గర్భశోకం మిగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలో పారే నీటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రత్యేక కథనం.

వర్షాలు బాగా కురిశాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇలాంటి సమయంలో జలాశయాల దగ్గరికి వెళ్లే వాళ్లంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నా పెద్దా మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.

చిన్న పిల్లల విషయంలో దగ్గరుండి వారిని లోతు ఎక్కువగా లేని చోటికి తీసుకెళ్లి కొద్ది సేపు వారి సరదా తీరేంత వరకు ఉండాలి. నదుల వద్ద అయితే ఒడ్డు వద్దనే ఉండడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా వారాంతపు సెలవులు వచ్చినప్పుడు తోటి పిల్లలందరూ కలసి సరదాగా చెరువుల వద్దకు వెళ్తారు. పిల్లలను బయటికి పంపించినప్పటికీ ప్రమాదకరమైన చెరువులు, కుంటల వద్దకు పంపకపోవడం మంచిది. సెలవు దినాల్లో పిల్లలపై నిఘా ఉంచాలి.

జిల్లాలో ప్రమాదకర ప్రాంతాలివే..

● జిల్లాలో పలు ప్రమాదకర ప్రాంతాలున్నాయి. పాలకొండల వద్ద జలపాతం, వాటర్‌గండి, పెన్నానది, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, పాపఘ్ని నది, పుట్లంపల్లె చెరువు, ఒంటిమిట్ట చెరువు ఇలా చాలా ప్రాంతాల్లో నీటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

వాటర్‌గండి, పెన్నానది, పాలకొండ జలపాతం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ప్రాంతాల్లో ప్రమాదాలు కాస్త ఎక్కువగా జరుగుతాయి. చాలా మంది ఈ ప్రాంతాలకే వెళ్తారు. ఇక్కడ అధికారులు తగిన సూచికలు ఏర్పాటు చేయాలి.

● నదీతీర ప్రాంతాల్లో సుడులు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసేలా సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు నదిలోకి ఎవరూ దిగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలి.

వర్షాకాలం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణనష్టం జరగకుండా చూడాలి.

జిల్లాలో కొన్ని విషాద ఘటనలివి

  • 2018 నవంబరు 24న గాలివీడులో మహమ్మద్‌ తౌఫిక్‌, తాహీర్‌, మహమ్మద్‌ బాషా, సుబహాన్‌ చెరువులో పడి మృతి చెందారు.
  • 2019 మే 3న సోమశిల వెనుక జలాల్లో మునిగి ప్రసన్న (15), అంజలి (11) దుర్మరణం పాలయ్యారు.
  • 2020 జనవరి 2న సిద్ధవటం పెన్నానదిలో ముగ్గురు నీట మునిగి మృత్యువాత పడ్డారు.
  • 2020 జనవరి 26న కడప పుట్లంపల్లె చెరువులో పడి ముగ్గురు పిల్లలు చనిపోయారు.

యువతే ఎక్కువ

జిల్లాలో ఇటీవల జరిగిన జల ప్రమాదాల్లో ఎక్కువ శాతం యువతే మృత్యువాతపడ్డారు. వారాంతపు సెలవుల్లో యువత తోటి స్నేహితులతో కలిసి సరదాగా నీటి పరివాహక ప్రాంతాలకు వెళ్తూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలో దిగుతున్నారు. ఈత సరదా వారి ప్రాణాలు తీస్తోంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని ప్రమాదాలకు గురిచేస్తోంది. చాలా మంది ఈత రాకపోయినా స్నేహితుల మాట విని నదుల్లో దిగుతున్నారు. పుష్పగిరి లాంటి ప్రాంతంలో పెన్నానదిలో నీరు సుడులు తిరుగుతోంది. కొన్ని చోట్ల బురద కూడా పేరుకుపోయింది. అలాంటి చోట్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పెన్నానది వద్దకు విహారయాత్ర కోసమని ఓ కుటుంబం వెళ్లింది. వారిలో ఒకరు నీటిలో పడిపోగా అతన్ని కాపాడేందుకు ఒకరు, రెండో వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు ఇలా ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు.

ఈత రాని వారు వెళ్ల వద్దు

వర్షాకాలం కావడంతో నదులు, వాగులు, వంకలు, చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. ఈత రాని వారెవరూ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లరాదు. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట ఈత వచ్చిన వారు కూడా కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. పిల్లలను వర్షాకాలంలో బయటికి పంపడం అంత మంచిది కాదు. సుడిగుండాలు, ఊబిలు, ఎత్తుపల్లాలుంటాయి, అలాంటి చోట్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఒడ్డునే ఉండాలి. లోపలికి వెళ్తే ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. - మాధవనాయుడు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కడప

ఠాణాలకు సమాచారం ఇవ్వండి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా నీరు వస్తుంది. ఇలాంటి సమయంలో నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లడం చాలా ప్రమాదకరం. ఒకవేళ సరదాగా వెళ్లాలనుకునే వారు సమీపంలోని ఠాణాలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లక పోవడం మంచిది. - అన్బురాజన్‌, ఎస్పీ, కడప

ఇదీ చదవండి:

అన్​లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.