ETV Bharat / state

KGBV Guest Teachers Agitation: 'ఈ ఉద్యోగాలనే నమ్ముకున్నాం.. తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలి..'

author img

By

Published : Jun 22, 2023, 5:43 PM IST

KGBV Guest Teachers Agitation
కేజీబీవీ గెస్ట్ టీచర్ల ఆందోళన

KGBV Guest Teachers Agitation: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఉపాధ్యాయులు నిరసన బాట పట్టగా.. తాజాగా వైఎస్సార్ జిల్లా, నెల్లూరు, విజయనగరం జిల్లాలలో ఆందోళన చేపట్టారు. ఎన్నో ఎళ్లుగా అతిథి ఉపాధ్యాయులుగా పని చేస్తున్న తమను.. ఒక్కసారిగా తొలగించడం అన్యాయమని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

KGBV Guest Teachers Agitation: ఏళ్ల తరబడి నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేశామని.. ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం తొలగించి.. తమ స్థానంలో కొత్తవారిని నియమించుకోవడం దారుణమని అతిథి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం కొత్త నియామకాల కోసం చేపడుతున్న ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా డీఈవో కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

వాగ్వాదం: కొత్తగా నియమిస్తున్న అతిధి ఉపాధ్యాయుల ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డీఈవోతో వాగ్వాదానికి దిగారు. తమ చేతుల్లో ఏమీ లేదని అమరావతికి వెళ్లి తేల్చుకోవాలని డీఈవో చెప్పారు. దీంతో ఉద్యమకారులకు, డీఈవో మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటర్వ్యూలను నిలిపేయాలని గదులకు గడియలు పెట్టారు. ఇంటర్వ్యూలు నిర్వహించకుండా అడ్డుకున్నారు.

KGBV Guest Teachers Agitation: ఎన్నో ఎళ్లుగా పనిచేస్తున్నాం.. తమను తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయి..

ఇంటర్వ్యూలను నిలిపివేయ్యకుంటే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని డీఈవో చాంబర్ ఎదుట బైఠాయించారు. డీఈవో రాఘవరెడ్డి పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. విధుల నుంచి తొలగించిన అతిథి ఉపాధ్యాయులను కూడా అక్కడి నుంచి పంపించి వేశారు.

ఈ ఉద్యోగాలనే నమ్ముకుని జీవిస్తున్నామని ఒక్కసారిగా తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలని అతిధి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఇంతటితో ఆపమని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని అన్నారు.

"మేము అయిదారేళ్లుగా కేజీబీవీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాం. ఇప్పుడేమో అందరినీ తీసేసి.. కొత్త వారిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మమ్మల్ని తీసేస్తే.. మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మమ్మల్ని ఎవరూ పట్టించుకునే వారే లేరు". - కవిత, కేజీబీవీ అతిథి ఉపాధ్యాయురాలు

KGBV Guest Teachers Agitation in Nellore: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు నెల్లూరులోని డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆరేడేళ్లుగా కస్తూర్బా విద్యాలయంలో పని చేస్తున్న తమను కొత్త నోటిఫికేషన్ పేరుతో తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతాలకు ఎక్కువ పనిచేస్తున్న తమను తొలగించి రోడ్డున పడేశారని వాపోయారు. తమకు ఇచ్చేది 12వేల రూపాయలే అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరితో సమానంగా విధులు నిర్వహించామన్నారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, పాత వారిని తొలగించి తమ కడుపు కొట్టడం భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేయాలని కోరారు. కొత్త వారి ఎంపిక కోసం జరుగుతున్న కౌన్సిలింగ్ నిలుపుదల చేసి, తమను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ సర్వశిక్షా అభియాన్ పీవో ఉషారాణికి వినతిపత్రం అందజేశారు.

KGBV Guest Teachers Agitation in Vizianagaram: విజయనగరంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళనకు దిగారు. విజయనగరంలోని యూత్ హాస్టల్​లో జరుగుతున్న కేజీబీవీ కాంట్రాక్టర్ అధ్యాపకుల నియామక కౌన్సిలింగ్​ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించటంతో కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ నినదించారు. కేజీబీవీలలో తమ స్థానంలో ఒప్పంద అధ్యాపకుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తారు. ఐదేళ్లు పాటు.. తక్కువ వేతనానికి పని చేసిన తమను ఒక్క సారిగా ప్రభుత్వం తొలగించడాన్ని తప్పుపట్టారు.

రెగ్యూలర్ అధ్యాపకులతో పాటు.. విద్యార్ధులకు పాఠాలు చెప్పామని. అయినప్పటికీ తమ సర్వీసుని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం తొలగించటంపై మండిపడ్డారు. ప్రస్తుతం తమ స్థానంలో ఒప్పంద అధ్యాపకుల నియామకాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వం పునరాలోచించి.. తమను కేజీబీవీలలో పాత విధానంలో కొనసాగించాలని గెస్ట్ ఉపాధ్యాయులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.