ETV Bharat / state

Crop holiday: కడప జిల్లాలోనూ పంట విరామం.. వరి గిట్టుబాటు కావట్లేదని రైతుల నిర్ణయం

author img

By

Published : Jun 11, 2022, 8:17 AM IST

crop holiday at ysr kadapa district
కడప జిల్లాలో పంట విరామం

Crop holiday: ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు పంటసాగును ఏడాదిగా నిలిపేశారు. ఇప్పటికే కోనసీమ జిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించగా.. సీఎం జగన్‌ సొంత జిల్లా అయిన.. వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో గతేడాది నుంచే వరి పంటకు రైతులు విరామం ప్రకటించారు.

Crop holiday at kadapa: దశాబ్దాల తరబడి పుడమి తల్లినే నమ్ముకుని సాగుచేస్తున్న అన్నదాతలు.. తమ పొలాలను బీడు పెట్టేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటసాగును ఏడాదిగా నిలిపేశారు. ఇప్పటికే కోనసీమ జిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించగా.. రాయలసీమలో సీఎం జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లో గతేడాది నుంచే వరి పంటకు రైతులు విరామం ప్రకటించారు.

కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్‌) కింద 90వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు వరి వేసుకోలేకపోతున్నారు. ఈ జిల్లాలో కేసీ కెనాల్‌ కింద దాదాపు 35వేల హెక్టార్లలో వరిసాగు చేస్తారు.

వరితో నష్టాల మూటలు.. ఎకరా విస్తీర్ణంలో వరిసాగుకు రూ.30వేలకు పైగా ఖర్చవుతోంది. కూలి ధరలు, ఎరువులు, పురుగుమందుల ధరలు భారీగా పెరిగాయి. మూడు పుట్ల ధాన్యం పండినా.. (1800 కిలోలు) రకరకాల కారణాలతో కొర్రీలు వేసి, రూ.25-27వేలు చేతిలో పెడుతున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే పెట్టుబడిలో మూడోవంతు కూడా రావడంలేదు. గత రెండేళ్లుగా భారీవర్షాలు కురవడంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోయింది. పెట్టుబడి, రాబడి మధ్య పొంతన లేక.. అన్నదాతలు పునరాలోచనలో పడ్డారు. కర్నూలు నుంచి కడప వరకూ పొలాలన్నీ ఏడాదిగా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. వర్షాలతో నష్టపోతే ప్రభుత్వం రూ.6వేలే చెల్లించిందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో పొలాలు కౌలుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో పంట భూములు బీడుపెడుతున్నారు. కొందరు రైతులు పట్టణాలకు కూలిపనికి వెళుతున్నారు.

వరి వేస్తే అప్పులే - మనోహర్‌, చెన్నూరు

గత రెండేళ్లుగా వరిపంట వేయగా అప్పులు పెరిగిపోయాయి. దీంతో బీడు పెట్టడమే నయమని వదిలేశాం. ఇకపై కూడా పంట వేయడానికి రైతులు సిద్ధంగా లేరు. పెట్టుబడికి, రాబడికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు.

పెట్టుబడులు పెరిగాయి- ఓబులేష్‌ యాదవ్‌, ఖాజీపేట

వరిసాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. పంట సాగుచేస్తే ఎకరాకు రూ.6 వేల వరకు నష్టమొస్తోంది. కోత సమయంలో వానలొస్తే రెక్కల కష్టమంతా వృథాగా పోతోంది. ఈ పరిస్థితిలో బీడు పెట్టి కూర్చోవడమే ఉత్తమంగా భావిస్తున్నాం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.