ETV Bharat / state

బ్యాంకు ఖాతా నిబంధన.. రైతన్నకు రోదన..!

author img

By

Published : Nov 29, 2020, 8:29 PM IST

కష్టాలకోర్చి పంటను పండించిన అన్నదాతకు.. ధాన్యం అమ్ముకోవడం తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా... సవలక్ష నిబంధనలు అడ్డంకిగా మారాయి. రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు జిల్లాకు చెందినవై ఉండాలన్న నిబంధన.. రైతులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఇతర జిల్లాల్లో ఖాతాలు ఉన్న రైతులు.. ఈ నిబంధనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Formers_Accounts_Kastalu
Formers_Accounts_Kastalu

పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు రైతును తీవ్ర స్థాయిలో నష్టపరుస్తున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోలులో తెచ్చిన కొత్త నిబంధనలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడానికి విధించిన సవలక్ష నిబంధనలు.. రైతును మరింత నష్టపరుస్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన విచిత్రమైన నిబంధనలు రైతుకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.

బ్యాంకు ఖాతా నిబంధన.. రైతన్నకు రోదన..!

ఎక్కడున్నా రావాల్సిందే...

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే రైతులు పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఖాతా ఉండాలని నిబంధన తీసుకొచ్చారు. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వంటి వివరాలు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఏ రాష్ట్ర బ్యాంకు ఖాతా అయినా తీసుకొనేవారు. ప్రస్తుతం ఏ జిల్లా రైతు ఆ జిల్లాకు సంబంధించిన బ్యాంకు ఖాతా ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల.. జిల్లా బయట ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులు.... తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లో ఉంటున్నారు. వారందరికీ ఆయా ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఖాతాలు లేకపోవడం వల్ల.. ధాన్యం విక్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో దేశంలో ఏ ప్రాంత బ్యాంకు ఖాతా అయినా.. వారి ఖాతాల్లోకి నగదు జమ చేసేవారు. ప్రస్తుతం ఏ జిల్లా రైతులు ఆ జిల్లాల్లో ఉన్న బ్యాంకు ఖాతాను మాత్రం సమర్పించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిబంధన వల్ల.. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.

ఎలాంటి లాభం లేదు...

జిల్లాలో 11 లక్షలమంది రైతులు ఉన్నారు. 2.60లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. 11లక్షల మంది రైతుల్లో 6.50 లక్షల మంది రైతులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండి కూలీలు, బంధువుల సాయంతో తమ పంటపొలాలు సాగు చేయిస్తున్నారు. ఇలా సాగుచేసిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొత్తగా తెచ్చిన నిబంధన మేరకు జిల్లాలో బ్యాంకు ఖాతా తెరవాలంటే.. జిల్లాకు రావాల్సి ఉంటుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న రైతులు జిల్లాకు వచ్చి ఖాతాలు తెరిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికప్పుడు స్వగ్రామాలకు వచ్చి.. బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నా అధిక సమయం తీసుకొంటుంది. వర్షాలు పడుతుండటంతో సిద్ధమైన ధాన్యాన్ని విక్రయించుకోకపోతే.. తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. పండిన ధాన్యాన్ని గ్రామాల్లో ఉన్న బంధువుల ద్వార విక్రయించేవారు. కొనుగోలు కేంద్రాల్లో సదరు రైతు వివరాలు అందిస్తే.. వారి ఖాతాకు ధాన్యం నగదు జమ అయ్యేది. ప్రస్తుతం జిల్లాలో ఖాతా తెరవాలన్న నిబంధన కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ నిబంధన వల్ల.. ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేకపోయినా.. రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో దీన్ని తెచ్చారని రైతులు అంటున్నారు.

ఆయా జిల్లాలకు సంబంధించిన బ్యాంకు ఖాతా ఉండాలని పంట సాగు సమయంలోనే తెలియజేసి ఉంటే.. రైతుకు వెసులుబాటు ఉండేదని రైతులు అంటున్నారు. ఈ కొత్త ఖాతా నిబంధన వల్ల.. పలువురు రైతులు దళారీలకు ధాన్యాన్ని విక్రయించి.. నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.