ETV Bharat / state

నత్తనడకన పొగాకు వేలం... ధర కోసం నిరీక్షిస్తున్న రైతులు

author img

By

Published : May 2, 2021, 1:43 PM IST

Tobacco auction
పొగాకు వేలం

పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు వేలం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మార్చి 24న వేలం ప్రకియ ప్రారంభమైంది. ఏటా వేలం ప్రక్రియ చివరి దశకు వచ్చాక ధరను పెంచుతుండటంతో ... అన్నదాతలు ఈసారి బేళ్లను తీసుకురావడం లేదు. మంచి ధర ఇస్తే పొగాకును విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఐదు కేంద్రాల్లో మార్చి 24న వేలం ప్రక్రియ ప్రారంభమైంది. రోజుకు ఒక్కో కేంద్రంలో లక్ష నుంచి 1.5 లక్షల కిలోల చొప్పున సామర్థ్యం ఉంది. ఈ లెక్కన ఐదింటిలో కలిపి సుమారు 8 లక్షల కిలోల వరకు విక్రయించే అవకాశం ఉంది. సెలవు రోజులు పోను ఈ సమయంలో 10 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 4.88 మిలియన్‌ కిలోల పొగాకు మాత్రమే విక్రయమైంది.

ఏటా వేలం ప్రక్రియ చివరి దశకు వచ్చాక ధరను పెంచుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇదే జరుగుతోంది. దాంతో ప్రారంభంలో విక్రయించుకున్న రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది చివరిలో ధర పెంచుతారనే ఆశతో అన్నదాతలు బేళ్లను తీసుకురావడం లేదు. రైతులంతా పొగాకును తీసుకువస్తే వేలం కేంద్రాలు నిండిపోతాయి. గతంలో చాలాసార్లు ఈ పరిస్థితి వచ్చింది. ఇపుడు వచ్చేవి తక్కువగా ఉండటంతో కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వచ్చిన కొద్దిపాటి బేళ్లకు వేలం నిర్వహిస్తుండటంతో మొక్కుబడి తంతులా సాగుతోంది. జిల్లాలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దేవరపల్లి వేలం కేంద్రంలో మరీ తక్కువగా ఉంటోంది. పొగాకు క్యూరింగు, గ్రేడింగు ప్రక్రియలు ఇప్పటికే ముగిశాయి. పండించిన పొగాకు మొత్తం విక్రయానికి సిద్ధంగా ఉంది. విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపకపోవడం వేలం ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

తగ్గిన ఉత్పత్తి

ఈ ఏడాది జిల్లాలో పొగాకు ఉత్పత్తి తగ్గింది. ఈ నేపథ్యంలో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించారు. కానీ ఉత్పత్తి తగ్గినా ధర పెంచకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి ఒక్కో ఎకరానికి రెండు క్వింటాళ్ల చొప్పున దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. మంచి ధర ఇస్తే పొగాకును విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

దెబ్బ తింటున్న పొగాకు

ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పొగాకు దెబ్బతింటోంది. ఇంకా ఎక్కువ రోజుల పాటు రైతుల వద్దే నిల్వ ఉంటే మరింతగా పాడయ్యే ప్రమాదం ఉంది. హెచ్చుతగ్గులు లేకుండా ధర నిలకడగా ఉంటే విక్రయాలు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. చివరిదశలో ధర పెంచుతుండటం వల్లే విక్రయించకుండా నిరీక్షించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

Tobacco auction
ఐదు కేంద్రాల్లో వివరాలు

దిగుబడి తగ్గినా..

గత ఏడాది ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడి రాగా ఈ ఏడాది 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది 12 క్వింటాళ్లకు వచ్చిన ధర 10 క్వింటాళ్లకు వచ్చేలా ధర పెంచితే పొగాకు విక్రయాలు సాఫీగా సాగుతాయి. పెంచకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. - పిన్నమని రామారావు, రైతు, గాంధీనగరం, దేవరపల్లి మండలం

గిరాకీ ఉన్న రకాన్ని ముందుగా అమ్ముకోవాలి

నాణ్యత కలిగిన పొగాకుకు ధర బాగానే ఉంది. ఇతర గ్రేడులకు కాస్త తగ్గింది. ధర బాగున్న గ్రేడు పొగాకు వేలానికి తీసుకురావాలి. జాప్యం చేయడం వల్ల పాడయ్యే ప్రమాదం ఉంది. - కేవీ రాజ్‌ప్రకాష్‌, ప్రాంతీయ మేనేజరు, పొగాకు బోర్డు

ఇదీ చదవండి

అత్తిలిలో భారీగా రేషన్ పట్టివేత

పెరిగిన పెట్టుబడులతో నష్టపోతున్నాం: అరటి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.