ETV Bharat / state

అకాల వర్షాలతో రైతుకు తీవ్ర నష్టం.. పూర్తిగా తడిచిపోయిన ధాన్యం

author img

By

Published : Jan 18, 2022, 8:52 AM IST

paddy farmers suffer due to rains in vizianagaram
అకాల వర్షాలతో రైతుకు తీవ్ర నష్టం

Farmers suffer due to rains in vizianagaram: రైతుల పండుగ సంక్రాంతి వచ్చి వెళ్లిపోయింది కానీ.. అన్నదాతల కళ్లలో మాత్రం ఆనందం కనిపించడం లేదు! చేతికొచ్చిన పంటతో పండుగ బాగా చేసుకోవాలన్న వారికి నిరాశే మిగిలింది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అకాల వర్షం విజయనగరం జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మెలకెత్తిన ధాన్యం రాశులు.. అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి.

విజయనగరంలో అకాల వర్షాలతో రైతుకు తీవ్ర నష్టం

Farmers suffer due to rains in vizianagaram: విజయనగరం జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు 634 రైతు భరోసా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. తొలివిడతలో నాలుగున్నర లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచించినా.. ఈ నెల 15 వరకు కేవలం లక్షా 20 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. దీంతో.. మిగిలిన పంట అంతా కల్లాల్లోనే ఉంది.

సెప్టెంబరులో గులాబ్ తుపాను, నవంబరులో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే జిల్లాలో వరి పంటకు భారీ నష్టం వాటిల్లగా.. తాజాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు పొలాల్లో ఉన్న వరి కుప్పలు, బస్తాల్లో నిల్వ చేసిన ధాన్యం తడసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యం మొలకెత్తటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 34 మండలాల పరిధిలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా.

ధాన్యం సేకరణలో జాప్యం..
సంక్రాంతికి ముందే మూడోవంతు ధాన్యం కొనుగోళ్లు పూర్తికావాల్సి ఉన్నా.. ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, మిల్లర్ల జాప్యం కారణంగా కొనుగోళ్లు ఊపందుకోలేదు. అనుమతులు, గోనెసంచుల సమస్యలు ఎదుర్కొని కేంద్రాలకు తెచ్చినా.. తూకం వేయడంలో సిబ్బంది అలసత్వం చూపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే 3 రోజుల పాటు ఎడతెరిపి లేని అకాల వర్షాలు.. ధాన్యం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ధాన్యం రంగు మారితే మద్దతు ధర లభించే పరిస్థితి ఉండదని.. బియ్యం ముక్క అవుతుందన్న సాకుతో కొనుగోలుకు మిల్లర్లు ముందుకురారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో ఇబ్బందులు..
పంట చేతికొచ్చి రెండు నెలలు గడుస్తున్నా.. ధాన్యం నిల్వలు రైతు గడప దాటని పరిస్థితి. సంక్రాంతి పండుగ సమయానికైనా చేతికి డబ్బులొస్తాయని ఆశించిన రైతులకు.. అకాల వర్షాలు ముంచెత్తి వారి శ్రమను వృథా చేశాయి.


ఇదీ చదవండి:

hra: ఉద్యోగుల ఇంటి అద్దె భత్యంలో.. భారీ కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.