ETV Bharat / state

ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలతో మెరిసిన శిల్పారామం..

author img

By

Published : Jan 17, 2023, 3:32 PM IST

SHIPLARAMAM IN VIZIANAGARAM : ప్రాచీన కళలు, సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు వారధులు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ఈ శిల్పారామం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చేనేత, హస్తకళలకు నిలయమైన శిల్పారామంపై ఈటీవీ-ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

SHILPARAMAM
SHILPARAMAM

సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శిల్పారామం..

SHILPARAMAM : ఈ కాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే సాధనంగా మొబైల్​ ఫోన్​ మారిపోయింది. ఏ అవసరం ఉన్నా, ఏది కావాలన్నా ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టుకుంటే క్షణాల్లో వచ్చేస్తోంది. అందువల్ల బయట పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే.. చేతిలో ఫోన్​ ఉంటే చాలు ఆన్​లైన్​లో గేమ్స్​ ఆడటం అలవాటుగా మార్చుకున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నా.. మార్పు రావడం లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్ట్స్, క్రాప్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరంలో శిల్పారామం ఏర్పాటు చేశారు. సుమారు 41 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీనికి ప్రభుత్వం రూ.6కోట్లు కేటాయించింది. తొలి దశలో రూ.1.93కోట్లతో పలు సౌకర్యాలు కల్పించారు. పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు.

"ప్రతిరోజు 300 మందికి తగ్గకుండా వస్తున్నారు. వీకెండ్స్​ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్​బీఐ సహకారంతో ఆర్వో ప్లాంట్​ ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులకు సంప్రదాయ వంటలను అందిచాలని అనుకుంటున్నాం. ఈ ఆహారానికి సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే వాటికి పర్మిషన్​ ఇచ్చి షాప్స్​ పెట్టిస్తాం"-సూర్యకుమారి, విజయనగరం కలెక్టర్

మహిళా సంఘాలు, చేనేత, చేతివృత్తుల వారికోసం ప్రత్యేక స్టాళ్లను అందుబాటులోకి తెచ్చారు. సందర్శకులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్​బీఐ సహకారంతో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. నడిచేందుకు వీలుగా కాలి బాటలు నిర్మించారు. పర్యాటకుల ఆనందం కోసం వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో అన్ని సదుపాయాలు కల్పించటంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజులతోపాటు ప్రత్యేక రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, కుటుంబసభ్యులతో వస్తే ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

"ఈ వాతావరణం బాగుంది. పిల్లలు, పెద్దలకు చక్కటి వాతావరణాన్ని కల్పించారు. శిల్పారామం చాలా బాగుంది. చాలా సదుపాయాలు కల్పించారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్​ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో చాలా ఎంజాయ్​ చేయవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పార్కులు చాలా బాగున్నాయి"-పర్యాటకులు

ఈ ప్రాంతం నగర శివారులో ఉండటంతో.. రవాణా కష్టంగా మారిందని సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై లైట్లు ఏర్పాటు చేసి.. రవాణా సౌకర్యం కల్పిస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు. పార్కులు, ఆట స్థలాలు కనుమరుగవుతున్న తరుణంలో.. ఈ శిల్పారామం చిన్నారులలో ఉత్సాహం నింపుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.