మెరాయిస్తున్న టిమ్స్ యంత్రాలు.. చుక్కలు చూస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు

author img

By

Published : Jan 3, 2023, 11:14 AM IST

Updated : Jan 3, 2023, 11:39 AM IST

APSRTC UTS TIMS

APSRTC UTS NEW TIMS machines Sudden troubles: ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన యూటీఎస్‌ టిమ్స్ యంత్రాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా మెరాయిస్తున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాయితీ టికెట్లు ఇవ్వాలంటే దాదాపు 8 ఆప్షన్లు ఎంపిక చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆప్షన్లు తెలియక, కష్టాలు పడలేక ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సులు వెళ్లిపోతుండడంతో స్థానికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

APSRTC UTS NEW TIMS machines Sudden troubles: ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన యూటీఎస్‌ టిమ్ యంత్రాలు.. సిబ్బందికి, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో తరచూ మొరాయిస్తుండటంతో డ్రైవర్లు, కండక్టర్లు నానా కష్టాలు పడుతున్నారు. రాయితీ టికెట్లు ఇవ్వాలంటే ఏకంగా 8 ఆప్షన్లు ఎంపిక చేయాల్సి వస్తోంది. కొన్ని యంత్రాల్లో డబ్బు చెల్లించినా.. టికెట్ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.

ప్రయాణికులకు అధునాతన సేవలు అందించే లక్ష్యంతో ఏపీఎస్‌ఆర్టీసీ యూటీఎస్ టిమ్స్ యంత్రాలను ఇటీవలే అన్ని బస్సుల్లో ప్రవేశపెట్టింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, సిబ్బందికి పనిభారం తగ్గించడం వీటి ముఖ్య ఉద్దేశం. తొలుత కొన్ని డిపోల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశాక.. రాష్ట్రవ్యాప్తంగా యూటీఎస్ టిమ్ యంత్రాలను ఆర్టీసీ విస్తరించింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సహా అన్ని దూరప్రాంత ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో సిబ్బందికి యూటీఎస్‌ టిమ్స్‌ అందించి వీటి ద్వారానే టికెట్లు ఇస్తోంది. ఆలోచన ఘనంగానే ఉన్నా.. సాంకేతిక సమస్యలతో ఆచరణలో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు. సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో తెచ్చిన ఈ యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. కొన్ని యంత్రాలు ఉన్నట్టుండి ఆగిపోయి కొన్ని నిమిషాల వరకు పనిచేయడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సిబ్బంది సతమతమవుతున్నారు.

బస్సుల్లో రాయితీ టికెట్లు జారీచేయాలంటే సిబ్బంది హడలిపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు సహా వివిధ వర్గాల వారికి రాయితీ టికెట్ ఇచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. గతంలో ఉన్న టిమ్ యంత్రంలో కేవలం రెండు బటన్లు నొక్కితే రాయితీ టికెట్లు వచ్చేవి. కొత్త యంత్రాల్లో ఈ టికెట్ల జారీకి ఏకంగా 8 ఆప్షన్లు ఎంపిక చేయాల్సి వస్తోంది. యూటీఎస్‌ టిమ్ యంత్రాలు టచ్ స్క్రీన్ కావడంతో గతంలో మాదిరిగా రన్నింగ్‌ బస్సులో టికెట్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రద్దీ ఉంటే టికెట్ల జారీకి అధిక సమయం పడుతోందని కండక్టర్లు అంటున్నారు. రాయితీ టికెట్ల జారీని మరింత సులభతరం చేయాలని సిబ్బంది కోరుతున్నారు.

యూటీఎస్ టిమ్ యంత్రాల్లో మొబైల్ సిమ్ అమర్చి ఇంటర్నెట్‌తో పనిచేసేలా రూపొందించారు. బస్సులో టిమ్‌తో డ్రైవర్ టికెట్ జారీ చేయగానే ఆర్టీసీ వెబ్ సైట్లోనూ వివరాలు వెంటనే అప్ డేట్ అవుతాయి. బస్సు నడుస్తున్నప్పుడు పలు ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేకపోవడం వల్ల ఇంటర్నెట్ అంతరాయం కలుగుతోంది. ఆ సమయంలో డ్రైవర్ టికెట్ ఇచ్చినా... సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ కావడం లేదు. సిగ్నల్ వచ్చి అప్‌డేట్ అయ్యేలోపు అదే సీటుకు ఇతర బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు జారీ చేస్తున్నారు. బస్టాండ్‌లో టికెట్ తీసుకున్న ప్రయాణికులు... బస్సెక్కగానే ఆ సీటును డ్రైవర్ వేరొకరికి కేటాయించారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. నెట్ వర్క్ సమస్య కారణంగా బస్సులో ఖాళీ సీట్ల వివరాలు సైతం టిమ్ యంత్రాల్లో తప్పుగా చూపిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా సూపర్ లగ్జరీ బస్సులో 36 సీట్లు మాత్రమే ఉంటాయి. 16 సీట్లు బుక్‌ చేస్తే... మరో 20 మాత్రమే ఖాళీగా చూపించాలి. యూటీఎస్‌ టిమ్ యంత్రాల్లో మాత్రం 25 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తోంది. బస్సులో మొత్తం 41 సీట్లు ఉన్నట్లు చూపించడంతో గందరగోళ పరిస్ధితి నెలకొంటోంది.

అభిబస్ ద్వారా మహిళలకు బుక్‌ చేసిన టికెట్లు పసుపు రంగులో చూపించాల్సి ఉండగా టిమ్ యంత్రాల్లో చూపించడం లేదు. ఇది తెలియక డ్రైవర్ మహిళల పక్కన పురుషులకు సీటు ఇస్తే గందరగోళ పరిస్ధితి తలెత్తుతోంది. టిమ్ యంత్రాల్లో డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు కొన్నిసార్లు ప్రయాణికుల నుంచి డబ్బు చెల్లించినట్లు సందేశం వచ్చినా టికెట్లు జారీ కావడం లేదంటున్నారు. కొన్ని యంత్రాల్లో టికెట్ల జారీలో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. లోపాలు సరిదిద్దికపోవడంతో ప్రయాణికులతో గొడవలు జరుగుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంత బస్సుల్లో చార్జింగ్‌ సమస్యలు కూడా ఉన్నాయని.. కొన్ని టిమ్ యంత్రాలు ఉన్నట్టుండి ఆగిపోతున్నాయని చెబుతున్నారు.

ఆర్టీసీలో చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు కేవలం పదో తరగతి మాత్రమే చదువుకున్న వారు ఉన్నారు. వీరికి టచ్ ఆధారంగా పనిచేసే నూతన టిమ్ యంత్రాలపై పూర్తిగా అవగాహన లేదు. వీరికి డిపోల్లో అరకొరగా శిక్షణ ఇచ్చి పంపడంతో వీరు టికెట్ల జారీ చేసేందుకు కుస్తీలు పడుతున్నారు. ఆప్షన్లు తెలియక, కష్టాలు పడలేక ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. తక్షణమే సమస్యలను పరిష్కరించి టికెట్ల జారీని సులభతరం చేయాలని సిబ్బంది డిపో అధికారులను కోరుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated :Jan 3, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.