ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయాల్లో రెండోరోజూ ఏసీబీ తనిఖీలు

author img

By

Published : Jul 21, 2021, 12:31 PM IST

acb-rides
acb-rides

విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లో రెండోరోజు అధికారులు సోదాలు చేస్తున్నారు. పాస్‌ పుస్తకాలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో లోపాలను గుర్తిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండోరోజూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, శృంగవరపుకోట, జామి, కొత్తవలస తహసీల్దార్ కార్యాలయాల్లో.. విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఇవాళ దస్త్రాలు పరిశీలిస్తున్న అధికారులు.. మంగళవారం మ్యుటేషన్లు, భూలావాదేవీల్లో లోపాలపై దృష్టి పెట్టారు. పాస్ పుస్తకాలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీలోనూ లొసుగులు గుర్తించారు.

  • మంగళవారం ఆరు తహసీల్దారు కార్యాలయాల్లో అనిశా సోదాలు..

విజయనగరం జిల్లాలో అనిశా అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, కొత్తవలస, ఎస్‌.కోట, జామి తహసీల్దారు కార్యాలయాల్లో అనిశా డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యకలాపాలపై దృష్టి సారించారు. విశాఖలో రాజధాని ఏర్పాటు నేపథ్యంలో సమీపంలోని మండలాల్లో తహసీల్దారు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. భూ వ్యవహారాలు, బదలాయింపులు, మ్యూటేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు పాసు పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారు.. ఎందరికీ ఇవ్వాల్సి ఉంది.. ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకపోతే 94404 46174 నంబరును సంప్రదించాలని సూచించారు.

భోగాపురం విమానాశ్రయం, కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం నేపథ్యంలో ఈ మండలంలో భూములు, స్థలాల క్రయవిక్రయాలు బాగా జరుగుతున్నాయి. రెవెన్యూ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనిశా అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అధికారుల పర్సులు, బ్యాగులు, వాహనాలు తనిఖీ చేశారు. బయటి నుంచి వచ్చిన వారితో ఎందుకు వచ్చారు.. ఎన్నాళ్లుగా తిరుగుతున్నారు. అధికారులు ఏ కారణాలు చెబుతున్నారో ఆరా తీశారు. దస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించారు.

డెంకాడ మండలానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన అధికారులు రాత్రి వరకు దస్త్రాలు పరిశీలించారు. కొంతమంది వీఆర్వోలను పిలిపించి మాట్లాడారు. వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

ఎస్‌.కోటలోనూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాల జారీ, మ్యూటేషన్లు తిరస్కరించడానికి గల కారణాలపై ఆరా తీశారు. మొత్తం 822 మ్యూటేషన్లు తిరస్కరించినట్లు గుర్తించారు. సర్వేయర్‌ లేకపోవడంతో పలుమార్లు ఆయన కోసం కబురు పెట్టారు. సాయంత్రం వరకు రాలేదు. బుధవారం పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది.

పూసపాటిరేగ తహసీల్దారు కార్యాలయంలో ఏలూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రవీంద్ర తనిఖీలు చేశారు. సాయంత్రం వివరాలు వెల్లడించారు. 471 పాసు పుస్తకాలు రైతులకు ఇవ్వకుండా ఉంచారని, కనీసం వాటి వివరాలు దస్త్రాల్లో నమోదు చేయలేదని చెప్పారు. 2876 ఇంటి పట్టాలు మంజూరు కాగా.. 2199 పంపిణీ చేశారని.. మరో 629 కార్యాలయంలోనే ఉన్నట్లు తేలింది. కనిమెట్ట గ్రామంలో 147 మందికి గతంలో ఇంటి పట్టాలు ఇవ్వగా.. పొజిషన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రెండో సారి ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు పరిశీలనలో తేలింది. రెవెన్యూ సమస్యలపై మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకున్నా సరైన కారణాలు లేకుండా తిరస్కరించినట్లు గుర్తించారు. భూ బదలాయింపులపై అభియోగాలున్నాయని, వీటిపై లోతైన విచారణ చేయాల్సి ఉందని, బుధవారం కూడా తనిఖీలు కొనసాగిస్తామని ఎస్సైలు శ్రీనివాస్‌, రవీంద్ర తెలిపారు.

విశాఖకు సమీపంలోని కొత్తవలసలో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి చీకటిపడే వరకు అధికారులున్నారు. తలుపులు వేసి వీఆర్వో, సిబ్బంది నుంచి నగదు, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. పనుల నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడి డబ్బులు ఏమైనా డిమాండ్‌ చేస్తున్నారా అని అడిగారు. బయట నిలిపివేసిన వారిని పిలిపించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. విధులకు గైర్హాజరైన వారికి ఫోన్‌ చేసి పిలిచారు. డీఎస్పీ రఘువీర్‌విష్ణు, ఎస్సైలు మహేష్‌, శ్రీనివాసరావు, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

జామి తహసీల్దారు కార్యాలయంలో ఎఫ్‌ఎంబీలు, మ్యూటేషన్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తీరును పరిశీలించారు. పట్టాదారు పాసు పుస్తకాలు వంద వరకు ఇవ్వకుండా ఉంచేశారని గుర్తించారు. సీఐలు హరి, శ్రీనివాసరావు, ఎస్సై సత్యారావు దస్త్రాలను పరిశీలించారు.

ఇదీ చదవండి:

ACB RIDE: రెవెన్యూ కార్యాలయాలపై అనిశా దాడులు.. కీలక దస్త్రాలపై దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.