ETV Bharat / state

Pendurthi Land Issue: విశాఖలో రౌడీ మూకల బరితెగింపు.. మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి హల్​చల్​

author img

By

Published : Jun 1, 2023, 8:27 AM IST

Updated : Jun 1, 2023, 8:56 AM IST

pendurthi land issue
pendurthi land issue

Pendurthi Land Issue: విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. మంత్రి, ఎమ్మెల్యే అనుచరులమంటూ.. ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. కాపలాగా ఉన్న సదరు మహిళను బంధించి, ఆమె ఉంటున్న ఇంటిని కూల్చేసి.. వీరంగం సృష్టించారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

Pendurthi Land Issue: విశాఖ జిల్లాలో ఓ వివాదాస్పద స్థలంలో కొందరు రౌడీ మూకలు బరి తెగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యంత్రాలు పెట్టి మరీ షెడ్డును నేలమట్టం చేశారు. సుమారు వందల మందికి పైగా యువకులు, పది మంది మహిళలు వచ్చి మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి హల్ చల్ చేశారు.

విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో 14.60 ఎకరాల వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలం మహేశ్‌ అనే గుత్తేదారు ఆధీనంలో ఉంది. ఈ స్థలంలో రేకుల షెడ్డ్ వేసి దేవి అనే మహిళను కాపలాదారుగా పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి రౌడీముకలు మహిళలతో కలిసి వచ్చి కాపలాదారు దేవిని నిర్బంధించి రేకుల షెడ్డును కూల్చివేశారు. ఈ విషయాన్ని యజమానికి చెప్పేందుకు దేవి ప్రయత్నించగా ఆమె ఫోన్‌ లాక్కున్నారు.

యంత్రాలతో రేకుల షెడ్డును, ప్రహరీని కూల్చి చదును చేశారు. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ తంతు నడిచింది. తీవ్రంగా భయపడిపోయిన కాపలాదారు దేవి వారి చెర నుంచి తప్పించుకుని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల రాకను గమనించిన రౌడీమూకలు అక్కడి నుంచి జారుకున్నారు. ఒకరిద్దరిని స్థానికులు పట్టుకుని అప్పగించినా పోలీసులు వదిలేశారనే వారు ఆరోపించారు.

"నా పేరు దేవి. రెండు నెలల నుంచి వాచ్​మెన్​గా చేస్తున్నాను. రాత్రి 12గంటల ప్రాంతంలో లేడీస్​ వచ్చారు. వచ్చి తలుపులు బాదుతున్నారు. ఎవరని అడిగితే మంచి నీళ్లు కావాలంటూ చెపితే డోర్​ ఓపెన్​ చేశా. వెంటనే ఇంట్లోకి సుమారు 10 మంది వచ్చి నన్ను చుట్టుముట్టి తాళ్లతో కట్టి దూరంగా బంధించారు. షెడ్డులో ఉన్న సామాన్లు అన్ని బయటపడేసి కూల్చేశారు. మొత్తం 100 మంది వరకు అబ్బాయిలు ఉన్నారు. నా భర్తకు ఫోన్​ చేసుకోవడానికి అడిగినా ఇవ్వలేదు. ఎవరికైనా చెప్పడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇప్పటికి కూడా నా ఫోన్​ ఇవ్వలేదు"-దేవి, కాపలాదారు

ఈ వివాదస్పద స్థలంపై కొన్నేళ్లుగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. షిప్‌యార్డు సొసైటీ పేరిట వుడా అనుమతితో అధికారికంగా లే అవుట్‌ వేయగా ప్లాట్లు కొనుగోలు చేశామని కొందరు తెలిపారు. వారి నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకున్నామంటూ మరికొందరు రంగంలోకి దిగారు.

ఎమ్మెల్యే , మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. స్థలం ఆక్రమించుకునేందుకు యత్నించారు. అయితే ఈ స్థలం తన మిత్రుడు ASR శర్మ తనకు GPA ఇచ్చినట్లు గుత్తేదారు మహేశ్ చెప్పారు. పొజిషన్‌లో సైతం తామే ఉన్నామని సివిల్‌ కోర్టు సైతం నిర్ధారించిందన్నారు. కానీ కొందరు మంత్రి, MLA పేర్లతో బెదిరిస్తున్నారని గుత్తేదారు మహేశ్ తెలిపారు.

"ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, మంత్రి అమర్‌నాథ్‌ల పేర్లు చెప్పి సునీల్‌, వినోద్‌, వీఎల్‌కే ప్రసాద్‌, సదాశివరావు వంటి మధ్యవర్తులు భయపెడుతున్నారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే, మంత్రి నుంచి స్పందన లేదంటే వారి ప్రమేయం ఉండే ఉంటుందని అనుమానం. ఇంతకుముందు దౌర్జన్యం చేయబోతే కేసు పెట్టగా ఛార్జిషీటులో ఎవరైతే ఉన్నారో వాళ్లే మళ్లీ షెడ్డు కూల్చడానికి తెగబడ్డారు. మా సిబ్బందిని, కాపలాదారులను బెదిరించడం, గోడలు, షెడ్డు పడగొట్టడంవంటివి చేస్తున్నారు. న్యాయస్థానంలో ఈ స్థలం మేమే గెలుచుకున్నాం. పొజిషన్‌లో మేమే ఉన్నామని సివిల్‌ కోర్టు నిర్ధారించింది"-మహేశ్​, గుత్తేదారు

ఈ విషయంలో పోలీసుల వైఖరిపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ భూవివాదంలో పోలీసుల జోక్యం ఎక్కువైందంటూ గతంలో మహేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...ఈ వ్యవహారంలో కలుగజేసుకోమంటూ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు దీన్ని సాకుగా చూపి వందల మంది వచ్చి దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మహేశ్ ఆరోపించారు.

Last Updated :Jun 1, 2023, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.