ETV Bharat / state

Nadu Nedu Works Not Complited: నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. ఆగిన నాడు - నేడు పనులు

author img

By

Published : Jun 16, 2023, 7:11 AM IST

Updated : Jun 16, 2023, 11:52 AM IST

Etv Bharat
Etv Bharat

NADU NEDU SCHOOLS WORKS STORY: ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాడు - నేడు పనులు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రెండో విడత పనులన్నీ అసంపూర్ణంగా వెక్కిరిస్తున్నాయి. బడులు తెరిచేలోగా సర్వం సిద్ధం చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశపెట్టినా ఇబ్బందుల మధ్యే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. ఆగిన నాడు - నేడు పనులు

Mana Badi Nadu Nedu : ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బడుల్లో నాడు - నేడు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. పాఠశాలలు కొత్తగా రూపుదిద్దుకుంటాయనే ఆశతో వెళ్లిన విద్యార్థులకు గతేడాది సమస్యలే మళ్లీ స్వాగతం పలికాయి. జూన్‌ 12 నాటికి పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం.. నిధులు మాత్రం సకాలంలో విడుదల చేయలేదు. ఫలితంగా నాడు-నేడు పనులకు మోక్షం లభించలేదు.

అసంపూర్తిగా ఉన్న భవనాలు : విజయనగరం జిల్లాలో నాడు-నేడు రెండో విడతలో 17 వందల 74 పనులను ప్రతిపాదించగా 117మాత్రమే పూర్తయ్యాయి. జిల్లాలో 598 అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించగా అందులో 8 మాత్రమే పూర్తయ్యాయి. 625 మరమ్మతుల పనులకు 39మాత్రమే పూర్తి చేశారు. ఇక మరగుదొడ్లు, వంటశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. విద్యార్ధులు అసంపూర్తిగా ఉన్న భవనాల మధ్యనే చదువుకుంటున్నారు.

Nadu-Nedu Scheme: పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు

నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం : పార్వతీపురం మన్యం జిల్లాలో 540 పాఠశాలల్లో 140 కోట్లతో నాడు-నేడు రెండో విడత కింద 14 వందల 48 పనులు చేపట్టారు. అందులో 48 పనులు మాత్రమే పూర్తయ్యాయి. బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు ముందుకు సాగలేదు. కొన్నిచోట్ల సిమెంట్, ఇసుక, ఇతర సామగ్రి సరఫరా కాలేదు. ప్రస్తుతం బడుల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు నిలిపివేశారు. పార్వతీపురం మండలంలో 15 పాఠశాలల్లో పనులు చేపట్టగా నత్తనడకన సాగుతున్నాయి. భామిని మండలంలో 29 పాఠశాలల్లోనూ పనులేవీ పూర్తి కాలేదు. పాలకొండ మండలంలో మొదటి విడత పనులకు సగం నిధులే వచ్చాయి. రెండో దశలో 10 కోట్లకు కేవలం 2 కోట్లే విడుదల చేశారు. మిగతా పనులకు బిల్లులు రాక నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి.

NO CLASS ROOMS: నాడు-నేడు పనుల్లో జాప్యం.. చెట్ల కిందే చదువు

అద్దె ఇంటి వరండాలో తరగతులు : సాలూరు మండలంలో రెండో విడతలో 7 పాఠశాలల్లో పనులకు 5.28 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులే మంజూరు కాలేదు. గరుగుబిల్లి మండలంలో రెండో విడతకు 31 పాఠశాలలను ఎంపిక చేసినా నేటికీ పైసా విడుదల కాలేదు. గంగన్నదొర వలసలో శిథిల పాఠశాలను కూల్చేసి 2022 సెప్టెంబరులో కొత్త నిర్మాణ పనులు ప్రారంభించారు. 23 లక్షలకు 3 లక్షలు మాత్రమే విడుదల చేశారు. వాటితో పునాదులు వేశారు. తర్వాత నిధులు విడుదలలో జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఇటీవల మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం అద్దె ఇంటి వరండాలో తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకురాలి ఇంటి ఆవరణలో భోజనాలు వడ్డించాల్సిన పరిస్థితి.

NADU-NEDU: నత్తనడకన నాడు-నేడు.. అసంపూర్తి పనులతో అవస్థలు

కలెక్టర్ ఆదేశాలు : బొబ్బిలి పురపాలికలో 37 భవనాల పనులు చేపట్టగా అవన్నీ వివిధ దశల్లో నిలిచిపోయాయి. విజయనగరం మండల పరిధిలో 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. కొత్తవలస ఉన్నత పాఠశాలను 20 రోజుల క్రితం కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐనా ఇంతవరకు పూర్తి చేయలేదు. గంట్యాడ మండలంలో12 పాఠశాలల్లో రెండు చోట్లే పూర్తి చేశారు. చీపురుపల్లి మండలంలో తొలిదశలో చేపట్టిన 197పనుల్లో 107 నేటికీ వివిధ దశల్లో ఉన్నాయి. రాజాం మండలంలో 16 పాఠశాలల్లో నాలుగింటిల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. విద్యార్థులు చెట్ల కింద, అద్దె గృహాలు, గ్రంథాలయాల్లో చదువుకోవాల్సి వస్తోంది.

అధికారులు మాత్రం నెల రోజుల్లో నాడు-నేడు రెండో విడత పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ జరుగుతున్న పనులు చూస్తే ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కావడం లేదు.

Nadu Nedu: పేరు గొప్ప ఊరు దిబ్బ.. నత్తనడకన నాడు నేడు రెండో దశ నిర్మాణ పనులు

Last Updated :Jun 16, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.