రిషికొండ ధ్వంసంపై.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

author img

By

Published : Nov 12, 2022, 7:48 PM IST

రఘురామకృష్ణరాజు

union forest environment minister on RushiKonda: రిషికొండపై 9.88 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల్లోని అటవీ ప్రాంతాన్ని తవ్వేసిందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అత్యంత నిజాయితీపరులైన అధికారులతో విచారణ జరిపించాలని లేఖలో కోరారు.

MP Raghu Rama Krishna Raju letter: విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న రిషికొండలో జరిపిన తవ్వకాలపై పరిశీలన జరిపి నివేదిక ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అత్యంత నిజాయితీపరులైన అధికారులను పంపాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినందున అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ఎంపీ రఘురామ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. హైకోర్టు ఉత్తర్వులు, రుషికొండ తవ్వకాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను లేఖకు జత చేశారు. ఉపగ్రహ చిత్రం ద్వారా తవ్విన కొలమానాలను లెక్కిస్తే ఇప్పటివరకు 8,80,262.75 చదరపు అడుగులు తవ్వినట్లు స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో వివరించారు. ఇది సుమారు 2 కిలోమీటర్లు ఉందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

నిజాయితీ పరులైన అధికారులతో విచారణ జరిపించండి: రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖను సంప్రదించి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రుషికొండపై విస్తృతస్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి.. కొండ అందాలను, పచ్చదనాన్ని ధ్వంసం చేసిందన్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఇక్కడి ప్రకృతి సహజ అందాలను... ముఖ్యంగా కొండ ప్రాంతాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని రఘురామ పేర్కొన్నారు. కానీ, ఏ ప్రభుత్వ విభాగామూ ఈ ఆదేశాలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న రఘురామ... ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ది ప్రాంత అభివృద్ది చట్టం 1975 లోని అధికారాలను అనుసరించి రాష్ట్ర మున్సిపల్ శాఖ ఈ మాస్టర్ ప్లాన్‌ నోటిపై చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. కానీ, రిషికొండ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఎన్టీజీటీ, హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలు: కొండపై ఎంత ప్రదేశంలో తవ్వకాలు జరిగాయో తెలుసుకోవడానికి నిపుణుల బృందాన్ని పంపాలని ఏపీ హైకోర్టు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించినట్లు భూపేంద్ర యాదవ్‌కు తెలిపారు. నాలుగు వారాల్లోపు ఇందుకు సంబంధించి నివేదిక పంపాలని చెబుతూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసిందని లేఖలో ప్రస్తావించారు. కొండలు, అడవులు, జలశయాల్లాంటివి ఏ ప్రాంతాంలో ఉన్నా పర్యావరణ సున్నితత్వాన్ని కలిగి ఉంటాయని, వాటిని సంరక్షించి ప్రాథమిక స్వరూపాన్ని కాపాడాల్సి ఉంటుందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నో సార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రకృతి వనరులను సంరక్షించి, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని చెప్పిందన్న రఘురామ... ఇలాంటి సహజ వనరులకు ఏమాత్రం దెబ్బ తగలిగినా అది ప్రజా విశ్వాసాన్ని ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అవుతుందన్నారు.

20 ఎకరాల్లో తవ్వకాలు: రిషికొండపై 9.88 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల్లోని అటవీ ప్రాంతాన్ని తవ్వేసిందని... 9.88 ఎకరాలకు అతీతంగా మరో 3.86 ఎకరాలను డంపింగ్ కోసం తవ్వినట్లు పర్యాటక శాఖ ఇప్పటికే కోర్టులో అంగీకరించినట్లు రఘురామ కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ 2 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు ఆశాఖ చెబుతోందని.... ఆ మాత్రం దానికి 20 ఎకరాలను తవ్వాల్సిన అవసరమే ఉండదని నర్సాపురం ఎంపి తెలిపారు. ఇప్పుడు తవ్విన కొండ ప్రాంతంలో కొంత భాగం సీఆర్‌జెడ్‌ నిబంధనల కింద 'నో డెవలప్మెంట్' జోన్‌ పరిధిలోకి వస్తుందన్నారు. తవ్విన మట్టినంతా సముద్ర తీరప్రాంతం పొడవునా సీఆర్‌జెడ్‌ ప్రాంతంలో పారబోశారని.... రుషికొండపై ఎంత ప్రాంతాన్ని తవ్వారు, ఎంత ప్రాంతంలో డంపింగ్ చేశారన్నది నిపుణుల కమిటీనే నిర్ధారించాల్సి ఉందన్నారు.

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, అక్కడ జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని పరిగణలోకి తీసుకొని అత్యంత నిజాయితీ పరులైన అధికారులతో కూడిన బృందాన్ని పంపి, ఏపీ హైకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు గడువులోగా నివేదిక అందించాలని.. లేనిపక్షంలో భారీ నిర్మాణాలతో ఇక్కడ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగే ప్రమాదం ఉందని రఘురామకృష్ణరాజు భూపేంద్ర యాదవ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.