ETV Bharat / state

మన్యంలో మృతుల కుటుంబాలకు మావోల క్షమాపణ.. ఆడియో విడుదల

author img

By

Published : Aug 11, 2020, 5:04 PM IST

మన్యంలో మృతుల కుటుంబాలకు మావోల క్షమాపణలు.. ఆడియో విడుదల
మన్యంలో మృతుల కుటుంబాలకు మావోల క్షమాపణలు.. ఆడియో విడుదల

అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. మృతి చెందిన వారు తమ కుటుంబ సభ్యులేనని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. మరోవైపు పోలీసులు కాల్పుల విరమణకు పాల్పడుతున్నారని ఏవోబీ స్పెషల్​ జోన్​ కమిటీ కార్యదర్శి గణేష్​ పేరిట లేఖ విడుదల చేశారు.

maoist news
మావోయిస్టులు లేఖ

విశాఖ మన్యంలో ఇటీవల ప్రమాదవశాత్తు మందుపాతర పేలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మావోయిస్టులు క్షమాపణలు కోరారు. ఈ మేరకు పెదబయలు.. కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్​... ఓ ఆడియో టేపును విడుదల చేశారు. ఆగస్టు 1వ తేదీన ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలని ఆడియోలో మావోలు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన ఇద్దరూ తమ కుటుంబ సభ్యులేనని మావోలు చెప్పారు.

అసలు ప్రమాదం ఎలా జరిగిందనే అంశాన్ని మావోలు ఆడియోలో వివరించారు. జులై 19వ తేదీన లండులు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తమను చుట్టుముట్టిన నేపథ్యంలో వారిని ప్రతిఘటించే క్రమంలో ప్రాణ రక్షణ కోసం ఏర్పాటు చేసిన మందుపాతర పేలి గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని పోలీసులు తమపై గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మావోలు ఆడియోలో వివరించారు.

కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్నారు

కరోనా కష్టకాలంలో మావోయిస్టులు ప్రకటించిన కాల్పుల విరమణను ఉల్లంఘించి ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి కాల్పులకు తెగబడుతున్నారని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఏవోబీ ప్రాంత స్పెషల్​ జోన్​ కమిటీ కార్యదర్శి గణేష్​ పేరిట నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు.

కరోనా విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్​ ప్రభుత్వం కాల్పుల విరమణ ఉల్లంఘించి.. మావోయిస్టులపై కాల్పులకు తెగబడుతున్నారు. జగన్​ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజలు ఖండించాలి. కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయకపోగా.. ఏవోబీ సరిహద్దులోని గ్రామాల్లో అక్రమ అరెస్టులు, కూంబింగ్​లు ఆగలేదు. పోలీసు దాడుల్లో గాయపడిన మావోలను రక్షించడం కోసం ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అమరవీరుల వారోత్సవాలు విజయవంతం చేసినందుకు ఏవోబీ సరిహద్దు ప్రజలకు వందనాలు.

- గణేష్​, ఏవోబీ స్పెషల్​ జోన్​ కమిటీ కార్యదర్శి

--

ఇదీ చూడండి:

'శిరోముండనం బాధితుడిని కొందరు బలి చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.