ETV Bharat / state

Tirupati Gangamma Jatara: గంగమ్మ తల్లి జాతరకు అరుదైన గౌరవం.. రాష్ట్ర పండుగగా గుర్తింపు..

author img

By

Published : Apr 16, 2023, 1:31 PM IST

Recognition of Gangamma fair as a state festival
తిరుపతి గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం

Tirupati Gangamma Jatara: తిరుపతి గంగమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిత్యం గంగమ్మ తల్లిని భక్తి, శ్రద్ధలతో కొలిచే తిరుపతి వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Tirupati Gangamma Jatara: రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం దక్కింది. దుష్టులను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా.. కలియుగదైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకొనే జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు రావడం అనందంగా ఉందంటున్నారు తిరుపతి వాసులు.

గంగమ్మ తల్లి జాతరకు దాదాపు తొమ్మిది శతాబ్దాల గొప్ప చరిత్ర ఉంది. శ్రీవారికి స్వయాన చెల్లెలుగా తితిదే నుంచి తాతయ్యగుంట గంగమ్మ సారె అందుకుంటోంది. తొమ్మిది వందల ఏళ్ల చరిత్రను పొందిన గంగమ్మ తల్లికి ఈ అరుదైన ఘనత దక్కటంతో తిరుపతి వాస్తవ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని అనుసరిస్తూ గంగమ్మ జాతరలో రోజుకో వేషం ధరిస్తూ ఏడు రోజుల పాటు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. దుష్టుల నుంచి స్త్రీలను కాపాడటానికి స్వయానా అమ్మవారు వివిధ వేషాలతో సాక్షాత్కరించిందన్న విశ్వాసంతో భక్తులు ఆ వేషాలు నేటికీ ధరిస్తూ మొక్కులు చెల్లించుకొంటున్నారు. సనాతన ఆచార వ్యవహారాలను నేటికీ భక్తులు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

మాతంగి వేషంలో మగవారు మహిళల దుస్తులతో నృత్యం చేస్తూ అమ్మవారిని దర్శించుకోవడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిఏటా చైత్రమాసం చివరి వారంలో ఏడు రోజుల పాటు జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక భక్తులు తరలివచ్చి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం నిర్మించినప్పటి నుంచి 12 ఏళ్లకు ఒక్కసారి కుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 12 సంవత్సరాలు ఈ ఏడాదికి పూర్తి అవడంతో మే 1 నుంచి 5వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

" నిత్యం మేము పూజించే తాతయ్యగుంట గంగమ్మ తల్లికి నిర్వహించే జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినందుకు తిరుపతి వాస్తువ్యులుగా మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీవారికి స్వయాన చెల్లెలుగా తితిదే నుంచి సారె అందుకుంటున్న గంగమ్మకు మే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నాము." - శిరీష, తిరుపతి నగర మేయర్‌

గంగమ్మ తల్లి జాతరకు అరుదైన గౌరవం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.