ETV Bharat / state

నివర్ తుపాన్.. ప్రకాశం జిల్లాలో వర్షాలు

author img

By

Published : Nov 25, 2020, 8:41 PM IST

nivar effect on prakasham district
నివార్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో వర్షాలు

నివర్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం వల్ల ప్రకాశం జిల్లాలో వాతావరణం చల్లబడి చిరు జల్లులు కురుస్తున్నాయి. పిల్లలు, వృద్ధులను ఇంటినుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

నివర్‌ తుపాన్‌ కారణంగా ప్రకాశం జిల్లాలో సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఒంగోలు, చీరాల, కొత్తపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. జిల్లాపై కూడా తుపాన్‌ ప్రభావం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 11 తీర మండలాలకు ప్రత్యేక అధికారులను, జాతీయ విపత్తుల నివారణా బృందాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. దాదాపు 40 గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. పిల్లలు, వృద్ధులను ఇంటినుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు. పాత ఇళ్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాల వద్ద జన సంచారం ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు. చీరాల నుంచి గుడ్లూరు వరకూ ఉన్న తీర మండలాల్లో పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి... జనరేటర్లతో ద్వారా విద్యుత్తు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టారు. నిత్యవసర సరుకులు కూడా అందుబాటులో ఉంచారు. పోలీసులు, మెరైన్‌ పోలీసులు సమన్వయంతో తీర ప్రాంతాల్లో పహారా కాస్తూ, సముద్రంవైపు జనం వెళ్లకుండా చూస్తున్నారు. మత్స్యకారులు రెండు రోజులనుంచే వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1077 ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ పోల భాస్కర్‌, ఎస్పీ సిద్దార్థ కౌశల్‌లు తుపాన్‌ పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇదీ చూడండి. దూసుకొస్తున్న నివర్...అర్ధరాత్రి నుంచి ఏపీలో వర్షాలు: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.