ETV Bharat / state

పెన్సిల్ లెడ్​పై జీవిత చరిత్రలు.. ఔరా అనిపిస్తున్న యువతి

author img

By

Published : Feb 7, 2023, 2:54 PM IST

Micro Artist Mahitha: ఖాళీ సమయం దొరికితే చాలు.. మిత్రులతో గడపడం, విహార యాత్రలకు వెళ్లడం యువతకు మహా సరదా. ఆ యువతి అందుకు భిన్నం. కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే తనకు సంతృప్తి. దాంతోనే ప్రత్యేకత చాటుకుంది. నిత్యం అదేపనిగా లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితంగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే అందులో పూర్తి నైపుణ్యం సాధించింది ఈ పెన్సిల్‌ ఆర్టిస్ట్‌. ఇంతకీ ఎవరా యువతి.? ఏమా పెన్సిల్‌ ఆర్ట్స్‌ అనేగా సందేహం..? అయితే లేటెందుకు పదండి చూద్దాం.

Micro Artist Mahitha
మైక్రో ఆర్టిస్ట్

మైక్రో ఆర్టిస్ట్‌గా ప్రత్యేకత చాటుకుంటున్న మహిత

Micro Artist Mahitha: ఎవరైనా పెన్సిల్‌తో అక్షరాలు రాస్తారు. కానీ ఈ యువతి పెన్సిల్‌ లెడ్‌పైనే అక్షరాలు రాస్తూ.. ఔరా.. అనిపిస్తోది. ఖాళీగా కూర్చోలేక ప్రారంభించిన పని ఇప్పుడు తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడుతోంది. అందరిలాగా కాక ఏదో కొత్తది ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు అనుకున్న స్థాయికి చేరుకుంటాం అంటుంది ఈ యువతి. పెన్సిల్‌ లెడ్‌పై అక్షరాలు చెక్కుతున్న ఈ అమ్మాయి పేరు అన్నం మహిత. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన నర్సింహారావు, భ్రమరాంబల కుమార్తె. తండ్రి ఆటో డ్రైవర్‌, తల్లి గృహిణి. మహిత డిగ్రీ పూర్తవగానే దేశంలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా సొంతగానే సూక్ష్మకళ నేర్చుకుంది. సరదాగా ప్రారంభమైన అలవాటు తనకు చాలా పేరు తెచ్చింది.

పెన్సిల్ లెడ్‌పై 700 సంస్కృత శ్లోకాలు: మొదట చిన్నచిన్నగా బియ్యం గింజలపై ప్రదర్శించిన కళను ఆధారంగా చేసుకుని పెన్సిల్‌ లెడ్‌పై అక్షరాలు చెక్కుతుంది. అందర్నీ తన కళతో ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది మహిత. భగవద్గీత మొత్తాన్ని చదివి 700 సంస్కృత శ్లోకాలను పెన్సిల్ లెడ్‌పై చెక్కినట్టు చెప్తోంది. ఇలా చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అంటుంది మహిత. ప్రజల కోసం పనిచేసిన గొప్పవారి జీవిత చరిత్రల్ని తన కళ ద్వారా ఆవిష్కరించడం ఇష్టమంటుంది ఈ యువతి. అందుకే తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత సీఎంల జీవితాలు తన సూక్ష్మకళలో ఆవిష్కరించినట్లు చెబుతోంది. త్వరలో మరింత మంది మేధావుల జీవితాల్ని పెన్సిల్‌ పై చెక్కనున్నట్లు మహిత తెలిపింది.

పెన్సిల్‌ పై మహిత చెక్కే అక్షరాలు అచ్చం ప్రింటింగ్‌ చేసేటప్పుడు వచ్చే అక్షరాల్లా ఉన్నాయి. అంత అందంగా చెక్కడానికి చాలా రోజుల కృషి కారణమంటుంది ఈ యువతి. తనకు ఉన్న ఈ ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారంటుంది. వారి వల్లే తనకు గుర్తింపు లభించిందని చెబుతోంది మహిత. తమ అమ్మాయి భగవద్గీత మొత్తం శ్లోకాలు చెక్కినప్పుడు చాలా సంతోషం అనిపించిందని చెబుతున్నారు నర్సింహారావు. పిల్లల్లో ఉన్న ఆలోచనలను గుర్తించి వాటిని ప్రోత్సహించడం తల్లిదండ్రులుగా తమ బాధ్యత అని అంటున్నారు. పిల్లల ఆనందం కోసం ఎంత కష్టపడ్డా ఇష్టంగానే ఉంటుందంటున్నారు నర్సింగరావు.

గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్వహించిన పోటీలకూ తాను తయారు చేసినవి పంపించింది మహిత. ఆ పోటీల్లో నెగ్గడంతో ఎంతో విశ్వాసం కలిగిందంటుంది ఈ యువతి. మహితకు వస్తున్న పేరు చూసి వారి బంధువులు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పడే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోందని తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మరింత ప్రోత్సాహం అందిస్తే మరిన్ని కళాఖండాలు సృష్టించగలనని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది మహిత. ప్రతి మనిషిలో ఒక సహజ కళ ఉంటుంది. దానిని గుర్తించి సాన పెట్టడం ద్వారా కచ్చితంగా ప్రత్యేక గుర్తింపు పొందవచ్చు అని చెబుతోంది మహిత.

"కరోనా టైమ్​లో నాకు మైక్రో ఆర్ట్స్​పై ఇంట్రెస్ట్ వచ్చి.. నా పేరు, ఇంట్లో వాళ్ల పేర్లు అలా చెక్కుతూ ఉండేదాన్ని. తరువాత అలా ఆశక్తి వచ్చి భగవద్గీత 700 శ్లోకాలు చెక్కాను. భగవద్గీత చేయడం చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా చాలా మంది జీవిత చరిత్రలను పెన్సిల్ లెడ్​పై చెక్కాను". - అన్నం మహిత, సూక్ష్మ కళాకారిణి

"మా అమ్మాయి కరోనా టైమ్​లో ఖాళీగా ఉన్న ఉందని స్టార్ట్ చేసింది. మీరందరూ ప్రోత్సహిస్తే మా అమ్మాయి ఇంకా మంచిగా చేయాలనుకుంటుంది". - భ్రమరాంబ, మహిత తల్లి


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.