ETV Bharat / state

అక్కడ విద్యాబుద్ధులతో పాటు మరెన్నో.. క్యూ కడుతున్న తల్లిదండ్రులు

author img

By

Published : Oct 25, 2022, 5:21 PM IST

Scouts and Guides program Kendriya Vidyalaya: ఆ ప్రాంతంలో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించే విద్యాసంస్థలు చాలనే ఉన్నాయి. అయితే కేవలం విద్యా విలువలు నేర్పడమే కాదు.. జీవిత పాఠాలు సైతం నేర్పుతారు. అందుకోసమే ఆ విద్యాలయంలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడతారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి 3వ తరగతిలో చేరిన నాటి నుంచి 12వ తరగతి వరకు.. స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కార్యక్రమాల అమలుపై.. ఈ టీవీ భారత్ ప్రత్యేక కథనం.

Vijayawada Kendriya Vidyalaya
కేంద్రీయ విద్యాలయం

సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం

Vijayawada Kendriya Vidyalaya: ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, అత్యాధునిక సదుపాయాలు, విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణకు మారుపేరు ఆ విద్యాలయం. వ్యక్తిత్వంతో పాటు.. మానవీయ విలువలను బోధిస్తూ... ఉన్నతంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఆ విద్యాసంస్థ ప్రత్యేకత. విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం విశేషాలపై కథనం.

స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కార్యక్రమాలు: అత్యున్నత విద్యావిధానాలు పాటిస్తూ.. మెరుగైన ఫలితాలతో ముందడుగు వేస్తోంది విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం. ఇక్కడ చేరిన విద్యార్థులకు తొలి రోజు నుంచే ప్రత్యేక పాఠ్యప్రణాళికను ప్రారంభిస్తారు. కేవలం చదువు నేర్పడమే కాకుండా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతారు. మూడో తరగగతి నుంచి ప్లస్‌ టూ వరకు.. ప్రత్యేకంగా రూపొందించిన బోధనేతర కార్యక్రమాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు. క్రమశిక్షణ, దేశభక్తి భావనను పెంపొందిపజేస్తున్నారు. భారత్‌ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా, ఎలాంటి అత్యవసర, విపత్కర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తున్నారు.

సమాజంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను వివరించి వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో.. విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు ప్రథమ చికిత్స అందించాల్సిన విధానాన్ని.. వైద్యులతో వివరింపజేస్తున్నారు. ఈ కార్యక్రమాలతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. విద్యార్థినులు చెబుతున్నారు.

విద్యార్థి 3వ తరగతిలో చేరిన నాటి నుంచి 12వ తరగతి వరకు.. స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కార్యక్రమాలను తప్పనిసరిగా అమలు చేస్తున్నామని.. అధ్యాపకులు చెబుతున్నారు. వీటిలో మంచి ప్రతిభ చూపేవారికి ఏటా రాష్ట్రపతి పురస్కారాలు దక్కుతాయని తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో శిక్షణ పొందినవారు.. ఎంతోమంది ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారని, అధ్యాపకులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.