ETV Bharat / state

Sanitation Workers Problems: అరకొర వేతనాలు.. పట్టించుకోని సర్కార్​.. దుర్భరంగా పారిశుద్ధ్య కార్మికుల జీవితం

author img

By

Published : Aug 3, 2023, 8:45 PM IST

Sanitation Workers Problems: రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అరకొర వేతనాలతో వారు అవస్థలు పడుతుంటే.. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ.. ప్రభుత్వం ఆర్థికంగా మరింత కుంగదీస్తోందని కార్మికులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒప్పంద, పొరుగు సేవల కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం జగన్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. కనీస వేతనాలు అందించి తమకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు
Sanitation Workers Problems In Ap

అరకొర వేతనాలు.. పట్టించుకోని సర్కార్​.. దుర్భరంగా పారిశుద్ధ్య కార్మికుల జీవితం

Sanitation Workers Problems In Ap: రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. సామాజిక భద్రతలేని పనుల్లో అరకొర వేతనాలతో వారు అవస్థలు పడుతుంటే.. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ.. ప్రభుత్వం ఆర్థికంగా మరింత కుంగదీస్తోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లోని భూగర్భ డ్రైనేజీల్లో చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్ధలో ఏ సమస్య వచ్చినా.. వారి ప్రాణాలకు తెగించి మరి పారిశుద్ధ్యం కోసం కార్మికులు పని చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీల్లో పనిచేసే క్రమంలో వచ్చే విషవాయువుల తీవ్రతను తట్టుకోలేక, ఆక్సిజన్ అందక అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

గత నెల 15న విజయవాడలోని ఓ భూగర్భ డ్రైనేజీలో పనిచేస్తూ మేడా మాణిక్యాలరావు అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు విషవాయువుల తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పొయారు. గతంలోనూ ఓ ముగ్గురు కార్మికులు ఇలాగే మృతి చెందారు. యంత్రాల సహాయంతో చేయాల్సిన పనులను సైతం పారిశుద్ధ్య కార్మికులతో చేయించడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పనులు తమతో చేయిస్తూ కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వారు మండిపడుతున్నారు.

Seasonal diseases: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం..

విజయవాడ నగరపాలక సంస్థకు పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నా.. కార్మికుల సామాజిక భద్రతను సంబంధిత అధికారులు విస్మరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం ఆప్కాస్ విధానం తీసుకొచ్చినా దాని వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కార్మికులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నా.. వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం ఆ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. పెరిగిన ధరలతో.. అరకొర జీతాలతో జీవనం సాగించటం కష్టంగా మారిందంటున్నారు కార్మికులు.

ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లోను కోత విధిస్తోందని పారిశుద్ధ్య కార్మికులకు వాపోయారు. ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారికి కావాల్సిన పరికరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించడం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం కోసం పనిచేసే కార్మికులకు బీమా సదుపాయం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.లక్ష జీతం ఇచ్చినా తక్కువే అని అన్న సీఎం జగన్​.. తమకు ఏమి చేశారని వారు ప్రశ్నించారు. ఒప్పంద, పొరుగు సేవల కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం జగన్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. కనీస వేతనాలు అందించి తమకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.