ETV Bharat / state

New diaphragm wall at Polavaram: దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిద్దాం: కేంద్ర ప్రభుత్వం

author img

By

Published : Jul 5, 2023, 8:41 AM IST

central government decided to a new diaphragm wall in Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం విషయంలో కేంద్ర జల సంఘం ముందడుగులు వేయబోతోంది. దెబ్బతిన పాత డయాఫ్రం వాల్‌ను పడగొట్టి.. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించేందుకు చర్చోపచర్చలు జరుపుతోంది. పాక్షికంగా కట్టడం కంటే పూర్తిస్థాయిలో నూతన నిర్మాణాన్ని చేపట్టడమే మేలని అంచనా వేస్తోంది.

Polavaram
Polavaram

'దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిద్దాం'

central government decided to a new diaphragm wall in Polavaram: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరంలో దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్‌ను పడగొట్టి.. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించేందుకు కేంద్ర జలసంఘం ముందడుగులు వేయబోతోంది. పాక్షికంగా కట్టడం కంటే పూర్తిస్థాయిలో నూతన నిర్మాణాన్ని చేపట్టడమే మేలని అంచనా వేస్తోంది. సమయం, ఖర్చు ముఖ్యం కాదు.. నిర్మాణ భద్రతే ప్రధానమంటోంది. ప్రస్తుతం ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరుపుతోంది. అయితే, ఈ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై కేంద్ర జలసంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆ కోణంలో అధికారులు ఆలోచించవద్దు.. 2020 నాటి భారీ వరదలకు పోలవరం డయాఫ్రం వాల్‌ కొంతమేర దెబ్బతింది. దీనిపై అధ్యయనం చేసిన జాతీయ జల విద్యుత్తు పరిశోధన కేంద్రం.. పాత డి-వాల్‌ కొద్దిమేర మాత్రమే ధ్వంసమైనట్లు తేల్చింది. దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ ‘U’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించి, దాన్ని ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని.. జాతీయ జల విద్యుత్తు పరిశోధన కేంద్రం, పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ మార్చి నెలలో నిర్ణయించాయి. అయితే, ఇటీవల పోలవరం గైడ్‌బండ్‌ కుంగడంతో ఈ నిర్ణయంపై కేంద్ర జల్‌శక్తి శాఖలో మళ్లీ అంతర్గత చర్చ మొదలైంది. తాజాగా దేశ రాజధాని దిల్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రెండు సమావేశాలు జరిగాయి. ఆ రెండు సమావేశాల్లోనూ ఈ డయాఫ్రం వాల్‌ నిర్మాణంపై చర్చలు జరిగాయి. సమావేశాల్లో భాగంగా కొత్తగా పూర్తిస్థాయి డయాఫ్రం వాల్‌‌ను నిర్మిస్తే చాలా ఖర్చవుతుందని, ఎక్కువ సమయం అవసరమని అధికారులు చెప్పగా.. ఆ కోణంలో ఆలోచించవద్దని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి సూచించారు.

ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే కుదరదు.. అనంతరం అన్నింటికంటే డ్యాం భద్రతే ముఖ్యమని, ఆ దిశగానే ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని.. కేద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ స్పష్టం చేశారు. దీనిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే కుదరదని, సాంకేతికంగా ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర జలసంఘానిదే తుది బాధ్యతని ఆయన తేల్చి చెప్పారు. డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ నిర్ణయం తీసుకున్నందున తమకు సంబంధం లేదనడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అథారిటీ కమిటి సభ్యులు కచ్చితంగా అన్నింటినీ సమన్వయం చేసుకునేలా బాధ్యత వహించాలని సూచనలు చేశారు. ఆదివారం దిల్లీలో నిర్వహించే సమావేశంలో కేంద్ర సంస్థలతో పాటు ఏపీ జల వనరుల శాఖ, మేఘా, బావర్‌ కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ (I.I.T), ఎన్‌హెచ్‌పీసీ (N.H.P.C) నిపుణులు పాల్గొనున్నారు. ఆదివారం రోజు జరగనున్న సమావేశంలో పోలవరం గైడ్‌బండ్‌ వైఫల్యంతోపాటు డి-వాల్‌ నిర్మాణంపై కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

నదీ గర్భం నుంచి డ్యాం నిర్మాణం.. మరోవైపు పోలవరంలో రాతి, మట్టితో గోదావరికి అడ్డంగా దాదాపు 2.5 కిలోమీటర్ల వరకూ డ్యాం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ డ్యాం నిర్మాణాన్ని నదీ గర్భం నుంచి కడుతూ రానున్నారు. నదీ గర్భంలో డ్యామ్‌ దిగువన నీటి ఊట చేరకుండా ఉండాలి. మరోవైపు దిగువన ఊరే నీటిని ఒకవైపు నుంచి వెళ్లకుండా చూసేదే ఈ డయాఫ్రం వాలే. గోదావరి గర్భంలో దిగువన ఎక్కడ రాయి ఉందో అక్కడి వరకు.. ‘బావర్‌’ అనే విదేశీ కంపెనీ ప్లాస్టిక్‌ కాంక్రీటుతో డయాఫ్రం వాల్‌ నిర్మించింది.

2018 నాటికి పూర్తియిన డయాఫ్రం వాల్‌ నిర్మాణం.. పోలవరం గ్యాప్‌-1లో 584.5 మీటర్ల మేర, గ్యాప్‌-2 లో 17వందల 50 మీటర్ల మేర.. ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మించాల్సి ఉంది. ఈ రెండింటి మధ్యలో 584.5 మీటర్ల వెడల్పున ఎత్తయిన జి.కొండ ఉంది. ఇటీవలే ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్‌-1 ప్రాంతంలో డయాఫ్రం వాల్‌ను అధికారులు 393 మీటర్ల మేర నిర్మించారు. వరదల తర్వాతే నిర్మాణం పూర్తయినందున దానికి నష్టమేమీ జరగలేదు. జి.కొండ తర్వాత కుడివైపు ఛానల్‌ 89 మీటర్ల నుంచి 14 వందల 85 మీటర్ల వరకు మొత్తం 13 వందల 96 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని 2018 నాటికే పూర్తి చేశారు. ఇది అక్కడక్కడా ధ్వంసమైందని N.H.P.C తేల్చింది.

భారీ వరదలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్న డయాఫ్రం వాల్.. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ వైపు ప్రధాన డ్యాం నిర్మించే చోట భారీ వరదలకు పెద్ద ఎత్తున కోత ఏర్పడింది. డయాఫ్రం వాల్‌ కూడా 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకు ధ్వంసమైంది. రెండో గ్యాప్‌లో 480 నుంచి 510 మీటర్ల మధ్య మరో 30 మీటర్ల మేర దెబ్బతింది. ఇంకొవైపు 2వ గ్యాప్‌లోనే ఛానల్‌ 950 మీటర్ల నుంచి వెయ్యి 20 మీటర్ల వరకు దాదాపు 70 మీటర్ల మేర దెబ్బతింది. కుడివైపున కూడా 200 మీటర్లు ధ్వంసమైంది. ఎడమ, కుడి వైపున భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో అటూఇటూ కలిపి దాదాపు 385 మీటర్ల మేర, మధ్యలో మరో 100 మీటర్ల మేర దెబ్బతింది.

దెబ్బతిన్నదంతా సరిదిద్దుకోవాలి.. ఇది కాకుండా గ్యాప్‌-2 డయాఫ్రం వాల్‌లోనే 363 మీటర్ల ఛానల్‌ నుంచి వెయ్యి 35 మీటర్ల వరకు దాదాపు 672 మీటర్ల మేర పైభాగంలో 5 మీటర్ల మేర దెబ్బతింది. దీంతోపాటు 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని, దెబ్బతిన్నదంతా సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఈ పరీక్షల్లో తేలింది. దీంతో దెబ్బతిన్నంతవరకూ ఎక్కడికక్కడ చిన్న చిన్నగా ‘U’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించాలని అధికారులు మార్చి నెలలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ చిన్న డి-వాల్‌ను ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని అప్పట్లో భావించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.