డయాఫ్రంవాల్‌ నిర్మాణంపై స్పష్టత..కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణం అవసరం లేదన్న మంత్రి అంబటి

author img

By

Published : Mar 6, 2023, 7:05 AM IST

Updated : Mar 6, 2023, 10:43 AM IST

కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణం అవసరం లేదన్న మంత్రి అంబటి

New Diaphragm Is Not Required : పోలవరం ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న చోట మాత్రమే తిరిగి నిర్మాణం చేపట్టనున్నారు. దెబ్బతిన్న చోట యు(U) ఆకారంలో కొత్తది నిర్మించి పాత దానితో అనుసంధానించనున్నారు. ధ్వంసమైన 4 చోట్ల 485 మీటర్ల మేర దెబ్బతిన్న ప్రాంతంలో మాత్రమే పునర్మించనున్నారు. అలాగే పైభాగంలో దెబ్బతిన్న 672 మీటర్ల ప్రాంతంలోనే మరమ్మతులు చేయనున్నారు.

New Diaphragm Is Not Required : పోలవరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న కీలకమైన డయాఫ్రంవాల్‌ నిర్మాణంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. భారీ వరదలతో దెబ్బతిన్న చోట ఎక్కడికక్కడ చిన్నచిన్నగా యు(U) ఆకారంలో సమాంతర డయాఫ్రంవాల్‌ నిర్మించాలని నిర్ణయించారు. వాటిని ప్రస్తుతం ఉన్న డయాఫ్రంవాల్‌తో అనుసంధానించాలని ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. మొత్తం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిన అవసరం లేదని జలసంఘం నిపుణులు తేల్చిచెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ స్థానంలో కొత్తది నిర్మించాలన్న ప్రతిపాదనలు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం పెద్ద ఊరటే. జాతీయ జల విద్యుత్ పరిశోధనస్థానం నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో డయాఫ్రంవాల్‌ రెండో గ్యాప్‌లో 485 మీటర్ల మేర ధ్వంసమైనట్లు తేలింది. కుడి, ఎడమ వైపున భారీ వరదలకు కోతపడిన ప్రాంతంలో 385 మీటర్లు, మద్యంలో మరో 100 మీటర్లు దెబ్బతిన్నట్లు నిపుణుల బృందం తెలిపింది. దీంతో పాటు 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని.. అదంతా సరిదిద్దుకోవాల్సి ఉంటుందని వివరించారు.

పైన దెబ్బతిన్న ప్రాంతంలో ఎక్కడికక్కడ సమాంతరంగా మూడు మీటర్ల ఎగువన యు(U) ఆకారంలో కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మిస్తారు . ఈ ప్రాంతంలో దిగువన రాయి తగిలే వరకు వెళ్లి అక్కడి నుంచే దీన్ని నిర్మించుకుంటూ వస్తారు. డయాఫ్రంవాల్​పై భాగంలో దాదాపు 672 మీటర్లు, ఐదు మీటర్ల లోతున దెబ్బతిన్న దానికి మరోక పరిష్కారం చూపారు. ప్రధాన డ్యాం నిర్మించే సమయంలో క్లే కోర్‌ బదులు అక్కడ ప్లాస్టిక్‌ కోర్‌ వేసి సరిదిద్దవచ్చని చెప్పారు. ఇందుకు తగ్గ మెథడాలజీ, డిజైన్లు సిద్ధం చేసి కేంద్ర జల సంఘానికి సమర్పించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్‌-1 ప్రాంతంలో డయాఫ్రంవాల్‌ను ఈ మధ్యనే 393 మీటర్ల మేర కట్టించారు. వరదల తర్వాతే ఆ నిర్మాణం పూర్తయినందున దానికి నష్టమేమీ జరగలేదు. జీ.కొండ తరువాత కుడి వైపు ఛానల్‌ 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు మొత్తం 1,396 మీటర్ల మేర డయాఫ్రంవాల్‌ నిర్మాణాన్ని 2018 లో పూర్తి చేశారు. ఇది అక్కడక్కడ ధ్వంసమైందని తేల్చారు.

ప్రధాన డ్యాం నిర్మించే చోట భారీ వరదలకు పెద్దఎత్తున కోత ఏర్పడింది. అక్కడ డయాఫ్రం వాల్‌ 175 మీటర్ల నుంచి 360 మీటర్ల మధ్య అంటే సుమారు 185 మీటర్ల మేర ధ్వంసమైంది. రెండో గ్యాప్‌లో 480 నుంచి 510 మీటర్ల మధ్య మరో 30 మీటర్లు దెబ్బతింది. 950 మీటర్ల నుంచి 1020 మీటర్ల మధ్య దాదాపు 70 మీటర్ల మేర డయాఫ్రంవాల్‌ ధ్వంసమైంది. కుడివైపున కూడా పెద్దఎత్తున గోదావరి గర్భం కోతకు గురికావడంతో అక్కడ 200 మీటర్ల వరకు డయాఫ్రంవాల్‌ ధ్వంసమైనట్లు నిపుణులు తేల్చారు. మొత్తం 485 మీటర్ల మేర డయాఫ్రంవాల్‌ దెబ్బతిన్నట్లు జాతీయ జలవిద్యుత్ పరిశోధనస్థానం తేల్చింది. దీంతో పాటు గ్యాప్‌-2 డయాఫ్రంవాల్‌లోనే 363 మీటర్ల ఛానల్‌ నుంచి 1,035 మీటర్ల వరకు దాదాపు 672 మీటర్ల మేర పైభాగంలో 5 మీటర్ల లోతున డయాఫ్రంవాల్‌ దెబ్బతింది.

పోలవరం ప్రాజెక్టుకు మరో డయాఫ్రంవాల్‌ నిర్మించాల్సిన అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మరమ్మతులు నిర్వహిస్తే సరిపోతుందన్నారు. దెబ్బతిన్న చోట మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో లెక్కించాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. దెబ్బతిన్న చోట చాలా పెద్ద పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయని వీటిని శాస్త్రీయంగా ఇసుకతో వైబ్రోకంపాషన్‌ చేసేందుకు 48 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక కావాలన్న మంత్రి అంబటి ఇప్పటికే 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సేకరించామన్నారు. ఈ ఐదు నెలలు ప్రాజెక్టు నిర్మాణానికి కీలకంగా భావిస్తున్నామని వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల ఈ సీజన్‌లో ప్రాజెక్టు పూర్తికాకపోవచ్చని తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరరకు 3వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రం 1800 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు ఖర్చయ్యే 2 వేల కోట్ల రూపాయలు కేంద్రమే ఇవ్వాలని మంత్రి అంబటి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాఫర్‌ డ్యాంలు నిర్మించకుండానే డయాఫ్రంవాల్‌ నిర్మాణం చేపట్టడం వల్లే వరదలకు దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

డయాఫ్రంవాల్‌ నిర్మాణంపై స్పష్టతిచ్చిన అధికారులు..

ఇవీ చదవండి

Last Updated :Mar 6, 2023, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.