ETV Bharat / state

Polavaram Project: పోలవరంలో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా నాలుగో టెండరు

author img

By

Published : May 11, 2023, 7:09 AM IST

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో మరో 16వందల 26 కోట్ల విలువైన పనులు కూడా.. మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకే దక్కాయి. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో పడ్డ అగాథాలను పూడ్చడం, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుక సాంద్రత పెంచడంతో పాటు.. అవసరమైన మేర డయాఫ్రం వాల్‌ నిర్మించి, పాతదానితో అనుసంధానించేందుకు టెండర్లు పిలిచారు. పోలవరం ప్రాజెక్టులో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా ఇది నాలుగో టెండరు కాగా.. అన్నింటిలోనూ పోటీ నామమాత్రమే కావడం గమనార్హం. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4వేల 623 కోట్ల పనులను మేఘాకు అప్పగించింది.

Polavaram Project
పోలవరం ప్రాజెక్టు

Polavaram Project: పోలవరంలో మేఘా ఇంజినీరింగ్‌కు వరుసగా నాలుగో టెండరు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 16వందల 26.48 కోట్ల విలువైన అదనపు పనులకు.. రాజమహేంద్రవరంలోని పోలవరం కార్యాలయంలో రివర్స్‌ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం పని విలువ కంటే ఒక శాతం తక్కువకే చేస్తామంటూ మేఘా సంస్థ ఈ టెండరును దక్కించుకుంది. ఆ సంస్థతోపాటు రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ మాత్రమే పోటీపడగా.. లాంఛనప్రాయ టెండర్ల ప్రక్రియలో మేఘాదే పైచేయి అయింది.

పోలవరం ప్రాజెక్టులో ఏ పనికి టెండరు పిలిచినా మేఘాతోపాటు నామమాత్రంగా మరో సంస్థ మాత్రమే బిడ్లు వేస్తుండటం, ఏ మాత్రం పోటీ లేకుండా మేఘానే వాటిని దక్కించుకోవడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంలో ఇంతవరకు 4వేల 623 కోట్ల పనులు ఈ సంస్థకే దక్కాయి. ఇందులో 3వేల కోట్లకు పైగా విలువైన అదనపు పనులూ ఉన్నాయి.

పోలవరం ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో పడ్డ అగాథాలను ఇసుకతో పూడ్చడం, వైబ్రో కాంపాక్షన్‌తో ఇసుక సాంద్రత పెంచడం వంటి పనులతోపాటు.. డయాఫ్రం వాల్‌ అవసరమైన మేర నిర్మించి పాతదానితో అనుసంధానించే పనులు చేపట్టేందుకు ఈ టెండర్లు పిలిచారు. ముందుగా బిడ్లు తెరిచి, ఇద్దరు పోటీదారులు ఎంత ధరకు కోట్‌ చేశారో పరిశీలించారు. పని విలువపై 8 శాతం ఎక్కువకి చేసేందుకు వచ్చిన బిడ్‌ను.. ఆ రెండింటిలో తక్కువదిగా గుర్తించారు.

ఈ ధరపై మళ్లీ రివర్స్‌ టెండర్ల ప్రక్రియ నిర్వహించగా.. రెండు గుత్తేదారు సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. పని విలువపై ఒక శాతం తక్కువకే చేస్తామని తెలుపుతూ మేఘా సంస్థ ముందుకొచ్చింది. అదే తక్కువ ధర కావడంతో పనులు అప్పగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కమిటీకి ఈ నివేదిక పంపి, ఆమోదం పొందిన తర్వాత ఒప్పందం కుదుర్చుకుంటారు.

రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలవరంలో అప్పటి వరకు పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థను తొలగించింది. ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న 17వందల 71.44 కోట్ల పనికి టెండర్లు పిలిచింది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ నిర్వహించి గతంలో కంటే తక్కువ మొత్తానికే పోలవరం ప్రధాన డ్యాం పనులు పూర్తి చేస్తామని పేర్కొంది. ఆ టెండర్లలో మేఘా మాత్రమే బిడ్‌ దాఖలు చేసింది. పని విలువ కంటే తక్కువగా 15వందల 48 కోట్లకే పూర్తి చేస్తామని టెండరు దక్కించుకుంది.

ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఆ మొత్తంతోనే పోలవరం పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఆ తర్వాత 683 కోట్ల విలువైన అదనపు పనులకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లలో మేఘా సంస్థతోపాటు.. మరో సంస్థ మాత్రమే బిడ్‌ వేయడంతో.. పోటీ నామమాత్రంగా మారింది. ఈ పనులను ఒప్పంద విలువ కంటే 2 శాతం తక్కువకే చేస్తామంటూ మేఘా సొంతం చేసుకుంది. అనంతరం పోలవరంలో ప్రధాన డ్యాం నుంచి నీటిని ఎత్తిపోస్తామంటూ 776.94 కోట్ల రూపాయలతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

ఇక్కడా నామమాత్రపు పోటీనే. పని విలువ కంటే కేవలం 0.1308% తక్కువకు 765.94 కోట్లతో ఈ పనులూ మేఘాకే దక్కాయి. ప్రస్తుతం పోలవరంలో డయాఫ్రం వాల్‌ మరమ్మతులతో పాటు కొత్తగా కొంత నిర్మాణం, ఇతర పనులకు 16వందల 26 కోట్లకు టెండర్లు పిలిస్తే.. వాటినీ నామమాత్రపు పోటీతో మేఘా సంస్థే చేజిక్కుంచుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.