ETV Bharat / state

డబ్బులు కట్టించుకున్నారు సరే.. లైసెన్స్​లు ఎక్కడ..!

author img

By

Published : Apr 11, 2023, 10:00 AM IST

ARSK Centers In AP : రైతు సేవా కేంద్రాల పేరుతో నిరుద్యోగ పట్టభద్రులకు ఆగ్రోస్‌ కుచ్చుటోపీ పెట్టింది. దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు సంస్థ సందేశాలు పంపించింది. వ్యాపార నిర్వహణ కోసం ఒక్కొక్కరి నుంచి లక్షా పది వేల రూపాయలు డీడీలు కట్టించుకుంది. డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా నియామకాలు చేపట్టడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా కేంద్రాల పేరుతో భద్రత సంగతి దేవుడెరుగు.. కనీసం తమ డబ్బులైనా తమకు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆగ్రోస్​ నిరుద్యోగ మోసం
ఆగ్రోస్​ నిరుద్యోగ మోసం

ఆగ్రో రైతు సేవా కేంద్రాల పేరుతో సంస్థ మోసం చేసిందని నిరుద్యోగుల ఆరోపణ

Agros Delay in Rythu Seva Kendra : గతేడాది నవంబర్ 25వ తేదీన ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు.. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ప్రకటన జారీ చేసింది. ప్రతి మండలంలో ఒక ఏఆర్​ఎస్​కే కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది అభ్యర్థులు.. తొలి విడతగా దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందులో 150 మంది అభ్యర్థులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు అర్హత పొందారు. రెండో విడత నిర్వహించిన ఇంటర్వ్యూకు సుమారు 100 మంది హాజరుకాగా.. అందులో 75 మంది అర్హత సాధించారు. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షా పది వేల రూపాయల చొప్పున డీడీలు వసూలు చేశారు. మార్చి మొదటి వారంలోగా లైసెన్సు పత్రాలు అందిస్తామని చెప్పినా.. ఇంతవరకు అనుమతి పత్రాలు ఇవ్వలేదని అభ్యర్థులు వాపోతున్నారు.

"మా ద్వారానే ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేస్తామని అంటే.. మా ఏఆర్​ఎస్​కే వాళ్లము లక్ష పదివేల రూపాయలు చెల్లించినాము. నగదు చెల్లించి నెలలు గడుస్తోంది. ఎంతసేపు.. మాతో స్పేయర్లు. పట్టాల లాంటివి మాత్రమే మాతో అమ్మిస్తున్నారు. ఎరువులు అందించటం లేదు." -వీరనారాయణరెడ్డి, బద్వేలు

"ఈ పక్రియ నవంబర్​ నెలలో ప్రారంభమైంది. నెలన్నర రోజుల తర్వాత సీజన్​ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆగ్రో సంస్థ పక్రియ ఎలా సాగుతోందో మాకు తెలియదు. మాకు ఎరువులు, పురుగుమందులు, యాంత్రీకరణ లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా మాకు తెలియదు." -సాదక్‌పీరా, తాడిపత్రి

ఆగ్రోస్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని.. నిరుగ్యోగుల్ని నిండా ముంచిందని ఏపీ ఆగ్రోస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సంఘం అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నాణ్యతలేని ఓ కంపెనీ స్ప్రేయర్లు, ప్రమాణాలకు విరుద్ధంగా త్రీ-లేయర్ టార్పాలిన్ పట్టలను తమ ద్వారా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. అలా చేస్తేనే ఏఆర్​ఎస్​కే లైసెన్స్‌లు ఇస్తామని చెప్పడంతో.. తాము ఆలోచనలో పడ్డామన్నారు. కమీషన్ కోసం నాసిరకం వ్యవసాయ పరికరాలు విక్రయించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారని మపిరొంగపు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆగ్రోస్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆగ్రోస్‌లో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

"మేము వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవటం లేదు. వీరు నిరుద్యోగులు.. వీరీ దగ్గర నగదు తీసుకున్నాం.. వీరికి వ్యాపారం చేసుకోవటానికి అనుమతులు కాకాపోయినా కనీసం వీరి నగదు తిరిగి ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు." -చెన్నకృష్ణారెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఆగ్రోస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సంఘం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.