ETV Bharat / state

భార్య, కుమార్తె మిస్సింగ్​.. పోలీసులు పట్టించుకోవడం లేదని సీఎం క్యాంప్​ ఆఫీసుకు

author img

By

Published : Apr 11, 2023, 8:04 AM IST

Updated : Apr 11, 2023, 9:37 AM IST

Wife And Daughter Missing: గుంటూరు, విజయవాడ, తెనాలి మధ్య.. ఓ వ్యక్తి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. తన సమస్యను పట్టించుకోమంటూ అధికారులను ప్రాధేయపడున్నాడు. అటు రైల్వే పోలీసులు, ఇటు స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో.. నరకయాతన అనుభవిస్తున్నాడు. పాకాల నుంచి గుంటూరుకు రైల్లో బయలుదేరిన భార్య, కుమార్తె ఆచూకీ లేదంటూ.. వారి ఫొటోలతో రోడ్డున పడ్డాడు.

missing case
Wife And Daughter Missing

భార్య, కుమార్తె కోసం వారం రోజులుగా ఓ వ్యక్తి వెదుకులాట

Wife And Daughter Missing Case : వారం రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లిన తన భార్య.. ఆమెతో పాటు వెళ్లిన కుమార్తె కనిపించటం లేదని తూర్పుగోదావరి జిల్లా వాసి ఆందోళన చెందుతున్నాడు. ప్రతి నెలా ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకోవటం వారికి సాధారణమేనని.. కానీ, ఈ సారి ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగి రాలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు.

అసలేం జరిగిందంటే : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన ఆవలకొండ కిషోర్‌చంద్రారెడ్డి.. తన భార్య, కుమార్తె ఆచూకీ కోసం వారం రోజులుగా గాలిస్తున్నాడు. వారి ఫొటోలు పట్టుకుని.. గుంటూరు, విజయవాడ, తెనాలి మధ్య కనిపించిన వారందరినీ అడుగుతూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. భార్య శ్రావణి, పదేళ్ల పాపతో కలిసి కిషోర్ చంద్రారెడ్డి జంగారెడ్డిగూడెంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసేవాళ్లు. వారి ఇంటి సమీపంలోనే ఉండే కిరాణా వ్యాపారి శివయ్య.. ఏడాది కిందట వీరి కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో ఆ వ్యాపారిపై పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత వ్యాపారి నుంచి బెదిరింపులు పెరగడంతో.. జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతి జిల్లా పాకాలకు వెళ్లిపోయారు. అక్కడ కోళ్లఫారంలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అనారోగ్య కారణాలతో తన భార్య ప్రతి నెలా జంగారెడ్డిగూడెంలోని ఆసుపత్రికి వెళ్తుండేదని.. ఈ క్రమంలో కొందరు తమను బెదిరించేవారని కిషోర్ చెబుతున్నాడు. అలా బెదిరిస్తున్న తరుణంలో ఈసారి రైల్లో గుంటూరుకు వెళ్లిన భార్య, కుమార్తె.. కనిపించకుండా పోయారని వాపోతున్నాడు.

"పాకాల నుంచి ఈ నెల మూడో తేదీన సాయంత్రం బయలుదేరింది. అప్పటి నుంచి కనిపించటం లేదు. రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్తే.. స్థానిక పోలీస్​ స్టేషన్​కి వెళ్లమంటున్నారు. అక్కడికి వెళ్తే మళ్లీ రైల్వే పోలీసుల దగ్గరికే వెళ్లమంటున్నారు. ఇంతవరకు నా భార్య, కూతురు ఎక్కడా కనిపించటం లేదు. కనిపించకుండా పోవటానికి నేను గతంలో కేసు పెట్టిన వారిపై అనుమానంగా ఉంది." -కిషోర్‌చంద్రారెడ్డి, బాధితుడు

భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు పెట్టడానికి వెళ్తే.. రైల్వే పోలీసులు తమ పరిధి కాదన్నారని కిషోర్​చంద్రారెడ్డి అన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పారని.. అక్కడి వెళితే వారు కూడా కేసు తీసుకోలేదని కిషోర్ వాపోయాడు. దిక్కుతోచని స్థితిలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి వినతిపత్రం ఇచ్చినట్లు వివరించాడు.

ఇవీ చదవండి :

Last Updated :Apr 11, 2023, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.