Protest in Nandyala CM Jagan Meeting సీఎం సభ వద్ద భారీగా గుట్కా,మద్యం స్వాధీనం..! నిరసనలతో అలజడి రేపిన సీపీఐ,బిజేపీ కార్యకర్తలు..!

Protest in Nandyala CM Jagan Meeting సీఎం సభ వద్ద భారీగా గుట్కా,మద్యం స్వాధీనం..! నిరసనలతో అలజడి రేపిన సీపీఐ,బిజేపీ కార్యకర్తలు..!
Protest in CM Jagan Sabha: సీఎం జగన్ సభలో నిరసన వెల్లువెత్తింది. సీఎం పర్యటన సందర్భంగా.. డోన్ లో బీజేపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మద్యం ఏరులై పారింది. పోలీసుల తనిఖీల్లో కర్ణాటక మద్యం, గుట్కాలు భారీగా స్వాధీనం చేసుకున్నారు.
Protest in CM Jagan Sabha: నల్ల దుస్తులు ధరిస్తే అనుమతించకపోవడం, హ్యాండ్ బ్యాగులతో మహిళలు వెళ్లకుండా అడ్డుకోవడం సీఎం జగన్ సభలో సర్వసాధారణం. కాగా, ముఖ్యమంత్రి సభలో మద్యం ఏరులై పారింది. పోలీసుల తనిఖీల్లో కర్ణాటక మద్యం, టెట్రా ప్యాకెట్లు, గుట్కాలు వెలుగుచూడగా.. చాలా మంది మద్యం మత్తులో సభకు హాజరు కావడం కనిపించింది. మరో వైపు బీజేపీ, సీపీఐ నేతల అరెస్టులు కొనసాగాయి. సభ కొనసాగుతుండగానే జనం వెళ్లిపోవడం గమనార్హం.
కొనసాగిన అరెస్టుల పర్వం... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తుగా సీపీఐ, సీపీఎం నాయకులను సోమవారం రాత్రి అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచారు. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా డోన్ లో టీడీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం ఖాళీ చేయించారు. డోన్ నియోజకవర్గం కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ నాయకులు నిరసనగా తెలపటానికి ర్యాలీగా వస్తుండగా.. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో పనులు చేపట్టి... రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ఆర్భాటాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు నిరసన తెలపడానికి వస్తుండగా వారిని సైతం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
డోన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని... బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుండగా.. సీపీఐ నాయకులు డోన్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎకరాకు 30 వేల రూపాయలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ బహిరంగ సభకు దాదాపు 500 ఆర్టీసీ బస్సులు, 200 ప్రైవేట్ స్కూల్ బస్సులను నడిపించారు. సభ కోసం పొదుపు మహిళలను, కార్యకర్తలను తరలించారు. బహిరంగ సభకు వచ్చిన వారికి కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, క్వార్టర్లు మద్యం జోరుగా సరఫరా చేశారు.
సభ మధ్యలోనే వెళ్లిపోయిన జనం.. బహిరంగ సభ బహిరంగ ప్రదేశంలో గుంపులు గుంపులుగా కూర్చుని మద్యం సేవించారు. సభకు వచ్చినవారు జేబులో కర్ణాటక మద్యం, టెట్రా ప్యాకెట్లు, గుట్కాలు పెట్టుకుని లోపలికి వెళ్తుండగా పోలీసులు చెక్ చేసి అవన్నీ అక్కడే పడేశారు. ఒక వ్యక్తి మద్యం ఎక్కువై పడిపోయాడు. ఈరోజు ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభలోకి వెళ్లకుండా చాలా మంది మహిళలు చెట్టు కిందనే సేద దీరడం కనిపించింది. ముఖ్యమంత్రి ప్రసంగం కాకముందే కొందరు మహిళలు వెనుతిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా కొందరు మహిళలు, పురుషులు బారికేడ్లు దూరి వెళ్లిపోవడం కనిపించింది.
