ETV Bharat / state

YCP Leaders Land Kabza: పేదల ఇళ్ల స్థలాల్లో వైఎస్సార్​సీపీ నేతల రియల్ దందా.. పోరుబాటలో బాధితులు

author img

By

Published : Jul 19, 2023, 10:36 AM IST

Etv Bharat
Etv Bharat

YCP Leaders Land Kabza: పేదల స్థలంపై పెద్దల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఎంతో విలువైన జాగాలను ఆక్రమించుకోవాలని పథకం పన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయారు. నిర్భయంగా పట్టపగలే పేదల స్థలాల్లో లే అవుట్లు వేసి అమ్మకానికి పెట్టారు. మేలుకున్న బాధితులు పోరుబాట పట్టారు.

ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతల రియల్ దందా

YCP Leaders Land Kabza: కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఎరిగేరి గ్రామం ఇది. ఈ ఊరిలో.. నిరుపేదలే ఎక్కువ. తీవ్రమైన కరవు వల్ల ఏటా వలసలు వెళ్తుంటారు. వీరికి 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. దాదాపు 300 మందికి సర్వే నంబర్ 253లో 9 ఎకరాల 69 సెంట్ల భూమిని పంపిణీ చేసింది. ఇది ఆదోని పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో ఇప్పుడు దీనికి మంచి గిరాకీ వచ్చింది. ప్రస్తుతం ఎకరం ధర కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ఎంతో విలువైన ఈ స్థలంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. ఇంకేముంది ఆక్రమణకు గురైంది.

అధికారం చేతిలో ఉండటంతో మంత్రాలయం వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు.. ఈ స్థలాన్ని చదును చేసి ప్లాట్లు వేశారు. అంతేకాదు వాటిని విక్రయానికి పెట్టారు. విషయం తెలుసుకున్న లబ్దిదారులు.. ఆన్ లైన్‌లో రికార్డులు పరిశీలించారు. ఇందులో 300 మంది పేదల పేరుపైన స్థలాలు ఉండడంతో.. కర్నూలుకు చేరుకుని జాయింట్ కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. తమ స్థలాలను తమకు ఇప్పించాలని వేడుకున్నారు.

తెలుగుదేశం మంత్రాలయ నియోజకవర్గ ఇంఛార్జ్‌ తిక్కారెడ్డి.. కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మంత్రాలయం నుంచి మూడుసార్లు గెలిపించినా.. ఆయన తమకు ఏమీ చేయకపోగా.. ఉన్న స్థలాలను ఆక్రమించుకుంటున్నారని బాధితులు వాపోయారు. తమ స్థలం తమకు ఇచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

"మాకు సెంటు భూమి లేదు. ఉండటానికి స్థలం లేదు. నలుగురు కొడుకులు. అందరూ ఒకే చోట గుడిసెలో ఉంటున్నాం. 2006లో ఇంటి పట్టా ఇచ్చారు. ఇప్పటివరకు స్థలం చూపించలేదు. ఆదుకునే వారే ఆక్రమిస్తే ఎలా? పేదలకు అన్యాయం చేయొద్దు." - గవిగట్టు ఈరమ్మ

"దస్త్రాల్లో ఎక్కడ చూసినా ఇళ్ల స్థలమే (ప్రభుత్వ భూమి) అని చూపుతోంది. స్థలంలో చదును చేసేవారిని ఎందుకొచ్చారని అడిగితే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అమ్మగారు పంపించారు.. మేము ప్లాట్లు వేస్తున్నాం.. వాటిని అమ్మేస్తామని సమాధానం చెప్పారు." - రామలింగ,

"ల్యాండ్‌ సీలింగ్‌కు ముందు ఆ భూమి బి.రంగన్న గౌడు పేరుతో ఉంది. 1970లో సుమారు 50 ఎకరాల వరకు ల్యాండ్‌ సీలింగ్‌కు పోయినట్లు దస్త్రాల్లో నమోదైంది. ప్రస్తుతం అడంగల్‌లోనూ ఆ సర్వే నంబరుపై ఇళ్ల స్థలం అని చూపుతోంది. కలెక్టర్‌కు పూర్తి నివేదిక సమర్పిస్తాం." - రామేశ్వరరెడ్డి, ఉప తహసీల్దారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.