ETV Bharat / state

Nadu-Nedu: 'వైసీపీ ప్రభుత్వ ప్రచారాల కోసమే నాడు-నేడు'.. పాఠశాలలు ప్రారంభమైనా.. పూర్తికాని పనులు

author img

By

Published : Jun 21, 2023, 12:19 PM IST

Etv Bharat
Etv Bharat

Nadu Nedu works Not Completed: ప్రభుత్వ బడులను.. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తయారుచేస్తామని ప్రచారం చేశారు. నాడు-నేడు పథకం కింద గవర్నమెంట్ స్కూల్స్​ రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తామని సీఎం హామీల వర్షం కురిపించారు. కానీ.. ఇప్పటికీ నాడు-నేడు పనులను మాత్రం పూర్తిచెయ్యలేదు. ఎన్నో ఆశలతో బడి బాట పడుతున్న విద్యార్థులకు.. అసంపూర్తి పనులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

నత్తనడకన నాడునేడు పనులు

Nadu Nedu works Not Completed: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. కానీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు- నేడు పనుల్లో నెలకొన్న జాప్యం విద్యార్థులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం బడులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి.. రెండో దశ నాడు-నేడు పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ చాలా పాఠశాలల్లో పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆరుబయట వరండాల్లో విద్యను అభ్యసించాల్సిన దుస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 651 పాఠశాలలకు మరమ్మతు పనులు చేపట్టారు. వీటిలో 118 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయినట్లు ఆన్​లైన్​లో నమోదు చేశారు. 676 పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు చేపట్టగా.. 76 బడుల్లో మాత్రమే పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. 237 పాఠశాలల్లో మరుగుదొడ్లు, 174 పాఠశాలల్లో కిచెన్ షెడ్ల పనులు, 289 బడుల్లో తాగునీటి కల్పన పనులు నిర్మాణంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల కొరత వల్లే నాడు-నేడు పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నా.. అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేసి.. విద్యార్థుల చదువుకు ఆటంకాలు తలెత్తకుండా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

"కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో భాగంగా చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్​లో వేలాది కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్నారు. కానీ నేటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు లేవు. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు, నాడు-నేడు పనుల కింద పనిచేసే వైసీపీ ఏజెంట్లు అవినీతికి పాల్పడుతున్నారు. హాస్టల్స్​కు ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికి ఒక్క హాస్టల్ మరమ్మతులైనా ప్రారంభించలేదు. వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రభుత్వ పాఠశాలలకు సరైన మౌలిక వసతులను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము." - భాస్కర్, విద్యార్థి సంఘం నాయకుడు

"సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతామని చెప్పారు. ఈ క్రమంలో వేసవి సెలవుల సమయంలో పాఠశాలల నాడు-నేడు పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వం ప్రచారాల కోసమే నాడు-నేడు పనులు అంటోంది తప్ప.. గవర్నమెంట్ స్కూల్స్​ను బలోపేతం చేసే దిశగా ముందుకుసాగట్లేదు." - వెంకటేష్, విద్యార్థి సంఘం నాయకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.