ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు

ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు
Heavy Drought Condition in Old Kurnool District: రాష్ట్రంలో కరవు కోరలు చాస్తున్నా జగన్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. కరవు విలయతాండవంతో నష్టపోయామని ఉమ్మడి కర్నూలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్భిక్ష పరిస్థితులు తాళలేక రైతులు ఉన్న ఊళ్లను విడిచి వలసల బాట పడుతున్నారు. తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. కనీసం మూగజీవాలకు కూడా లభించడం లేదని వాపోతున్నారు.
Heavy Drought Condition in Old Kurnool District: కరవు కోరల్లో చిక్కుకుని కర్నూలు జిల్లా రైతులు అల్లాడుతుంటే.. అసలు కరవే లేదని ప్రభుత్వం ప్రకటించడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్భిక్ష పరిస్థితులు తాళలేక పుట్టిన ఊరు విడిచి రైతన్నలు వలసలు పోతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన సొంత ఇలాకాలో కరవు విలయతాండవం చేస్తున్నా.. కరవు జాబితాలో చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు కరవు విలయతాండవం చేస్తోంది. మరోవైపు ఉపాధి లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం కరవే లేదంటూ కప్పిపుచ్చే ధోరణిలో వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 మండలాలకుగాను 30 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 27 మండలాల్లో కరవు తీవ్రత అధికంగా ఉందని ప్రకటించింది.
కరవు జాబితాలో చేర్చాలని పోరాటం: కరవు కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న తుగ్గలి, కృష్ణగిరి, కర్నూలు గ్రామీణం సహా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ ప్రాంత రైతులు.. తమ మండలాలను కరవు జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నారు. దీనిపై మంత్రి ఇప్పటి వరకు ప్రకటన చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ఊళ్లు విడిచి వలసలు: కృష్ణగిరి మండలంలో కరవు పీడిస్తున్నా.. పాక్షికంగానే కరవు ఉన్నట్లు ప్రకటించింది. తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయి కరవు ప్రాంతంగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుగ్గలి మండలంలో కరవు నష్టాన్ని భరించలేక రైతులు ఊళ్లు విడిచి వలసలు పోతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
మంత్రి బుగ్గన ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్లోను కరవు: కర్నూలు గ్రామీణ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతన్నలు ఖరీఫ్, రబీ సీజన్లలో భారీగా నష్టాలు మూటగట్టుకున్నారు. అయిన ఆ ప్రాంతాల్ని కరవు మండలాలుగా సర్కార్ గుర్తించలేదు. మంత్రి బుగ్గన (Minister Buggana Rajendranath Reddy) ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్, ప్యాపిలి మండలాల్లోనూ కరవు కరాళ నృత్యం చేస్తోంది.
తాగునీరు లేక అల్లాడుతున్న మూగజీవులు : తాగునీరు సైతం దొరకక మూగజీవాలు అల్లాడుతున్నాయి. కొందరు రైతులు చేసేదేమి లేక వాటిని అమ్మేసుకుంటున్నారు. మరికొందరు నీరు లేకపోవడంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇవన్నీ కళ్లముందే కనిపిస్తున్నా.. అధికార పార్టీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 5 మండలాలను ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా గుర్తించి ఆదుకోవాలని.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.
