ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు కరవు విలయతాండవం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
TDP MP Ram Mohan Naidu on Drought Conditions in Srikakulam: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రాకముందే.. కరవు జిల్లాగా ప్రకటించాలని.. టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తితో కలిసి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఏపీలో కరవు విలయతాండవం చేస్తోందన్న ఎంపీ.. కరవుపై సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించడం లేదన్నారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు కరవు ఛాయలు అలుముకున్నాయని.. వర్షపాతం తక్కువ అని వాతావరణశాఖ ముందుగానే సూచించినా.. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కరవు ప్రాంతాలుగా 103 మండలాలను ప్రకటించిన ఈ ప్రభుత్వం.. రైతులను దగా చేస్తోందన్నారు. ఇరిగేషన్ మంత్రి.. ప్రజలకు ఇరిటేషన్ తెప్పించే మంత్రిగా పని చేస్తుండడంతో.. సాగునీటి వనరులను రైతులే బాగు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్రమంతా మంత్రులు బస్సు యాత్రలు చేస్తున్నారే తప్ప.. ఎక్కడా కరవు కోసం మాట్లాడే పాపానికి పోలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల నాయకులను అరెస్టు చేసేందుకే ప్రయత్నిస్తున్నారే తప్ప.. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేయ్యడం లేదని ఎంపీ విమర్శించారు.