ETV Bharat / state

అనుమతి లేకుండా 'గ్రీన్​ కో' తవ్వకాలు.. అడ్డుకున్న రైతులు

author img

By

Published : Apr 10, 2023, 1:11 PM IST

Updated : Apr 12, 2023, 9:51 AM IST

Greenko Energy Project
గ్రీన్​కోపై రైతుల ఆందోళన

Greenko Energy : ఉమ్మడి కర్నూలులో భారీ స్థాయిలో ఇంటిగ్రేటెడ్​ రిన్యూవబుల్​ ఎనర్జీ స్టోరేజ్​ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము నష్టపోతున్నామని.. దీన్ని ఏర్పాటు వల్ల తమ పంట పొలాల్లో అడ్డంకులు రాబోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

అనుమతి లేకుండా 'గ్రీన్​ కో' తవ్వకాలు.. అడ్డుకున్న రైతులు

Greenko Energy Project : అభివృద్ధి పేరిట పచ్చని పొలాలను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. భారీ టవర్లు ఏర్పాటు చేసేందుకు మార్కింగ్ చేస్తున్నారు. రైతుల అనుమతి తీసుకోకుండా కనీసం సమాచారమివ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అతి పెద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే గ్రీన్‌కో ప్రాజెక్టుతో అన్నదాతలకు ఎంతో నష్టం వాటిల్లుతోంది. రైతులకు కల్పించాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఊసే లేదు. టవర్లు వద్దు బాబోయ్ అంటూ రైతులు మొత్తుకుంటున్నా వినతులను బేఖాతరు చేస్తూ మొండిగా ముందుకెళ్తోంది.

రైతులకు సమాచారమివ్వకుండా : ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో 'గ్రీన్ కో' సంస్థ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి జగన్ గతేడాది మే 17న శంకుస్థాపన చేస్తూ అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఇందులో 5 వేల 410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఓర్వకల్లు సమీపంలోని గ్రిడ్‌కు అనుసంధానం చేయాలి. దీనికోసం గుమ్మితం తాండా, పిన్నాపురం పరిధిలో భూములు సేకరించారు. విద్యుత్ తీగలు వేసేందుకు తాండా నుంచి ఓర్వకల్లు వరకు టవర్లను నిర్మించాలి. అయితే వీటి కోసం రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కనీసం సమాచారం ఇవ్వకుండా పరిహారం మాట ఎత్తకుండా.. గ్రీన్ కో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. టవర్లు వేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. గ్రీన్‌కో దౌర్జన్యంపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చినా కనీసం స్పందించలేదన్నది రైతులంటున్నారు.

పొలాల్లో అడ్డంకులంటున్న రైతులు : ఈ ప్రాజెక్టుతో ఓర్వకల్లు మండలం కాల్వ, తిప్పాయిపల్లె, హుస్సేనాపురం, ఓర్వకల్లు, గుట్టపాడు, హెచ్​.కొట్టాలకు చెందిన సుమారు 200 మంది అన్నదాతలు నష్టపోతారు. టవర్లు రాకపోయినా ఒకవేళ పొలం మీదుగా విద్యుత్ తీగలు వెళ్లినా నష్టమే. సాగు చేసుకోవటానికి ఇబ్బందులే కాదు.. పొలాల ధరలు సైతం భారీగా తగ్గిపోయి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగల వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అభివృద్ధి అంటూ తమ జీవనాధారమైన పొలాల్లో అడ్డంకులు పెట్టొద్దంటూ రైతులు వేడుకుంటున్నారు. ప్రాణాలను అడ్డేసైనా సరే.. ఎట్టి పరిస్థితిల్లోనూ టవర్లకు అనుమతించబోమని తేల్చిచెబుతున్నారు.

"మా గ్రామ పొలిమేరల్లో గ్రీన్​కో సంస్థ వారు ఎటువంటి సమాచారం లేకుండా.. నేరుగా మా పొలాల్లోకి వచ్చి అనుమతులు లేకుండా టవర్ల ఏర్పాటు కోసం భారీగా గుంతలు తీస్తున్నారు. మా గ్రామ రైతులందరం టవర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వమని ఏకాభిప్రాయంతో వినతి పత్రాలు ఇచ్చాము." - రైతు, ఓర్వకల్లు

"రైతుల మీద దౌర్జన్యం చేస్తూ వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మాకు ఉన్న ఆధారం ఇది ఒక్కటే. దీనిని తక్కువ ధరకు మా దగ్గరి నుంచి తీసుకుంటే.. పిల్లల చదువులకు, పెళ్లిల్లకు మా దగ్గర ఆధారం లేకుండా అవుతుంది." - రైతు

ఇవీ చదవండి :

Last Updated :Apr 12, 2023, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.