ETV Bharat / state

ప్రైవేటు స్కూల్స్ ఫీజుల భారం తల్లిదండ్రుల పైనే.. విద్యాహక్కు చట్టంలో సవరణ

author img

By

Published : Apr 10, 2023, 8:03 AM IST

Government Does Not Pay Private Schools Fees: ఇకపై విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూల్స్​లో చేరే పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించదు. తల్లిదండ్రులే ఫీజులను చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధలనకే ప్రభుత్వం సవరణ తెచ్చింది.

The burden of private school fees is on the parents
ప్రైవేటు స్కూల్స్ ఫీజుల భారం తల్లిదండ్రుల పైనే

ప్రైవేటు స్కూల్స్ ఫీజుల భారం తల్లిదండ్రుల పైనే

Government Does Not Pay Private School Fees: విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. ప్రైవేటు స్కూల్స్​లో పేద విద్యార్థులకు ఈ చట్టం ద్వారా 25శాతం సీట్లు కేటాయించి, ప్రభుత్వమే ఆ ఫీజులను చెల్లించాలి. కానీ ఈ ఫీజుల చెల్లింపు నుంచి తప్పించుకునేందుకు విద్యా హక్కు చట్టం నిబంధనలకే రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నిధుల నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ తల్లిదండ్రులపైనే ఆ భారం నెట్టింది.

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు బడుల్లో చేరే పేదపిల్లల ఫీజులను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. తల్లిదండ్రులే ఆ ఫీజులు చెల్లించాలి. అందుకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం నిబంధనలకే ప్రభుత్వం సవరణ తెచ్చింది. విద్యాహక్కు చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేసింది. విద్యాహక్కు చట్టంలోని నిబంధన-10లోని సబ్‌ రూల్‌ 6 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున రెండు విడతల్లో ప్రభుత్వమే ఫీజులను చెల్లించాలి.

ఈ మేరకు పాఠశాలల ప్రత్యేక బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్రతి ఏటా సెప్టెంబరు నెలలో మొదటి విడతగా 50శాతం.. జనవరిలో మిగతా ఫీజును ఇవ్వాలి. ఈ నిబంధనకు సవరణ చేసిన ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే డబ్బుల నుంచి తల్లిదండ్రులు చెల్లించాలనే నిబంధన చేర్చింది. విద్యా సంవత్సరం ముగింపులో ఇచ్చే అమ్మఒడి నుంచే పాఠశాలలు ఫీజులను వసూలు చేసుకోవాలని పేర్కొంది. అమ్మఒడి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడిన 60 రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఫీజును చెల్లించి, ఆ తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని ప్రభుత్వం పేర్కొంది.

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్న రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ప్రైవేటు బడులకు చెల్లించాల్సిన ఫీజులను నిర్ణయించాయి. దాని ప్రకారం విడతలవారీగా చెల్లిస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అమ్మఒడి పథకం లేదని, రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందున ఈ పథకం నుంచే చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ప్రైవేటు బడులకు పట్టణాల్లో రూ. 8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6వేల 500, గిరిజన ప్రాంతాల్లో 5వేల 100 రూపాయల ఫీజులను నిర్ణయించారు. అమ్మఒడి కింద రూ.13వేలు ఇస్తున్నందున ఈ మొత్తం ఫీజు చెల్లించడం తల్లిదండ్రులకు భారం కాదని విద్యాశాఖ వాదిస్తోంది. ఇప్పటికే అమ్మఒడిలో రూ.15వేలకు బదులు.. పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.2వేలు మినహాయించి, 13వేల రూపాయలే ఇస్తోంది. అమ్మఒడి డబ్బుల నుంచి తల్లిదండ్రులే ఫీజులు చెల్లించుకుంటే ఇక విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు ఎందుకు? నేరుగా ప్రైవేటు స్కూల్స్​కు వెళ్తే సీటు ఇస్తారు కదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫీజులు నిర్ణయించినా.. పర్యవేక్షణ లేనందున ప్రవేశాలు పొందిన తరవాత ఎంత వసూలు చేస్తారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.