ETV Bharat / state

నాలుగేళ్లలో దగా, దుర్మార్గాలు.. ఇందుకోసం సీఎం జగన్​ను నమ్మాలా..!: టీడీపీ

author img

By

Published : Apr 10, 2023, 11:53 AM IST

TDP questioned YCP : వైసీపీ ‘నాలుగేళ్ల పాలనలో ఎటు చూసినా దగా, దుర్మార్గాలు తప్ప.. ఏం చేశారని సీఎం జగన్‌ను ప్రజలు నమ్మాలి?’ అని తెలుగుదేశం ప్రశ్నించింది. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడి.. సిగ్గులేకుండా ‘జగనే మా నమ్మకం' అంటూ ప్రచారం చేయించుకోవడం దివాళాకోరుతనం కాక మరేంటంటూ మండిపడింది. పాలనలో జగన్‌ అత్యంత ఘోరంగా విఫలమయ్యారంటూ ఆదివారం ఒక ప్రకటనను తెలుగుదేశం విడుదల చేసింది. అందులో భాగంగా జగన్​ను ఎందుకు నమ్మాలి అంటూ పలు ప్రశ్నలను సంధించింది.

tdp
tdp

జగన్‌ను జనం ఎందుకు నమ్మాలని ప్రశ్నించిన తెలుగుదేశం

TDP questioned YCP : 'ఎందుకు జగన్‌ను నమ్మాలి? రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టినందుకు నమ్మాలా? యువతకు ఉపాధి లేకుండా చేసినందుకా? సాగునీటి ప్రాజెక్టుల్ని గాలికి వదిలేసినందుకా? మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతున్నా.. పట్టించుకోనందుకా? అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి ఒక్కో కుటుంబంపై రెండున్నర లక్షల భారం మోపినందుకా?’ అంటూ తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో నిలదీసింది. ‘పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం ప్రశ్నార్థకం చేసినందుకు జగన్‌ను నమ్మాలా? రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా.. అప్పర్‌ భద్రపై కేంద్రాన్ని ప్రశ్నించనందుకా?’ అని ప్రశ్నించింది. ‘సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా కస్టోడియల్‌ టార్చర్‌ చేసి.. దాన్ని వీడియోకాల్‌లో చూస్తూ పైశాచిక ఆనందం పొందినందుకా? అని నిలదీసింది. ప్రతిపక్షాలతో పాటు ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నందుకు జగన్‌పై నమ్మకం ఉంచాలా?’ అని తెలుగుదేశం ప్రశ్నించింది.

మాట తప్పి మడమ తిప్పినందుకా: మద్య నిషేధంపై మాట తప్పి, మడమ తిప్పారని తెలుగుదేశం విమర్శించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మద్యం క్రయవిక్రయాల ద్వారా 41 వేల కోట్లను లూటీ చేశారని ఆరోపించింది. తాళిబొట్లు తాకట్టు పెట్టి 39 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినందుకు జగన్‌ను నమ్మాలా? కేంద్రం మెడలు వంచుతామని ఎన్నికల సమయంలో చెప్పి.. 25 మంది ఎంపీలు విజయం సాధించిన తర్వాత కేసుల కోసం వారిని కేంద్రానికి తాకట్టు పెట్టినందుకా? అని నిలదీసింది. సీపీఎస్‌పై మోసం చేసినందుకు ఉద్యోగులు నమ్మాలా? ఒకటో తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేనందుకా? అని ప్రశ్నించింది. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని చెప్పి.. 8 సార్లు పెంచి ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం వేసినందుకా? అని మండిపడింది. రాష్ట్రంలో ఆడబిడ్డలపై రోజుకు సగటున 49 అఘాయిత్యాలు నమోదు అవుతున్నాయన్న తెలుగుదేశం.. ఇలా మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నందుకు నమ్మాలా? రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలిపారని నమ్మాలా అంటూ ప్రశ్నించింది. ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు జగన్‌పై నమ్మకం ఉంచాలా? పాడి రైతులకు లీటరుకు 4 చొప్పున బోనస్‌ ఇస్తామని ఎగనామం పెట్టినందుకు నమ్మాలా అని నిలదీసింది.

నవరత్నాలెక్కడ : మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసినందుకు జగన్‌పై ప్రజలు నమ్మకం ఉంచాలా అని తెలుగుదేశం ప్రశ్నించింది. రాజధాని పేరుతో విశాఖపట్నంలో పేదల భూములు లాక్కున్నందుకు నమ్మాలా అని నిలదీసింది. భూకబ్జాలతో విశాఖలో 40 వేల కోట్లను లూటీ చేసినందుకా? అని మండిపడింది. తహసీల్దారు, కలెక్టరు కార్యాలయం సహా వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినందుకా అని ప్రశ్నించింది. రైతు భరోసా కింద ఏడాదికి ఒకే విడతలో 12 వేల 500 ఇస్తామని చెప్పి 7 వేల 500 రూపాయలే ఇస్తున్నారన్న తెలుగుదేశం.. ఇంట్లో ‘అమ్మఒడి’ని ఒక్కరికే పరిమితం చేశారంది. నవరత్నాల్లో ఒక్క రత్నమైనా కోతల్లేకుండా ఇచ్చారా? అని నిలదీసింది. వందల పథకాల్ని పేదలకు దూరం చేసినందుకు నమ్మకం ఉంచాలా? నాలుగేళ్లలో 26 మంది బీసీ నేతల్ని హతమార్చి.. 2 వేల 540 మందిపై దాడులకు పాల్పడి, 650 మంది నేతలపై అక్రమ కేసులు పెట్టించినందుకు జగన్‌ను బీసీ వర్గాలు నమ్మాలా? అని ప్రశ్నించింది. సబ్‌ప్లాన్ల నిధులను మళ్లించినందుకు నమ్మాలా అని నిలదీసింది.

ప్రభుత్వ బడులకు పిల్లలను దూరం చేసినందుకా : రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అని యువతను మోసం చేసినందుకా..? 17 లక్షల పెట్టుబడుల్ని తరిమేసినందుకు.. జగన్‌పై నమ్మకం ఉంచాలా? అని తెలుగుదేశం ప్రశ్నించింది. మూడున్నర లక్షల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ బడులకు దూరం చేసినందుకా? నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్రాన్ని మూడోస్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చినందుకా? అని మండిపడింది. 2021వ సంవత్సరంలో 571 మంది యువత మత్తు పదార్థాలకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడినందుకా? అని ప్రశ్నించింది. పేద ప్రజల కడుపు నింపే రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించి 7 వేల కోట్లను బొక్కేసినందుకా? నమ్మాలా అని నిలదీసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.