ETV Bharat / state

AP Crime News: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. వైఎస్సార్​ జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ

author img

By

Published : Apr 26, 2023, 1:21 PM IST

Etv Bharat
Etv Bharat

AP Crime News: కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మరో ఘటనలో వైఎస్సార్ జిల్లాలో ఆస్తి తగాదా కాస్తా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణగా మారింది. మరో వైపు అనంతపురం జిల్లాలో పిడుగు పడి యువకుడు మృతి చెందాడు.

AP Crime News: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కలపరి గ్రామ శివారులో ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యారు. ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో 15 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో ఉన్న హనుమంతు అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా రాళ్లతో కొట్టి, కత్తులతో నరికి హత్య చేశారు. 15 ఏళ్ల క్రితం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి నుంచి గ్రామాన్ని విడిచి పెట్టి దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు.

ఆస్తి తగాదా.. ఇద్దరి పరిస్థితి విషమం: ఆస్తి తగాదా నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పులివెందుల మండలం రచ్చుమర్రిపల్లెలో ఆస్తి విషయంలో ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు.. ఈ ఘర్షణలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తలలు పగలడంతో స్థానిక పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. రచ్చుమర్రిపల్లె గ్రామంపై పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం చింతల జుటూరు గ్రామానికి చెందిన వారు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేశారని వారు తెలిపారు.

స్నానానికి వెళ్లి బాలుడు మృతి: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట సమీప పొలాలలో ఉన్న నీటిలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు మృతి చెందాడు. హుకుంపేటకు చెందిన జ్ఞాన దీపక్ పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి తన పొలంలో నీళ్లు ఉండడంతో సరదాగా ఈత కొట్టేందుకు మంగళవారం సాయంత్రం ఆ నీటిలో దిగాడు. జాతీయ రహదారి నిర్మిస్తూ ఉండడంతో రహదారికి ఆనుకుని ఉన్న పొలంలో తీసిన గుంతలో నీళ్లు చేరి ఊబిగా మారింది. అది గమనించని దీపక్ అందులో దిగి మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతుండగా మృతదేహం కనిపించింది.

ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా : తన ఇంట్లో కిరాయికి ఉన్న వారు ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ ఇంటి యజమాని మనస్తాపం చెందిన నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​ చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో చోటు చేసుకుంది. అతని భార్య సైతం బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో సయ్యద్ వాసీం అక్రం బ్యాంక్ లోన్ తీసుకొని సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటిని నాలుగు సంవత్సరాల క్రితం ఓ మహిళకు అద్దెకిచ్చాడు. ఆ మహిళ ఇంటి కిరాయి చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతోందని వాసీంఅక్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క లోన్ చెల్లించాలంటూ బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. ఈ రెండు కారణాల వలన మనస్తాపం చెందిన సయ్యద్ వాసీం అక్రం నాలుగు అంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా చేసాడు. అదే సమయంలో అతని భార్య సయ్యద్ ఐశ్రత్ బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమెను కోవూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రంకు నచ్చజెప్పి కిందకు దించారు.

4 లక్షలు అపహరణ: ద్విచక్రవాహనంలో ఉంచిన నగదు చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై కె.సుధాకరరెడ్డి మంగళవారం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్​కు చెందిన వ్యాపారి కూనపరెడ్డి గోవిందరాజు రైతులకు ఇవ్వాల్సిన నగదు రూ. 4 లక్షలు నరసాపురం స్టేట్​ బ్యాంకులో తీసుకుని తన ద్విచక్రవాహనంలో ఉంచాడు. అక్కడి నుంచి అరటి పండ్లు కొనుగోలు చేసేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి ఆ పక్కనే వాహనం నిలిపాడు. తిరిగి వచ్చేసరికి ఆ వాహనంలో రు. 4లక్షలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

పిడుగు పడి యువకుడు మృతి: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం వీచిన గాలి, వాన వల్ల కొత్తపల్లి కుంట గ్రామంలో పిడుగు పడడంతో వన్నూరు స్వామి (20) అనే గొర్రెల కాపరి సాయంత్రం మృతి చెందాడు. గ్రామ సమీపంలో ఉన్న అడవిలో మేత కోసం వెళ్లి గాలివాన రావడంతో గొర్రెలు తోలుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒకసారిగా పిడుగుపాటుకు గురై ఆ యువకుడు మరణించాడు. సమాచారం అందుకున్న గుమ్మగట్ట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మహిళపై వీధి కుక్కల దాడి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అయోధ్య నగర్​లో సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్న మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. అయోధ్య నగర్​లో నిన్న సాయంత్రం వాకింగ్​కి వెళ్లిన దుర్గా అనే మహిళను వీధి కుక్కలు వెంటాడి కరిచాయి. గాయపడిన మహిళను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన మహిళకు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.

విద్యుదాఘాతంలో గొర్రెల కాపరి మృతి : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం రామనపల్లి వద్ద విద్యుదాఘాతంలో ముక్కడంపల్లి గ్రామానికి చెందిన సిద్దేష్ అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. మేత కోసం గొర్రెలను తీసుకొని వెళుతుండగా కోళ్ల ఫారానికి సరఫరా అవుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు సిద్దేశ్ కాలికి తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్క వారు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.