ETV Bharat / state

నదుల పునరుజ్జీవనానికి పాతరేసిన సర్కార్ - కేంద్రం సూచించినా పెడచెవిన పెట్టిన వైనం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 9:59 AM IST

Rivers Rejuvenation Project Andhra Pradesh: వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో ప్రధాన నదుల పునరుజ్జీవానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమైంది. తమిళనాడులోని నాగ నదిలో చేపట్టిన పనులతో మంచి ఫలితాలు రావడంతో కేంద్రం సూచనలతో రాష్ట్రంలోనూ ఇదే విధంగా ఆరు నదులను అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. ఏడాదికి 250 కోట్ల చొప్పున మూడేళ్లలో 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ప్రధానమైన ఆరు నదులకు పూర్వ వైభవం వచ్చేది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ దశలోనే నిలిచిపోయింది.

Rivers_Rejuvenation_Project_in_Andhra_Pradesh
Rivers_Rejuvenation_Project_in_Andhra_Pradesh

Rivers Rejuvenation Project Andhra Pradesh: నదుల పునరుజ్జీవనానికి పాతరేసిన సర్కార్ - కేంద్రం సూచించినా పెడచెవిన పెట్టిన వైనం

Rivers Rejuvenation Project Andhra Pradesh: రాష్ట్రంలో ఆరు నదులకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు వినియోగించుకోవచ్చని కేంద్రం సూచించినా.. జగన్‌ సర్కార్‌ చొరవ చూపలేదు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెన్నా, కర్నూలులో హంద్రీ, కడపలో పాపఘ్ని, చిత్తూరులో స్వర్ణముఖి, శ్రీకాకుళంలో నాగావళి, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదుల పునరుజ్జీవ పనులను రెండున్న రేళ్ల కిందట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రాష్ట్ర శాఖ ప్రతిపాదించింది. నదుల నుంచి నీరు నేరుగా కిందకు ప్రవహించి వృథాగా సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం ద్వారా భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలాలు పెంచాలన్నది ప్రణాళిక. తమిళనాడులోని నాగ నదిలో చేపట్టిన పనులతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు నదికి ఇరువైపులా వ్యవసాయం.. పచ్చదనం బాగా పెరిగిందని అధికారులు గుర్తించారు.

Godavari River Turns into Pollution: కాలుష్య కాసారంగా గోదారమ్మ.. పట్టించుకోండి మహాప్రభూ..!

రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు అమలుకు ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ నిధులు వినియోగించుకునేలా కార్యాచరణ ప్రణాళిక తయారుచేశారు. ఇదే నిధులతో గ్రామాల్లో 10 వేల కోట్ల రూపాయల అంచనాతో 35 వేలకుపైగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర భవనాల నిర్మాణ పనులు అప్పటికే ప్రారంభమయ్యాయి. వీటిని పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం భావించడంతో నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు పక్కకు వెళ్లింది. నదుల పునరుజ్జీవనం ఆవశ్యకమని.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు, భూగర్భ జల విశ్రాంత నిపుణులు చెబుతున్నారు.

తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల మీదుగా కాంచీపురం జిల్లాలోని పాలార్ వరకు ఒకప్పుడు నాగ నది ప్రవహించేది. ఈ నీటితో వేలూరులో రైతులు వివిధ పంటలను పండించేవారు. అయితే క్రమంగా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో పంటల సాగుపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొంత కాలానికి నది పూర్తిగా ఎండిపోవడంతో పంటలు పండించడాన్ని రైతులు ఆపేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం 2014లోనాగ నది పునరుజ్జీవ పనులను చేపట్టడంతో.. మళ్లీ పూర్వ వైభవం వచ్చింది.

Rivers Linking: మాటిచ్చి మడమ తిప్పారు.. నిలిచిన వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియ

ఇందులో భాగంగా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపజేసేందుకు 600 బావులు, మరో 600 చెక్ డ్యాంలు నదిలో నిర్మించారు. ఈ పనులతో 2015, 2016 ఏడాదిలలో కురిసిన వర్షాలతో బావుల్లోకి నీరు చేరింది. డ్యాంలతో నదిలోనూ ఎక్కడిక్కడ నీరు నిల్వ చేయగలిగారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో 8 వేల760 హెక్టార్ల భూమిలో రైతులు తిరిగి పంటలు పండిస్తున్నారు. 340 బావుల్లో భూగర్భ జలమట్టం 6 మీటర్ల మేర పెరిగిందని అధికారులు గుర్తించారు.

ఈ ప్రాజెక్టు పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహిళలను భాగస్వామ్యం చేశారు. బావులు తవ్వడం, రాళ్లు వేయడం, సిమెంట్ రింగులు వేయడం మొదలు సిమెంట్ మూతలతో బావులను మూయడం వంటి ముఖ్యమైన పనులను మహిళలు చేపట్టారు. భవిష్యత్తు తరాలతో ముడిపడి ఉన్న నదుల పునరుజ్జీవన ప్రక్రియ ఎంతో కీలకమైనది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని ప్రాధాన్యాంశంగా భావించి నిధులు కేటాయించి ప్రాజెక్టును పట్టాలెక్కించాల్సిన అవసరముంది.

Pollution in Godavari River: గోదారమ్మ ఒడిలోకి కాలుష్య వ్యర్థాలు.. పట్టించుకునేవారే కరువాయే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.