ETV Bharat / state

Pollution in Godavari River: గోదారమ్మ ఒడిలోకి కాలుష్య వ్యర్థాలు.. పట్టించుకునేవారే కరువాయే..!

author img

By

Published : Jun 18, 2023, 2:46 PM IST

Etv Bharat
Etv Bharat

Pollution in Godavari River: అది పవిత్ర గోదావరి నది. అందులో స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి.. భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు చేస్తుంటారు. ఐతే, ఇప్పుడక్కడ స్నానం చేస్తే పుణ్యం రావడం మాట దేవుడెరుగు.. సర్వరోగాలు అంటుకోవడం మాత్రం ఖాయం. అంతలా అక్కడి నదీ తీరం కలుషితమవుతోంది. ఇంతకీ ఎక్కడో చూద్దాం రండి..

Pollution in Godavari River: గోదావరి నదీ తీరం అంటే ఇసుక తిన్నెలు, పచ్చటి పచ్చిక బయళ్ల వంటి.. ఆహ్లాదరకర దృశ్యాలే స్ఫురిస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి ఆనుకుని ప్రవహించే.. గోదావరి నదీ తీరానికి వెళ్తే అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. పట్టణంలోని చెత్త, వ్యర్థాలను.. ఆటోలు, ట్రాక్టర్లతో నది ఒడ్డున నరసాపురం పురపాలక సిబ్బంది డంపింగ్‌ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు.. పట్టణంలోని మురికి నీటిని నదిలోకి వదులుతున్నారు. రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలనూ.. గోదాట్లో కలిపేస్తున్నారు.

వాస్తవానికి పట్టణంలోని డంపింగ్ యార్డు గతంలో వేరే చోట ఉండగా.. అక్కడ లీజు గడువు ముగియడంతో మరోచోట స్థల సేకరణ చేయాల్సి ఉంది. అప్పటిదాకా తాత్కాలికంగా.. నది ఒడ్డున చెత్త డంపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ ప్రతిపాదనను పురపాలక సంస్థ అధికారులు మరువడంతో నది తీరమే శాశ్వత డంపింగ్ యార్డుగా మారిపోయింది. చెత్త డంపింగ్ యార్డును.. తొలగించాలని ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారేలేరు.

డంపింగ్ యార్డు వల్ల నది పూర్తిగా కాలుష్య కారకాలతో నిండిపోవడంతో పాటు.. మత్స్య సంపదపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఈ ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి ఎంతో మంది జీవించగా.. నదీ కాలుష్యంతో వేటకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.. డంపింగ్ యార్డును నది ఒడ్డు నుంచి వేరే చోటికి తరలిస్తామని మాటిచ్చారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయమైతే దగ్గరపడింది కానీ.. వాగ్దానం మాత్రం నెరవేరలేదు. కాలుష్యాన్ని అరికట్టకపోతే.. గోదావరి తీరం మురికి కూపంలా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

"ఎంతో పవిత్రమైన ఈ గోదావరి నదిలోకి కాలుష్య వ్యర్థాలను వదులుతున్నారు. గోదావరి ఒడ్డున తీసుకుని వచ్చి ఈ డంపింగ్ యార్డ్​ను పెట్టారు. దీంతో కాలుష్యకాసారంగా గోదావరి నదీ తీరం మారిపోయింది. ఇది మత్స్య సంపదపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిపై ఎంతమంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టినా పట్టించుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.. డంపింగ్ యార్డును నది ఒడ్డు నుంచి వేరే చోటికి తరలిస్తామని మాటిచ్చారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయమైతే దగ్గరపడింది కానీ.. వాగ్దానం మాత్రం నెరవేరలేదు. కాలుష్యాన్ని అరికట్టకపోతే.. గోదావరి తీరం మురికి కూపంలా మారిపోతుంది. దయచేసి గోదావరి ఒడ్డు నుంచి డంపింగ్ యార్డును తరలించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము." - స్థానికులు

కాలుష్యకాసారంగా గోదావరి నదీ తీరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.