Rivers Linking: మాటిచ్చి మడమ తిప్పారు.. నిలిచిన వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియ

author img

By

Published : Jul 7, 2023, 8:19 AM IST

Vamsadhara-Nagavali linking project

Vamsadhara-Nagavali linking project : మాట ఇచ్చానంటే మడమ తిప్పేవాడు కాదు ఈ జగన్​మోహన్​ రెడ్డి అంటూ గొప్పగా ప్రకటించుకునే.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి వంశధార-నాగవళి అనుసంధాన పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ, ఆ పనులు ఇప్పటి వరకు ముందుకు సాగటం లేదు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ప్రకటించగా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది.

నిలిచిన వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియ

Vamsadhara-Nagavali linking project Works Pending : ఏడాదిలో వంశధార - నాగావళి అనుసంధానం పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి.. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలోనూ చేర్చారు. ఇంకేముంది ఏడాది తర్వాత కాలువల్లో నీరు పారుతుందని సిక్కోలు రైతులు ఆనందపడ్డారు. కానీ, ఆ తర్వాత గడువు పెంచుతూ పోయారు. చివరకి ఇప్పటి వరకు అనుసంధానం పూర్తి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడిచింది. గత తెలుగుదేశం ప్రభుత్వం 60 శాతం పనులు చేస్తే.. వైఎస్సార్​సీపీ సర్కార్‌ కేవలం 20 శాతం మాత్రమే చేసింది. వాటికీ బిల్లులు చెల్లించలేదు. ఫలితంగా గుత్తేదారులు పనులు ఆపేశారు. ఇప్పటికే తవ్విన కాలువల్లో పిచ్చిమొక్కలు, కంప చెట్లు పెరిగిపోయి.. ఇంతవరకు చేసిన పనులు ధ్వంసమవుతున్నాయి.

వంశధార వరద జలాలను నాగావళి నదికి మళ్లించి సిక్కోలును అన్నపూర్ణగా మార్చాలన్న ఉద్దేశంతో.. గత తెలుగుదేశం ప్రభుత్వం వంశధార-నాగావళి అనుసంధాన ప్రాజెక్టును తలపెట్టింది. 2017 మార్చి 27న 84.90 కోట్ల రూపాయలతో పరిపాలనామోదం ఇచ్చింది. హిరమండలం జలాశయం నుంచి హైలెవెల్‌ కాలువ తవ్వి దాని ద్వారా నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు కలపాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో 37వేల 53 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, మరో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట 130 క్యూసెక్కులను హైలెవెల్‌ కాలువ మీదుగా తీసుకెళ్లాలని ప్రతిపాదించగా.. ఆ తర్వాత 600 క్యూసెక్కుల నీటిని తరలించాలని సామర్థ్యాన్ని పెంచారు. తెలుగుదేశం హయాంలోనే భూమి సేకరణ పనులు పూర్తయి.. 2019 మే నెల నాటికే 60 శాతం పనులను పూర్తి చేశారు.

పనులు చకచకా జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారింది. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతూ.. అంచనా వ్యయాన్ని 145.34 కోట్ల రూపాయలకు పెంచేశారు. అయినా ఇప్పటివరకు హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్ట వరకు 33.583 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తి చేయలేదు. మొత్తం 64 కట్టడాలకుగాను 34 మాత్రమే పూర్తయ్యాయి. మరో 32 వేల క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు, 1.66 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. మరో 1.7 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంది. హెడ్‌ రెగ్యులేటర్లు, క్రాస్‌ రెగ్యులేటర్ల పనులు, గేట్లు, 10 డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాల పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. నిధులు సరిగా ఇవ్వక, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించక పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టుకు హిరమండలం జలాశయమే ఆధారం. ఇందులో ఇంకా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచడం లేదు. ఆ జలాశయం నిర్మాణాన్నీ, అనుసంధాన పనులనూ పూర్తిచేయాల్సి ఉంది.

జగన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక మొదటి ఏడాదిలో ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయొచ్చో జలవనరులశాఖ ఓ జాబితా సిద్ధం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయం స్వల్పంగా, పూర్తిచేస్తే కలిగే ప్రయోజనాలు అధికంగా ఉన్న వాటినే అందులో ప్రస్తావించింది. 2020-21లో వెయ్యి 78 కోట్ల రూపాయలతో అయిదింటిని పూర్తి చేయొచ్చని పేర్కొంది. తొలి ప్రాధాన్యం పొందినవాటిల్లో వంశధార - నాగావళి అనుసంధానం ఒకటి.

2020 జులై నాటికే పూర్తి చేస్తామని జలవనరులశాఖ సమీక్షలో ఘనంగా ప్రకటించిన సీఎం జగన్‌.. ఆ తర్వాత 2020 డిసెంబరుకు గడువు పొడిగించారు. తర్వాత 2021 ఆగస్టు, 2022 ఆగస్టు, 2022 డిసెంబరు, 2023 జులై.. ఇలా గడువులు మారిపోతూనే ఉన్నాయి. పనులు మాత్రం ఏమాత్రం ముందుకు కదల్లేదు. అనుసంధాన కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కల్వర్టులు ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల పనులను మధ్యలోనే వదిలేయడంతో.. వర్షాలకు పొలాలు మునిగిపోతున్నాయి.

"తెలుగుదేశం పాలన కాలంలో వంశధార- నాగవళి అనుసంధాన పనులు జరిగాయి. అప్పుడు దాని పనులు సగనికిపైగా పూర్తయ్యాయి. దానిని తవ్వి వదిలేశారు. వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతోంది. దీనివల్ల చాలా నష్టపోతున్నాము." - వంశధార- నాగవళి అనుసంధాన పరిధిలోని రైతు

"ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని గురించి అసలు పట్టించుకోలేదు. సంవత్సరంలోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ, ఇప్పటి వరకు దీని ఊసే లేదు. పూర్తిగా విడిచిపెట్టారు. మొన్న శ్రీకాకుళం వచ్చినప్పుడు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కేవలం మాటల వరకే పనులు మాత్రం జరగటం లేదు."-వంశధార- నాగవళి అనుసంధాన పరిధిలోని రైతు

వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్రకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని జగన్‌ ఎన్నోసార్లు చెప్పారు. కానీ నాలుగేళ్ల పాలనా కాలంలో ఉత్తరాంధ్రలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. పైగా నాలుగేళ్లలో వంశధార-నాగాళి అనుసంధానంలో కేవలం 20 శాతమే పనులు మాత్రమే చేశారు. దీన్నిబట్టి ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.