ETV Bharat / city

నదుల అనుసంధానంలో కొత్త ప్రత్యామ్నాయాలు

author img

By

Published : Feb 6, 2020, 6:25 AM IST

Rivers interlink in telugu states
నదుల అనుసంధానంలో కొత్త ప్రత్యామ్యాయాలు

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంలో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ సమర్పించిన ఐదు ప్రతిపాదనలను కాదని.... జలాశయాల గుండానే గోదావరి నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం కుడి కాల్వ ద్వారా.. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, సాగర్ జలాశయాల నుంచి శ్రీశైలం వరకు నీటిని తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ఖరారైతే, రెండు రాష్ట్రాలు కలిసే ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది.

నదుల అనుసంధానంలో కొత్త ప్రత్యామ్యాయాలు

గోదావరి నది నీటిని శ్రీశైలం వరకూ తరలించే అంశంపై వ్యాప్కోస్ ఇచ్చిన ప్రత్యామ్నాయాల బదులు మరో మార్గంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, సాగర్ జలాశయాల నుంచి శ్రీశైలం వరకూ నీటిని తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తెలంగాణతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టారు. పోలవరం కుడికాలువను మరింతగా వెడల్పు చేయటం ద్వారా... ప్రకాశం బ్యారేజీకి నీటిని చేర్చాలని... అక్కడి నుంచి పులిచింతల, సాగర్ జలాశయాల్లోకి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తిపోస్తూ జలాశయాలను నింపాలని భావిస్తున్నారు. అదే పద్ధతిలో శ్రీశైలం డ్యామ్ లోకీ నీటిని ఎత్తిపోయాలనుకుంటున్నారు. అలాగే, వేర్వేరు అవసరాలకు ఆ నీటిని వినియోగించాలని నిర్ణయించారు. ఇందుకోసం... రెండు టీఎంసీల నీటిని తీసుకువెళ్లేలా పోలవరం కుడికాలువను విస్తరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 8 వేల 500 క్యూసెక్కుల సామర్థ్యంతో మాత్రమే పోలవరం కుడికాలువ నుంచి గోదావరి వరదనీటి మళ్లింపు జరుగుతోంది.

రెండు రాష్ట్రాలు సంయుక్తంగా

వాస్తవానికి.. కృష్ణా - గోదావరి అనుసంధానం కోసం 63 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేపట్టాల్సి ఉంటుందని భావించారు. కొత్త ప్రత్యామ్నాయంతో ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయొచ్చన్నది ఆలోచన. ఏపీ, తెలంగాణలో... ఏ రాష్ట్రం ఎత్తిపోసిన నీరు వారే వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌తో పాటు శ్రీశైలం రిజర్వాయర్ రెండు రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. ఇవి సంయుక్త ప్రాజెక్టులు కాబట్టి, కొత్త ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే.... ఆ ప్రాజెక్టును రెండు రాష్ట్రాలూ కలిసే చేపట్టాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి : మీరు పనిచేస్తేనే ప్రభుత్వ కలల నిజమవుతాయి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.