ETV Bharat / state

Raghurama letter: సీఐడీ చీఫ్​పై చర్యలు తీసుకోవాలని కేెంద్రానికి రఘురామ లేఖ..

author img

By

Published : Jun 22, 2023, 9:32 AM IST

Updated : Jun 22, 2023, 12:18 PM IST

Raghurama letter to Union Home Secretary
సీఐడీ చీఫ్​పై చర్యలు తీసుకోవాలని కేెంద్రానికి రఘురామ లేఖ

Raghurama letter to Union Home Secretary: సర్వీసు నిబంధనలను తుంగలోతొక్కి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఆయన లేఖ రాశారు.

సీఐడీ చీఫ్​పై చర్యలు తీసుకోవాలని కేెంద్రానికి రఘురామ లేఖ

Raghurama letter to Union Home Secretary: మార్గదర్శి కేసులో పరిధిదాటి వ్యవహరించిన ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఆయన లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ఆయన ప్రకటనలు, చర్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా, అఖిల భారత సర్వీసు నిబంధనలను తుంగలో తొక్కేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సీఎం, ఆయన సలహాదారుతో పాటు, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చెప్పే పనులు మాత్రమే చేయడానికి ఆయన్ను సీఐడీ చీఫ్‌గా నియమించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో వివరించారు. ఈ పోస్టులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఎంపిక ప్రకారమే భర్తీ చేస్తున్నారని.. ముఖ్యమంత్రి ఈ పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా సీఐడీ చీఫ్‌ విలేకర్ల సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా అవాంఛనీయమైన ప్రకటనలు చేస్తున్నారని రాఘురామకృష్ణ రాజు వెల్లడించారు.

కేసులు నమోదైన వారి మీద దుర్భాషలాడుతూ ప్రజల్లో తప్పుడు భావం కలిగించి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం, పరిస్థితులకు తగ్గట్టు అధికారులు ఏదైనా విషయానికి సంబంధించిన వాస్తవాలు, వివరాలు మాత్రమే వెల్లడించాలి తప్పితే ఆరోపణలు, నిందలు, దుర్భాషలాడటానికి వీల్లేదని.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులో సంజయ్‌ మాత్రం ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న ఈ అధికారుల తీరుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి.. సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, హోంశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు.

విచారించిన దృశ్యాలు నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పేపర్‌ ద్వారా లీక్‌.. ఇటీవలి కాలంలో సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ ఫండ్‌ యజమాని, మీడియా పరిశ్రమ దిగ్గజం, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఆయన్ను విచారించిన దృశ్యాలను నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత పత్రిక అయిన సాక్షి పేపర్‌ ద్వారా లీక్‌ చేశారని లేఖలో తెలిపారు. విచారణలో పాలుపంచుకున్న సీఐడీ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ చిత్రాలు ముఖ్యమంత్రి సొంత పత్రిక ద్వారా ఎలా బయటికొచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయమన్నారు. విచారణ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు లీక్‌ కావడం గురించి ఎవరైనా మాట్లాడినా, మీడియా దిగ్గజం రామోజీరావుకు సంఘీభావం పలికినా అలాంటి వారందరికీ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ సాక్షి పత్రిక ద్వారా ప్రకటించారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో రోజుకొక అఘాయిత్యం వెలుగు చూస్తోంది.. భావప్రకటన, పత్రికా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పు గురించి ఇలాంటి ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ ఇప్పించాలని.. లేదంటే ఇలాంటి వారు లా బ్రేకర్స్‌గా తయారవుతారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని సీఐడీలో నెలకొన్న పరిస్థితుల గురించి మీరు ఆ రాష్ట్రంలో పనిచేసే ఏ అఖిలభారత సర్వీసు అధికారి నుంచైనా విశ్వసనీయంగా సమాచారం తెప్పించుకొని పరిశీలించి తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని లా అండ్‌ జస్టిస్‌ పర్సనల్‌, గ్రీవెన్స్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా కోరుతున్నానని రఘురామ అజయ్‌భల్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితి చేయిదాటిపోతే ప్రభుత్వ వ్యవస్థపై ప్రజావిశ్వాసాన్ని సరిదిద్దే అవకాశాన్ని కోల్పోతామని వివరించారు.

రాష్ట్రంలో రోజుకొక అఘాయిత్యం వెలుగు చూస్తోందని..ఫ్రాన్సిస్కో అనే అమ్మాయిపై యాసిడ్‌ దాడి, పులివెందులలో ఎస్సీ యువకుడి హత్య, లారీతో తొక్కించి ఒకరిని, ట్రాక్టర్‌తో తొక్కించి మరొకరిని హత్య చేశారని రఘురామ తెలిపారు.. ఇవేమీ పట్టని సీఐడీ అధికారులు.. ఎటువంటి ఫిర్యాదు లేని మార్గదర్శి సంస్థపై మాత్రం కేసులు నమోదు చేసి విచారణ పేరిట వేధిస్తున్నారని తెలిపారు. డిపాజిట్‌కు, సెక్యూరిటీ డిపాజిట్‌కు తేడా తెలియని దుస్థితిలో సీఐడీ అధికారులు ఉన్నారని రఘురామ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక ఎంపీని ఎత్తుకు వెళ్లి ఆస్తులు రాయించుకున్నారని.. తనను ఎత్తుకెళ్లి లాకప్‌లో చిత్రహింసలకు గురి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడేమో ఈనాడు దినపత్రిక అధినేత, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావును వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ఆడిస్తున్న తోలుబొమ్మలాట.. మార్గదర్శి సంస్థ, ఆ సంస్థ చందాదారుల గురించి సీఐడీ చీఫ్‌ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా? అని అడిగితే ఆడపిల్ల తనపై అత్యాచారం జరిగిన తరువాత ఫిర్యాదు చేయకపోతే మా బాధ్యతలను విస్మరిస్తామా?అని సంజయ్‌ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామ మండిపడ్డారు. పిల్లలకు చాక్లెట్‌ ఇచ్చి ఎత్తుకెళ్లే బ్యాచ్‌తో ఓ ప్రతిష్ఠాత్మక సంస్థను పోల్చడం దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో కొంతమంది ఐపీఎస్‌ అధికారులు, సలహాదారుల సూచనల మేరకు సంజయ్‌, మార్గదర్శి సంస్థపై జగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని వెల్లడించారు. ఇంత దారుణంగా మాట్లాడే సంజయ్‌కి సీఐడీ చీఫ్‌గా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు.

నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శి సంస్థలను, రాష్ట్రంలోని 37 బ్రాంచిలను మూసివేయిస్తామని చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోందని తెలిపారు.. ఇప్పటికీ ఈ కేసులో సీఐడీ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలు చేయలేదు. అయినా ఇష్టారాజ్యంగా ఎలా మాట్లాడుతారని.. అధికారులకు ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుందని.. దాన్ని సంజయ్‌ అధిగమించినట్లు స్పష్టమవుతుందన్నారు. దుర్బుద్ధితోనే ఆయన మార్గదర్శి సంస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశారని స్పష్టమవుతోందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు ఈ కేసు వెళ్తే సంజయ్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని అని రఘురామ పేర్కొన్నారు.

Last Updated :Jun 22, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.