ETV Bharat / state

industries incentives గతేడాది రాయితీలు లేవు..! ఈసారైన బటన్ నొక్కుతారని ఎదురు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు!

author img

By

Published : Jul 9, 2023, 4:10 PM IST

Updated : Jul 9, 2023, 4:31 PM IST

industries incentives: కొత్త పరిశ్రమలను భయపెట్టి, బెదిరించి రాష్ట్రానికి రాకుండా చేసిన ప్రభుత్వం... ఎప్పటి నుంచో ఉన్నవాటికి కూడా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా దివాలా తీసే స్థితికి తీసుకొచ్చింది. ఏటా క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలు ఇస్తాం అన్న సీఎం జగన్ మాటలు నమ్మిన పారిశ్రామిక వేత్తలకు నిరాశే మిగిలింది. గతేడాది పారిశ్రామిక రాయితీలు విడుదల చేయని ప్రభుత్వం.. ఈ ఏడాదైనా ఇస్తుందో లేదో స్పష్టత కొరవడింది.

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం శూన్యం
పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం శూన్యం

industries incentives: పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై గొప్పలు చెప్పిన సీఎం జగన్‌... ఇప్పుడు ఆంక్షల మెలికలు పెడుతున్నారు. గతేడాది జులైలో శాసనమండలి ఎన్నికల సాకుతో వాయిదా వేయగా... కోడ్‌ ముగిశాక ఇస్తామన్న మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. తిరిగి ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు తర్వాత అని చెప్పారు. తాజాగా నాలుగు నెలలైనా ఇంకా విడుదల జాడలేదు. ఇప్పుడు కొత్తగా ఈ నెలలోనే ఇస్తామని చెబుతున్నా... బటన్‌ నొక్కేదాకా జగన్‌ను నమ్మలేమని పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు.

రాష్ట్రాన్ని వదిలేస్తున్న పారిశ్రామిక వేత్తలు... జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం లేకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపోతున్నారు. పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి చూపిద్దామని అడుగేసిన వారికి అష్టకష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. గతేడాది 1,626 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇప్పటికీ విడుదల చేయకపోగా.. ఈ ఏడాది చెల్లించాల్సిన వాటితో కలిపితే మొత్తం 2,400 కోట్లు. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం జులైలో ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉన్నా.. ఈ ఏడాదైనా మాట నిలబెట్టుకుంటారా అని పారిశ్రామికవేత్తలు సందేహిస్తున్నారు.

జాబితా సిద్ధమైనా... చిన్న తరహా, స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహక రాయితీలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో జాబితా సిద్ధం చేసింది. చిన్న పరిశ్రమలకు రూ.726 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... జిల్లాల వారీగా తుది జాబితాను సైతం సిద్ధం చేశారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కడమే తరువాయి... రాయితీ సొమ్ము వచ్చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న పారిశ్రామిక వేత్తలకు నిరాశే మిగులుతోంది. శాసనమండలి ఎన్నికల కోడ్‌ ఉందంటూ తప్పించుకోగా.. ఎన్నికలు ముగిసినా విడుదల కాలేదు. అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాకం మాత్రం అందడం లేదు. మొత్తంగా 2021 సెప్టెంబరులో స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

విద్యుత్ గరిష్ట చార్జీలకూ దక్కని మోక్షం.. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం.. బకాయిలను కలిపితే చిన్న పరిశ్రమలకు 1000 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్లులకు 1400 కోట్లు కలిపి మొత్తం 2,400 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాల జాబితాలను తయారు చేసేందుకు సీనియారిటీ ఆధారంగా దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యాకే తుది జాబితా వెల్లడించనుండగా.. ఈ సారైనా సీఎం బటన్‌ నొక్కుతారా? లేదా? అని పారిశ్రామికవేత్తలు ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌ తర్వాత పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్తలు.. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందితే చాలనుకుంటున్నారు. వీటితోపాటు కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో విద్యుత్‌ గరిష్ఠ డిమాండ్‌ ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. వాటిని కూడా విడుదల చేయాలని పారిశ్రామిక సంఘాల నేతలు కోరుతున్నారు.

పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం శూన్యం
Last Updated :Jul 9, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.