ETV Bharat / state

బకాయిల బండ.. పారిశ్రామిక వేత్తలకేదీ సర్కారు అండ

author img

By

Published : Feb 25, 2023, 8:24 AM IST

Industrial concessions : పారిశ్రామిక రాయితీల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఏటా ఆగస్టులో చెల్లిస్తామని ప్రకటించిన సీఎం జగన్.. ఒక్క ఏడాదితోనే సరిపెట్టుకున్నారు. ఇప్పటికి రూ.900కోట్లు బకాయి ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పారిశ్రామిక రాయితీలు
Industrial concessions

Industrial concessions : జగన్‌ చెప్పాడంటే.. ఫలానా నెలలో, ఫలానా సంక్షేమ పథకం కచ్చితంగా అందుతుంది అనే నమ్మకంతో లబ్ధిదారులు ఉంటారు... ఏ పండగ, ఎప్పుడొస్తుందనేది క్యాలెండర్‌లో ఎలా ఉంటుందో.. ఆ మాదిరే ఏ నెలలో, ఏయే పథకాలను అందజేస్తామో చెబుతున్నాం... లబ్ధిదారుల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటిస్తున్నాం. - 2021 మే 20న అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చెప్పిన మాటలివి

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం ఏటా ఆగస్టులో పారిశ్రామిక రాయితీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ), స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాల చెల్లింపు అనేది ఒక్క ఏడాదికే పరిమితమైంది. 2021 సెప్టెంబరులో స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాతి ఏడాది నుంచే వాయిదాల పర్వం మొదలైంది. ఆ మేరకు 2022 ఆగస్టులో రూ.726 కోట్ల బకాయి చెల్లింపులకు పరిశ్రమల శాఖ జాబితా సిద్ధం చేసింది. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు.

వర్గాల వారీ జాబితా... గతానికి భిన్నంగా అందరికీ కలిపి ఒకటే జాబితా కాకుండా.. జనరల్‌, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారీగా జాబితాలను రూపొందించింది. ఆ మేరకు జనరల్‌ కేటగిరిలో రూ.450 కోట్లు, ఎస్సీలకు రూ.230 కోట్లు, ఎస్టీలకు రూ.46 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. స్పిన్నింగ్‌ మిల్లులకు ప్రోత్సాహకాలతో కలిపితే మొత్తం రూ.900 కోట్లు కేటాయించాలని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. కరోనా తర్వాత పారిశ్రామికవర్గాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించిన రాయితీలు అందితే కొంత ఊరట లభిస్తుందనుకున్నా.. ఫలితం లేకపోయింది.

ఇదేనా ప్రోత్సాహం అంటే?.. ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై పారిశ్రామికవేత్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టు నెల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని గుర్తు చేస్తూ.. 2020లో రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద విద్యుత్‌ ఎండీ ఛార్జీలు ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొంటున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడం అంటే ఇదేనా? అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు సంధిస్తున్న మరికొన్ని ప్రశ్నలివీ...

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం మార్చిలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల చెల్లింపు విధానంపై ఏం సమాధానం చెబుతుంది?

గతేడాది ఆగస్టు ప్రోత్సాహకాలు పెండింగ్ లో ఉండగా.. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలంటూ ఇటీవల రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఇలాగైతే పెట్టుబడులు తరలివచ్చేనా..?

లాక్‌డౌన్‌ కారణంగా 2020 ఏప్రిల్‌ నుంచి మూడు నెలల పాటు పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ సమయంలో ఎంఎస్‌ఎంఈలు చెల్లించాల్సిన విద్యుత్‌ గరిష్ఠ డిమాండ్‌ ఛార్జీలు (ఎండీ) రూ.188 కోట్లు, భారీ పరిశ్రమలకు సంబంధించి మరో రూ.17 కోట్లను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానే, ఇప్పటికీ ఆ మొత్తాన్ని ఎందుకు విడుదల చేయలేదు?

పారిశ్రామిక వేత్తలకు చేదోడు నిలవాలని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. చేతల్లో మర్చిపోతున్నారు. ఏటా ఆగస్టులో చెల్లించాల్సిన పారిశ్రామిక రాయితీలను ఏడాదికే పరిమితం చేశారు. కొవిడ్‌ సమయంలో హామీ ఇచ్చిన విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీల చెల్లింపు హామీనీ విస్మరించారు.

పారిశ్రామిక రాయితీలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.