ETV Bharat / state

మచిలీపట్నం పోర్టు డీపీఆర్​కు కేబినెట్ ఆమోదం

author img

By

Published : Nov 6, 2020, 4:59 AM IST

Cabinet approves Machilipatnam Port DPR
మచిలీపట్నం పోర్టు డీపీఆర్​కు కేబినెట్ ఆమోదం

మచిలీపట్నం పోర్టు డీపీఆర్​ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. తొలిదశ నిర్మాణ పనులకు ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తం రూ.5,838 కోట్లతో 6 బెర్తుల నిర్మాణం చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వమే మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రివర్గంలో తీర్మానం చేశారు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం నుంచి అనుమతి లభించింది. పోర్టు నిర్మాణంపై ఏపీ మారీటైమ్‌ బోర్డు దృష్టి సారించింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములకు సంబంధించిన గణాంకాలను సిద్ధం చేస్తున్నారు. తొలి దశలో మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సుమారు 1000 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇందులో ముందుగా 225 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది.

మొత్తంగా తొలిదశలో చేపట్టే పనులకు రూ.5,838 కోట్లు అవసరమని భావిస్తున్నారు. సముద్రంలో సుమారు 155 ఎకరాల్లో డ్రెడ్జింగ్‌ పనులు చేయాల్సి ఉందని మారిటైమ్ బోర్డు తెలిపింది. వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా కార్యాచరణ మొదలు పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మూడేళ్లలో తొలిదశ పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 6 బెర్తులతో తొలి దశలో మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగనుంది.

నాలుగు జనరల్‌ కార్గో బెర్తులు, కోల్‌ బెర్త్‌, కంటైనర్‌ బెర్తుల నిర్మాణానికి మారీటైమ్ బోర్టు ప్రణాళిక చేసింది. 80 వేల డెడ్‌ వెయిట్‌ టన్నేజ్‌ సామర్థ్యం ఉన్న నౌకలు వచ్చేందుకు అనువుగా బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. పోర్టులో గోడౌన్లు, అంతర్గత రోడ్లు, ఇంటర్నల్‌ రైల్‌ యార్డ్‌, సబ్ స్టేషన్‌, పరిపాలనా భవనం వంటి నిర్మాణాలపైనా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ... కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.