ETV Bharat / state

KONDAPALLI MINING ISSUE: '17 చోట్ల కట్టలు ఏర్పాటు చేస్తుంటే.. మీరు నిద్రపోతున్నారా?'

author img

By

Published : Sep 7, 2021, 7:25 AM IST

ap-high-court-fires-on-govt-officials-on-kondapalli-mining-issue
'17 చోట్ల కట్టలు ఏర్పాటు చేస్కుంటుంటే.. మీరు నిద్రపోతున్నారా?'

ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను పూడ్చేసి అక్రమ పద్ధతిలో అడ్డంగా 17 చోట్లు కట్టలు ఏర్పాటు చేసుకున్న స్టోన్ క్రషర్స్ నిర్వాహకులపై ప్రభుత్వాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. నిద్రుపోతున్నారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలో స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను పూడ్చేసి అడ్డంగా 17 చోట్ల కట్టలు ఏర్పాటు చేసుకుంటుంటే... అధికారులు ఏమి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిద్రపోతున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇంత తీవ్ర నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది. ఒకవేళ చర్యలు తీసుకొని ఉంటే ఆ వివరాల్ని అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొండపల్లి అటవీ ప్రాంత భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్​కు పాల్పడుతున్న పలువురు.. వారి కార్యకలాపాలు కొనసాగించడం కోసం పరిటాల గ్రామ పరిధిలోని 8.6 కి.మీ పరిధి వరకు ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను కనుమరుగు చేశారని ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. కాలువను ధ్వంసం చేశారని... కాలువను పూడ్చి రవాణాకు అనువుగా రహదారి ఏర్పాటు చేసుకున్నారన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... 19 కి.మీ నుంచి 24 కి.మీ వరకు కాలువకు అడ్డంగా మొత్తం 17 చోట్ల క్రాస్ బండ్స్ ఏర్పాటు చేసుకొని స్టోస్ క్రషర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. క్రాస్ ఎండ్స్​ను తొలగించామని వివరించారు. 24 నుంచి 32 కి.మీల పరిధిలో కాలువ ప్రాంతాన్ని గ్రామస్థులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారన్నారు. వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు తెలిపారు. కొండపల్లి అభయారణ్యం భూమి పరిధిలో అక్రమ మైనింగ్ జరగడం లేదన్నారు. పిటిషనర్ ఆరోపణ నిజం కాదని వాదించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... ప్రతివాదులుగా ఉన్నవారు కౌంటర్లు వేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: Inter online admissions: ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత విధానమే: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.