ETV Bharat / state

అన్ని ఉన్నా - అనుమతులు రావు! భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంపై నీలినీడలు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 8:25 PM IST

Andhra Bank Founder Pattabhi Sitaramaiah ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంపై సర్కార్ చిత్తశుద్దిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం కోసం అవసరమైన స్థలం, నిధులు మంజూరైనా .. అందుకు కావల్సిన అడుగులు ఒక్కటి పడటం లేదు. నగర కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేయకపోవడంలో ఓ వైసీపీ నేత ప్రభావం ఉందంటూ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Andhra Bank Founder Pattabhi Sitaramaiah
Andhra Bank Founder Pattabhi Sitaramaiah

Andhra Bank Founder Pattabhi Sitaramaiah: భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరనటంలో అతిశయోక్తి లేదు. మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంక్ స్థాపనతో పాటు, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అలాంటి సమరయోధుల చరిత్రను భావితరాలకు అందించే ఉద్దేశంతో చేపట్టిన స్మారక భవన నిర్మాణం ముందుకు సాగడం లేదు. స్థానిక వైకాపా నేతల మధ్య వివాదం కారణంగా నేరుగా సీఎం జగన్ చెప్పినా కూడా... స్మారక భవన నిర్మాణానికి మచిలీపట్నం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు.


దేశ చరిత్రలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడైన పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణం విషయంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వర్గ పోరు విమర్శలకు తావిస్తోంది. భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలం, 40 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు రెండేళ్లు గడుస్తున్నా... కార్పొరేషన్ ఇవ్వాల్సిన అనుమతులు మాత్రం దక్కడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

'ఏపీ' ఎటు పోతోంది? నో డిజిటల్ పేమెంట్స్ - ఓన్లీ క్యాష్ అంటున్న సర్కారు

భవన నిర్మాణ అనుమతుల విషయంలో చోటు చేసుకున్న జాప్యాన్ని నిరసిస్తూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఎకతాటిపైకి వచ్చి పట్టాభి భవన నిర్మాణ సాధన కమిటీగా ఏర్పాటయ్యారు. దాదాపు రెండేళ్లుగా భవన నిర్మాణ అనుమతుల విషయంలో కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తునే ఉన్నారు. అనుమతులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫర్యాదు చేశారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమస్యను వివరించారు. అనుమతుల విషయంలో గతంలో ఎంపీ బాలశౌరి.. నగర కమిషనర్ ను గట్టిగా నిలదీశారు. భవన నిర్మాణ విషయంలో స్పందించకుంటే తగు విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించంతో వారం వ్యవధిలో అజెండాలో పెడతానంటూ చెప్పిన కమిషనర్ పదిహేను రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు.

భవన నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో తరుచూ స్పందనలో ఫిర్యాదులు అందజేసిన సందర్భంలో.. కలెక్టర్ రాజబాబు తగు చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ ను ఆదేశిస్తూ వస్తున్నారు. అయినా భవన నిర్మాణానికి కనీస చర్యలు తీసుకోలేదు. ఎంపీ చొరవతో సమకూరిన స్మారక భవన స్థలం విషయంలో కార్పొరేషన్ పాలక వర్గంపై పూర్తి పట్టున్న ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారన్న ప్రచారం పట్టణంలో సాగుతోంది. కేవలం నిర్మాణ అనుమతి ఇచ్చే విషయంలో కమిషనర్ సైతం నిస్సహాయంగా వ్యవహరించడం వెనుక ఎంపి, ఎమ్మెల్యే మధ్య వర్గ విభేదాలే ప్రధాన కారణం అన్న భావన నగర వాసుల్లో వ్యక్తమవుతోంది.

'అసమానతలు తొలగేలా, ఆర్థిక వ్యవస్థ గాడిన పడేలా' - తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో

40 కోట్ల నిధులు మంజూరైనా- ఆ స్మారక భవన నిర్మాణంపై నీలినీడలు!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.